Pooja Sharma:అనాథల శవాలకు ఆమె కన్నకూతురు.. పూజా శర్మ మానవత్వ ప్రయాణం ఎలా మొదలయింది?

Pooja Sharma: మరణించిన తర్వాత కూడా మనిషికి దక్కాల్సిన గౌరవం దక్కాలని పూజాశర్మ చేస్తున్న ఈ పోరాటంతో, సమాజంలో చచ్చిపోతున్న మానవత్వాన్ని మళ్లీ బతికిస్తున్నారనే చెప్పాలి.

Pooja Sharma

చావు పుట్టుకలు అందరికీ సమానమే అయినా.. అందరికీ బంధుమిత్రుల మధ్య చనిపోయే అదృష్టం ఉండదు. ఎంతోమంది అనాథలుగా, రోడ్ల పక్కన, ఆసుపత్రి మార్చురీలలో అనాథలుగా ఎవరూ పట్టించుకోని స్థితిలో ప్రాణాలు విడుస్తూ ఉంటారు. అటువంటి మృతదేహాలకు దిక్కులేని వారిగా వదిలేయకుండా వారికి కడసారి గౌరవం కల్పించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు పూజా శర్మ(Pooja Sharma).

ఒక యువతిగా, అది కూడా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి, ఈ నాలుగేళ్లలోనే సుమారు 6వేల మంది వరకూ  అనాథ శవాలకు ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించడం అంటే అదేమీ సామాన్యమైన విషయం కాదు. శవాన్ని ముట్టుకోవడానికే భయపడే ఈ రోజుల్లో, అందులోనూ అనాథ శవాన్ని చూసి ఆమడ దూరం నుంచే అసహ్యించుకునే ఈ రోజుల్లో.. ఆమె ప్రతి మృతదేహాన్ని తన సొంత కుటుంబ సభ్యుడిలా భావించి తుడి వీడ్కోలు పలుకుతున్నారు.

పూజా శర్మ(Pooja Sharma) ఈ బాధ్యతను స్వీకరించడం వెనుక ఒక గుండెను పిండేసే విషాదం ఉందన్న విషయం చాలామందికి తెలీదు. 1996లో ఢిల్లీలో జన్మించిన 2022లో ఆమె తల్లి అనారోగ్యంతో మరణించడంతో ఆమె జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. ఆ తర్వాత కొద్ది రోజులకే, పూజాశర్మ కళ్లముందే తన అన్నయ్యను కొందరు కిరాతకంగా హత్య చేయడంతో.. ఆ విషాదాన్ని భరించలేక తండ్రి కోమాలోకి వెళ్లారు.

Pooja Sharma

అలాంటి కష్ట సమయంలో బంధువులెవరూ సాయం చేయకపోవడంతో, తన అన్నయ్య అంత్యక్రియలను పూజాశర్మ స్వయంగా నిర్వహించాల్సి వచ్చింది. ఆ అనుభవమే ఆమెలో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించింది. నా అన్నయ్యకు నేను ఉన్నాను కాబట్టి అంత్యక్రియలు జరిపించాను.కానీ ఎంతో మంది దిక్కులేకుండా చనిపోతుంటారు అలాంటి వారికి ఎవరు దిక్కు? అన్న ప్రశ్నతోనే ఆమె ‘బ్రైట్ ది సోల్’ (Bright The Soul) అనే స్వచ్ఛంద సంస్థ మొదలయింది. దీని కోసం తాను చేస్తున్న హెచ్.ఐ.వి కౌన్సిలర్ ఉద్యోగాన్ని కూడా వదిలేసి పూర్తిస్థాయిలో ఈ సేవకు అంకితమయ్యారు.

పూజా శర్మ కేవలం అనాథ శవాలకు అంత్యక్రియలు చేయడమే కాదు, మరణించిన వ్యక్తి మతం గురించి తెలిస్తే మాత్రం.. వారి ఆచారాల ప్రకారం అంటే హిందూ, ముస్లిం లేదా క్రైస్తవ కార్యక్రమాలు జరిపిస్తారు. కుళ్లిపోయిన మృతదేహాలకు కూడా స్నానం చేయించి, కొత్త బట్టలు కప్పి, పూలమాలలతో గౌరవంగా అంతిసంస్కారాలు జరుపుతారు. మరణించిన తర్వాత కూడా మనిషికి దక్కాల్సిన గౌరవం దక్కాలని పూజాశర్మ చేస్తున్న ఈ పోరాటంతో, సమాజంలో చచ్చిపోతున్న మానవత్వాన్ని మళ్లీ బతికిస్తున్నారనే చెప్పాలి.

మరిన్ని నేషనల్ న్యూస్అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version