Mumbai
మహారాష్ట్రలో వరుసగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ముంబై, థానే నగరాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయం కావడంతో, ప్రజల ప్రయాణాలు, ఆరోగ్య సేవలు, విద్యా వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడింది.
ఎడతెరిపిలేని వర్షాల వల్ల ఈ ప్రాంతంలో రవాణా వ్యవస్థ పూర్తిగా గందరగోళానికి గురైంది.ముంబైకి జీవనాడి అయిన లోకల్ రైళ్లు చాలా చోట్ల నిలిచిపోయాయి. రైల్వే ట్రాక్లు నీటిలో మునిగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని దూరప్రాంత రైళ్లు కూడా రద్దు అయ్యాయి లేదా రీషెడ్యూల్ చేయబడ్డాయి.
ప్రధాన రహదారులు, ఫ్లైఓవర్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో బస్సులు, ఇతర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాలలో ప్రజలు నడుము లోతు నీటిలో నడవాల్సి వస్తుంది. ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరే విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని విమానాలు రద్దయ్యాయి, మరికొన్నింటిని దారి మళ్లించారు.
భారీ వర్షాల కారణంగా ప్రజల ఆరోగ్యం, విద్య రంగాలపై కూడా తీవ్ర ప్రభావం పడింది. నీరు నిలిచిపోవడం వల్ల సీజనల్ వ్యాధులు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పెరిగే ప్రమాదం ఉందని ఆరోగ్య అధికారులు హెచ్చరించారు. ఆసుపత్రులకు చేరుకోవడం కష్టంగా మారడంతో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలుగుతోంది.
విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని, ముంబై, థానే పట్టణాల్లో స్కూల్స్‌కు, కాలేజీలకు కొన్ని రోజుల పాటు సెలవులు ప్రకటించారు.
ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పరిస్థితిని సమీక్షించి, రాబోయే 48 గంటలు కీలకమని తెలిపారు. సైన్యం, విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. అయితే, ప్రజల కష్టాలు మాత్రం కొనసాగుతున్నాయి. సోషల్ మీడియాలో తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ, ఈ పరిస్థితిపై నెటిజన్లు స్పందిస్తున్నారు.