Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత శ్రీ పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరుకు సమీపంలో ఉన్న ఉడిపిలో గల ప్రఖ్యాత ఉడిపి శ్రీకృష్ణ మఠం (శ్రీకృష్ణ దేవాలయం) సందర్శించనున్నారన్న వార్తలతో మరోసారి ఉడిపి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అక్కడ ఏం ప్రత్యేకతలున్నాయంటూ గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు.
ఉడిపిలోని శ్రీకృష్ణ దేవాలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా, దక్షిణ మధురగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం వేల సంవత్సరాల చరిత్రను, అద్భుతమైన ఆధ్యాత్మిక విశిష్టతను కలిగి ఉంది. ఇక్కడి మూలవిరాట్టు బాలకృష్ణుడు (బాల్య రూపంలోని శ్రీకృష్ణుడు).
ఈ ఆలయంలో ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహం చరిత్ర ఒక అద్భుతం. ఈ విగ్రహాన్ని శ్రీకృష్ణుడు స్వయంగా రుక్మిణీ దేవికి ఇచ్చారని పురాణాలు చెబుతున్నాయి. అయితే, కాలక్రమేణా ఇది సముద్రంలో మునిగిపోయింది. క్రీ.శ. 13వ శతాబ్దంలో, ద్వైత సిద్ధాంత స్థాపకులు మరియు గొప్ప వేదాంతి అయిన శ్రీ మధ్వాచార్యులు ఈ ప్రాంతంలో తుఫానులో చిక్కుకున్న ఒక పడవను రక్షించారు.
కృతజ్ఞతగా, ఆ పడవలోని నావికులు ఆయనకు గోపీచందనంతో కప్పబడిన ఒక విగ్రహాన్ని ఇచ్చారు. మధ్వాచార్యులు దానిని శుభ్రం చేయగా, అది మనోహరమైన బాలకృష్ణుడి విగ్రహంగా తేలింది. అప్పటినుంచి మధ్వాచార్యులు ఈ విగ్రహాన్ని ఉడిపిలో ప్రతిష్ఠించి, కృష్ణ మఠాన్ని స్థాపించారు. ఈ విగ్రహం పూర్తిగా రత్నాలతో, వజ్ర వైడూర్యాలతో అలంకరించబడి భక్తులకు కనువిందు చేస్తుంది.
కనకదాసు కథ – కిటికీ దర్శనం వెనుక మర్మం (కనకన కిండి).. ఉడిపి దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ స్వామివారిని ఆలయ ప్రధాన ద్వారం గుండా కాకుండా, వెనుక వైపున ఉన్న ఒక చిన్న కిటికీ (‘కనకన కిండి’ లేదా కనక కిటికీ) ద్వారా మాత్రమే దర్శనం చేసుకోవాలి. దీని వెనుక అత్యంత భక్తిపూర్వకమైన, హృదయాన్ని కదిలించే చరిత్ర ఉంది.
పూర్వకాలంలో, ఉడిపి ఆలయంలో మడి-ఆచారాలకు, వర్ణాంతర నియమాలకు అత్యంత కఠినమైన ప్రాధాన్యత ఉండేది. పూర్వం కనకదాసు అనే గొప్ప భక్తుడు, మహాకవి ఉండేవాడు. ఆయన కుల పరమైన కారణాల వల్ల ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి వీలుండేది కాదు. ప్రవేశం దొరకకపోయినా కూడా, కనకదాసు వెనుక వైపు ఉన్న గోడ పక్కనే నిలబడి, గోడకు దగ్గరగా ఉన్న ఒక చిన్న రంధ్రం లేదా కిటికీ వైపు చూస్తూ, అత్యంత బాధతో, భక్తితో కృష్ణ నామ స్మరణ చేస్తూ, కీర్తనలు పాడుతూ ఉండేవాడు.
కనకదాసు యొక్క అచంచలమైన భక్తికి ముగ్ధుడైన బాలకృష్ణుడు ఒకరోజు రాత్రి అద్భుతం సృష్టించారు. భక్తుడిని చూడటానికి, దర్శనం ఇవ్వడానికి వీలుగా, మూల విరాట్ విగ్రహం ప్రధాన ద్వారం వైపు కాకుండా, కనకదాసు ఉన్న కిటికీ వైపునకు అకస్మాత్తుగా తిరిగింది! అంతేకాకుండా, ఎదురుగా ఉన్న గోడ కూడా పగిలి, మార్గం ఏర్పడింది.
ఆరోజు నుంచి, కృష్ణుడు తన ప్రియ భక్తుడైన కనకదాసు కోసం తిరిగిన ఆ కిటికీ గుండానే భక్తులు స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది. ఇది ‘భక్తి ముందు కుల, మత, అడ్డుగోడలు లేవు’ అనే గొప్ప సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పే చారిత్రక సాక్ష్యం.
ఈ ఆలయంలో సాధారణ పూజారులు ఉండరు. శ్రీ మధ్వాచార్యులచే స్థాపించబడిన అష్ట మఠాల (ఎనిమిది మఠాలు) పీఠాధిపతులు మాత్రమే ఆలయ నిర్వహణ , పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఎనిమిది మఠాల పీఠాధిపతులు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఆలయ నిర్వహణ బాధ్యతలను మారుతూ పర్యవేక్షిస్తారు.
ఉడిపి శ్రీకృష్ణ మఠం నిత్యం అన్నదానానికి ప్రసిద్ధి. దేశంలోని అత్యంత గొప్ప అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ నిరంతరం కొనసాగుతాయి. స్వామివారు వజ్రాలు, వైడూర్యాలు, బంగారం వంటి అత్యంత విలువైన ఆభరణాలతో నిత్యం దివ్యంగా అలంకరించబడి ఉంటారు.
ఆలయ ప్రాంగణంలో గోశాల ఉంటుంది. స్వామివారికి నివేదనలు, పూజలు గోవుల పాల ఉత్పత్తులతోనే జరుగుతాయి.ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించి, బాలకృష్ణుడి ఆశీస్సులు తీసుకోనున్నారు.
