Modi :మోదీ డిగ్రీ వివాదం.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

Modi :ఆగస్టు 25న జస్టిస్ సచిన్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది.

Modi

పదేళ్లుగా దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యా అర్హతల వివాదంపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రధాని డిగ్రీ వివరాలను బయటపెట్టాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. ప్రధాని మోదీ బ్యాచిలర్ డిగ్రీ వివరాలు, అలాగే 1978లో ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ చదివిన విద్యార్థుల అకడమిక్ రికార్డులను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.ప్రజల హక్కులకు, వ్యక్తిగత గోప్యతకు ఏది ముఖ్యమో తేల్చి చెప్పిన ఈ తీర్పు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది.

ఈ చట్టపరమైన పోరాటం దాదాపు తొమ్మిదేళ్ల క్రితం, 2016లో, ఒక సమాచార హక్కు చట్టం (RTI) దరఖాస్తుతో ప్రారంభమైంది. ప్రధాన మంత్రి మోదీ (Modi) ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నట్లుగా, 1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ డిగ్రీ పొందిన విద్యార్థులందరి రికార్డులను పంచుకోవాలని ఆ దరఖాస్తు కోరింది. ఢిల్లీ యూనివర్సిటీ మొదట్లో ఈ దరఖాస్తును తిరస్కరించింది.

ఈ వివరాలు మూడవ వ్యక్తికి సంబంధించినవి కాబట్టి వాటిని బహిర్గతం చేయడం కుదరదని యూనివర్సిటీ వాదించింది. అయితే, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (CIC) ఈ వాదనను అంగీకరించలేదు. ప్రజా జీవితంలో ఉన్న ప్రముఖులు, ముఖ్యంగా ప్రధానమంత్రి వంటివారి విద్యా అర్హతలు పారదర్శకంగా ఉండాలని పేర్కొంటూ రికార్డుల తనిఖీకి అనుమతి ఇవ్వాలని ఆదేశించింది.

ఢిల్లీ యూనివర్సిటీ సీఐసీ ఆదేశాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో ఢిల్లీ యూనివర్సిటీ తరపున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కొన్ని వేల మంది విద్యార్థుల వ్యక్తిగత గోప్యతను కాపాడటం ప్రజా ప్రయోజనాల కంటే ముఖ్యమని ఆయన వాదించారు.

రికార్డులను బహిర్గతం చేయడం ద్వారా ప్రమాదకరమైన సంప్రదాయం ఏర్పడుతుందని, అది భవిష్యత్తులో ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను ప్రభావితం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే, అవసరమైతే ఆ రికార్డులను కోర్టుకు సమర్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కానీ వాటిని బహిరంగపరచడం మాత్రం సాధ్యం కాదని మెహతా తెలిపారు.

ఈ రికార్డులను కోరిన కార్యకర్తలు మరో వాదనను తెరపైకి తెచ్చారు. సమాచార హక్కు చట్టం దరఖాస్తుదారుడి ఉద్దేశాన్ని పరిగణనలోకి తీసుకోదని వారు స్పష్టం చేశారు. ఒక డిగ్రీ అనేది ప్రభుత్వం ద్వారా మంజూరు చేయబడిన అర్హత అని, అది వ్యక్తిగత గోప్యతా అంశం కాదని వాదించారు. ప్రధానమంత్రి విద్యా అర్హతలు ఒక ముఖ్యమైన ప్రజా ప్రయోజన అంశమని వారు బలంగా చెప్పారు.

Modi

ఈ సుదీర్ఘ వాదోపవాదాల అనంతరం ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 27న తన తీర్పును రిజర్వ్ చేసింది. కాగా ఈరోజు ఆగస్టు 25న జస్టిస్ సచిన్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది. యూనివర్సిటీ వాదనలను సమర్థిస్తూ, పాత రికార్డులను బయటపెట్టాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ తీర్పుపై అప్పీల్ చేస్తే ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరుకునే అవకాశం ఉంది.

Exit mobile version