India Economic Equality:ప్రపంచ బ్యాంకు(World Bank )విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఆర్థిక సమానత్వ సూచీలో భారత్ టాప్ 5 దేశాల్లోకి దూసుకెళ్లింది. అమెరికా, చైనా వంటి ఆర్థిక అగ్రరాజ్యాలు చివరి స్థానాల్లో నిలవగా, భారత్ మాత్రం నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఈ అద్భుతమైన ప్రగతికి దోహదపడినట్లు తెలుస్తోంది. ఈ దశాబ్ద కాలంలో దేశంలో ఏకంగా 17.1 కోట్ల మంది ప్రజలు తీవ్ర పేదరికం నుంచి బయటపడ్డారని ప్రపంచ బ్యాంకు నివేదించింది.
India Economic Equality
పేదరిక నిర్మూలనలో ఆదర్శంగా భారత్
ప్రపంచ బ్యాంకు గణాంకాల(World Bank Report) ప్రకారం, భారత్(Bharath) 25.5 గిని ఇండెక్స్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. 2011-12లో దేశంలో అత్యంత పేదరికం 16% ఉండగా, 2022-23 నాటికి అది కేవలం 2.3% కి తగ్గింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదరికాన్ని తగ్గించడానికి భారత్ చాలా కాలంగా చేస్తున్న కృషికి ఇది నిదర్శనం. ఇతర దేశాలతో పోలిస్తే, పేదరిక నిర్మూలనలో భారత్ ఆదర్శవంతమైన పనితీరును కనబరుస్తోంది.
ఈ ప్రగతికి కారణమైన ప్రధాన ప్రభుత్వ పథకాల్లో కొన్ని:
పీఎం జన్ ధన్ యోజన: బ్యాంకింగ్ సేవలను అందరికీ చేరువ చేయడం ద్వారా ఆర్థిక చేరికను పెంచింది.
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్స్ (DBTలు): ప్రభుత్వ పథకాల లబ్ధిని నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు చేర్చడం వల్ల అవినీతి తగ్గి, పారదర్శకత పెరిగింది.
ఆయుష్మాన్ భారత్: ఆరోగ్య సంరక్షణ సేవలను పేదలకూ అందుబాటులోకి తెచ్చింది.
స్టాండప్ ఇండియా: చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధిని ప్రోత్సహించి, ఆర్థిక స్వావలంబనకు తోడ్పడింది.
ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన: కోవిడ్-19 సమయంలో పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను అందించి, ఆహార భద్రతను పటిష్టం చేసింది.
ఈ పథకాలన్నీ దేశంలో ఆదాయ అసమానతలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి.
ప్రపంచ బ్యాంకు నివేదికలో గిని ఇండెక్స్‌లో ఇతర దేశాల స్థానం:
భారత్ కంటే ముందు సోవాక్ రిపబ్లిక్, స్లోవేనియా, బెలారస్ వంటి దేశాలు మాత్రమే ఉన్నాయి.
చైనా 35.7 పాయింట్లతో 65వ స్థానంలో ఉంది.
అమెరికా 41.8 పాయింట్లతో 90వ స్థానంలో నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా కేవలం 30 దేశాలు మాత్రమే మధ్యస్తంగా తక్కువ ఆదాయ అసమానతలు ఉన్న దేశాల సమూహంలో ఉన్నాయి. వీటిలో ఐస్‌లాండ్, నార్వే, ఫిన్లాండ్, బెల్జియం, పోలాండ్ వంటి దేశాలు ఉన్నాయి.
గిని ఇండెక్స్ అంటే ఏమిటి?
గిని ఇండెక్స్ లేదా గిని గుణకం అనేది ఒక దేశంలో కుటుంబాల మధ్య ఆదాయం మరియు సంపద పంపిణీ ఎంతవరకు సమానంగా ఉందో కొలిచే ఒక కొలమానం.
గిని ఇండెక్స్ విలువ 0 నుంచి 100 వరకు ఉంటుంది.
0 స్కోరు అనేది ఒక సమాజంలో పరిపూర్ణ ఆదాయ సమానత్వం ఉన్నట్లు సూచిస్తుంది ఇది అందరికీ ఒకే ఆదాయం ఉన్నట్లు చెబుతుంది.
100 స్కోరు అనేది అత్యధిక ఆదాయ అసమానతలు ఉన్న దేశంగా సూచిస్తుంది అంటే సంపద అంతా ఒకే వ్యక్తి లేదా కుటుంబం చేతిలో ఉండటం.
గిని ఇండెక్స్ ఎంత ఎక్కువగా ఉంటే, ఆ దేశంలో ఆదాయ అసమానతలు అంత ఎక్కువగా ఉన్నట్లు అర్థం. ఈ సూచీలో భారత్ నాలుగో స్థానంలో ఉండటం అంటే, ఇతర అనేక దేశాలతో పోలిస్తే మన దేశంలో ఆదాయ పంపిణీ మరింత సమానంగా ఉందని స్పష్టం అవుతోంది.