Sabarimala
శబరిమల(Sabarimala) అయ్యప్ప ఆలయంలోని స్వర్ణ తాపడం వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ మొత్తం కేసులో తవ్వే కొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. స్వర్ణతాపడం అవకతవకల కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న దాత ఉన్నికృష్ణన్ గురించి విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. అతనికి ఖచ్చితమైన ఆదాయ వనరు లేదని తేలింది. అయినప్పటకీ ఆలయానికి పెద్ద ఎత్తున విరాళాలు అందజేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అతడు అందజేసే విరాళాలకు, ఐటీ శాఖ వద్ద ఉన్న వివరాలకు పొంతనే లేదని అధికారులు గుర్తించారు. ఇదే విషయాన్ని విజిలెన్స్ అధికారులు తమ నివేదికలో పొందుపరిచారు.
2017-2025 మధ్య ఉన్నికృష్ణన్ ఐటీ రిటర్న్స్ ను పరిశీలించిన అధికారులు దానిని హైకోర్టులో అందజేశారు. ఈ నివేదికను పరిశీలించిన హైకోర్టు సిట్ మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉన్నికృష్ణన్ బ్యాంకు అకౌంట్‌లో 10 లక్షల నగదు డిపాజిట్ అయ్యినట్టు గుర్తించారు. ఇంతకుమించి పెద్ద లావాదేవీలు ఏమీ జరగలేదు.
అయినప్పటకీ గర్భగుడి సువర్ణ తాపడం నిర్మాణం కోసం ఉన్నికృష్ణన్ ముందుకు రావడం పలు హామీలు ఇవ్వడం కూడా జరిగినట్టు తెలిసింది. అయితే దాతగా తన పేరే చెప్పుకుంటున్నా…. బళ్లారికి చెందిన వ్యాపారి గోవర్దన్ నిధులు అందజేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అలాగే శ్రీకోవెలకు గుమ్మం కూడా ఉన్నికృష్ణన్ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నా.. బెంళూరు వ్యాపారి అజికుమార్ దానిని అందజేశారు.
ఇవే కాదు పదునెట్టాంబడి అలంకరణల కోసం కూడా విరాళాలు ఇచ్చారు. అలాగే అన్నదాన మండప నిర్మాణానికి 10 లక్షలు, అన్నదానం కోసం 6 లక్షలు కూడా విరాళంగా అందజేశారు.. అలాగే, 2017లోనూ దాదాపు 10 లక్షల వరకూ విరాళాలు ఇచ్చినట్టు ఆలయ రికార్డుల్లో ఉంది. దీంతో ఉన్నికృష్ణన్ ఇస్తున్న విరాళాలు బ్లాక్ మనీనా, మరెవరిదగ్గరైనా తీసుకుని తన పేరు రాయించుకున్నాడా అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు విగ్రహాల బంగారు రేకుల మరమ్మతులు సహా సువర్ణ తాపడం పనులను ఉన్నికృష్ణన్‌కు అప్పగించడం వెనుక ఆలయ అధికారుల పాత్రపైనా కీలక విషయాలను విజిలెన్స్ తన నివేదికలో పేర్కొంది. డిప్యూటీ కమిషనర్, టీడీబీ సభ్యులే ఎటువంటి టెండర్లను పిలవకుండా నేరుగా కట్టబెట్టినట్టు గుర్తించింది.
విజిలిలెన్స్ నివేదిక వెల్లడించిన వివరాల నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఉన్నికృష్ణన్ ను ఏ1గానూ, టీడీబీ అధికారులను ఇతర నిందితుల జాబితాలో సిట్ చేర్చింది. కాగా ఉన్నికృష్ణన్ శబరిమల ఆలయంలో గతంలో జూనియర్ పూజారిగానూ పనిచేసిన విషయం కూడా బయటపడింది. అప్పుడున్న పరిచయాలను ఉపయోగించుకుని ఆలయంలో ఇప్పుడు చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తోంది.