ISRO: టవర్‌లు లేకుండా ఇంటర్నెట్ సాధ్యమేనా? ఇస్రో కొత్త టార్గెట్ ఏంటి?

ISRO: మన దేశీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, "టవర్ లేకుండానే నేరుగా మొబైల్ ఫోన్‌లకు ఇంటర్నెట్" అందించే దిశగా ఒక పెద్ద అడుగు వేస్తోంది.

ISRO

మనం ఇప్పటివరకు ఇంటర్నెట్ అంటే మొబైల్ టవర్లు, ఫైబర్ కనెక్షన్లు అని మాత్రమే అనుకున్నాం. కానీ, భవిష్యత్తులో ఈ పరిస్థితి మారబోతోంది. మన దేశీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, “టవర్ లేకుండానే నేరుగా మొబైల్ ఫోన్‌లకు ఇంటర్నెట్” అందించే దిశగా ఒక పెద్ద అడుగు వేస్తోంది. డిజిటల్ ఇండియా కలను సాకారం చేసే దిశగా ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు అని చెప్పవచ్చు.

ఈ టెక్నాలజీలో సిగ్నల్ నేరుగా ఉపగ్రహం నుంచి మన స్మార్ట్‌ఫోన్‌కు అందుతుంది. మధ్యలో ఎలాంటి టవర్లు, బేస్ స్టేషన్లు అవసరం లేదు. దీనివల్ల డెడ్‌స్పాట్‌లు, దట్టమైన అడవులు, లోయలు, కొండ ప్రాంతాలు, సముద్రాల్లో కూడా మన సాధారణ 4G/5G మొబైల్ ఫోన్‌తో ఇంటర్నెట్, వాయిస్ కాల్స్ ఉపయోగించుకోవచ్చు.

ISRO

అక్టోబర్‌లో శ్రీహరికోట నుంచి ఇస్రో తన భారీ రాకెట్ LVM-3 (బాహుబలి) ద్వారా అమెరికాకు చెందిన AST Space Mobile అనే సంస్థ తయారుచేసిన బ్లూబర్డ్-2 కమర్షియల్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. ఈ ప్రాజెక్ట్‌లో ఇస్రో కేవలం లాంచ్ సేవలను మాత్రమే అందిస్తుంది. టెక్నాలజీ, డేటా నియంత్రణ మొత్తం అమెరికా సంస్థ ఆధీనంలో ఉంటాయి.

ఇదే స్థాయిలో, నేరుగా సాధారణ మొబైల్ ఫోన్‌కు కనెక్టివిటీ అందించే పూర్తిస్థాయి కమర్షియల్ ప్రాజెక్టులు ప్రపంచంలో ఇంకా ఎవరూ ప్రారంభించలేదు. ఎలన్ మస్క్ స్టార్‌లింక్, ఎయిర్‌టెల్-వన్‌వెబ్, అమెజాన్ వంటి సంస్థల ప్రాజెక్టులు ఇంకా టెస్టింగ్ దశలోనే ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ప్రయోగానికి ఇస్రో వేదికగా మారడం భారత్‌కు ఒక గొప్ప గౌరవం.

రిమోట్ ఏరియాలకు ఇంటర్నెట్.. హిమాలయాలు, గిరిజన ప్రాంతాలు, మరియు టవర్లు లేని ప్రదేశాలకు ఇంటర్నెట్ సదుపాయం లభిస్తుంది.

ISRO

విపత్తుల్లో కనెక్టివిటీ.. తుఫానులు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల్లో టవర్లు దెబ్బతిన్నా కూడా కమ్యూనికేషన్ కొనసాగుతుంది.

డిజిటల్ డివైడ్ తగ్గించడం.. గ్రామీణ ,పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న డిజిటల్ వ్యత్యాసం తగ్గేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుంది.

అయితే ఈ టెక్నాలజీకి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఇది కొత్త టెక్నాలజీ కాబట్టి ఖర్చు ఎక్కువగా ఉండొచ్చు. అలాగే, జియో, లేదా ఫైబర్ నెట్‌వర్క్‌ల లాగా అధిక స్పీడ్ ఉండకపోవచ్చు. ముఖ్యంగా వర్షాలు, తుఫానులు వంటి వాతావరణ పరిస్థితులు సిగ్నల్‌ను ప్రభావితం చేయవచ్చు. భద్రతా పరమైన అంశాలు, చట్టపరమైన నిబంధనలు కూడా ఈ ప్రాజెక్టుకు సవాళ్లు విసిరే అవకాశం ఉంది.

ఈ(ISRO) ప్రయోగం అక్టోబర్‌లో జరగనుంది. వాణిజ్యపరమైన సేవలు 2026 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, భారతదేశంలోని ప్రతి మొబైల్ వినియోగదారుడికి ఇది చేరుకోవడానికి మరికొంత సమయం పట్టొచ్చు. ఏది ఏమయినా సరే..టవర్లు లేకుండా ఇంటర్నెట్ అందించాలనే ఈ కల త్వరలో నిజం కానుంది. ఇది గ్రామీణ, రిమోట్ ప్రాంతాలలో డిజిటల్ విప్లవానికి కొత్త దిక్సూచి అవుతుందంటున్నారు నిపుణులు.

Tulaja Bhavani: తుళజా భవానీ.. శత్రు నాశనం, విజయం ప్రసాదించే తల్లి

Exit mobile version