India
గత ఏడాది భారత్(India), పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధ పరిస్థితులను, తర్వాత పరిణామాలను క్యాష్ చేసుకునేందుకు పలువురు విదేశీ నేతలు ప్రయత్నించారు. ముక్యంగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఈ యుద్ధాన్ని తానే ఆపానంటూ స్టేట్ మెంట్ల మీద స్టేట్ మెంట్లు ఇచ్చారు. తన జోక్యంతోనే భారత్ (India)వెనక్కి తగ్గిందన్నారు. అయితే ఈ కామెంట్స్ ను భారత్ అప్పుడే ఖండించింది. యుద్ధం ఆపడంలో ట్రంప్ పాత్ర ఏమీ లేదని స్పష్టం చేసింది.
అయినా కూడా ట్రంప్ మాత్రం సమయం దొరికినప్పుడల్లా ఇవే వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. ఇప్పుడు భారత్(India) , పాక్ యుద్ధం ఆపామంటూ చైనా కొత్త పల్లవి మొదలుపెట్టింది. ఇటీవల బీజింగ్‌లో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు వివాదాలను పరిష్కరించడంలో చైనానే కీలక పాత్ర పోషించిందన్నారు. మయన్మార్, ఇరాన్ అణు సమస్యలతో పాటు భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను కూడా తమ మధ్యవర్తిత్వం ద్వారా తగ్గించామంటూ వ్యాఖ్యానించారు.
చైనాతో సంబంధాలపై ప్రధాని మోదీ చేసిన ప్రకటనే దీనికి ఉదాహరణగా చెప్పుకొచ్చారు. అయితే చైనా వాదనలను భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. ఈ ఘర్షణలు కేవలం ఇరు దేశాల డీజీఎంఓల మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ద్వారానే ముగిశాయని స్పష్టం చేసింది. మే 10న జరిగిన ఫోన్ కాల్ ద్వారానే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని.. దీనిలో మూడో దేశం ప్రమేయం ఏమాత్రం లేదని భారత్ (India)తేల్చి చెప్పింది. ట్రంప్ విషయంలో కూడా భారత విదేశాంగ శాఖ ఇంతే స్పష్టమైన ప్రకటన చేసింది.
అయితే ఆపరేషన్ సిందూర్ ముగిసిన ఏడు నెలల తర్వాత చైనా ఈ క్రెడిట్ తమదే అంటూ మాట్లాడుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం అప్పుడే చెప్పకుండా ఎందుకు సైలెంట్ గా ఉందంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. పైగా ట్రంప్ పదే పదే తానే యుద్ధాన్ని ఆపానంటూ చెప్పినప్పుడు కూడా చైనా రియాక్ట్ కాకపోవడాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా శాంతి శాంతి అంటూ మాట్లాడుతూనే పాకిస్తాన్‌కు భారీగా ఆయుధాలు ఇచ్చిందని భారత సైనిక వర్గాలు గుర్తించాయి. అలాంటి చైనా ఇప్పుడు తామే ఆపామంటూ కొత్త రాగం తీయడం అనుమానాలకు తావిస్తోంది.
