Streets dogs
దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కల సమస్య ఇప్పుడు తీవ్ర వివాదాంశంగా మారింది. వీధి కుక్కల బెడద, ముఖ్యంగా పిల్లలపై దాడులు మరియు రేబిస్ కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ సుప్రీంకోర్టు (Supreme Court)ఇటీవల సంచలన ఆదేశాలు జారీ చేసింది.
ఆగస్టు 11న సుప్రీంకోర్టు ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్ ప్రాంతాల్లోని వీధి కుక్కల(street dogs)ను పట్టుకని, కొత్తగా ఏర్పాటు చేసే షెల్టర్లకు ఆరు నుంచి ఎనిమిది వారాలలో తరలించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియలో దాదాపు పది లక్షల కుక్కలను తరలించాలని అంచనాలున్నాయి. ఈ కుక్కలు ఇకపై వీధుల్లోకి రాకుండా చూసుకోవాలని, వాటికి స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ వంటి ఆరోగ్య నిర్వహణ చర్యలు చేపట్టాలని అధికారులను కోర్టు ఆదేశించింది. ఆదేశాల అమలును ఎవరూ అడ్డుకోవద్దని కూడా కోర్టు హెచ్చరించింది.
అయితే, ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ నాయకుడు రాహుల్ గాంధీ ఈ నిర్ణయాన్ని మానవత్వ రహితమైనదిగా, శాస్త్రీయ దృక్పథం లోపించినదిగా చెప్పారు. వీధి కుక్కల(Streets dogs)ను తొలగించడం వల్ల వాటి స్థానంలో ఎలుకలు, కోతులు పెరిగి, జీవవైవిధ్యం దెబ్బతినే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే, మేనకా గాంధీతో పాటు ప్రముఖ సినీ నటులైన జాన్ అబ్రహం, వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, అడివి శేష్ వంటి వారు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దాదాపు పది లక్షల కుక్కలను షెల్టర్లలో ఉంచి, నిర్వహించడం భారీ ఖర్చుతో కూడుకున్నదని, సరైన వసతులు లేకపోతే అది వాటికి ‘మరణశిక్ష’ అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పునరాలోచన చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు.
పేటా ఇండియా వంటి జంతు సంరక్షణ సంస్థలు మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచనల ప్రకారం, కుక్కలను షెల్టర్లకు తరలించడం కంటే, వాటికి మానవీయ పద్ధతిలో స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ చేయడం, సమాజంతో సహజంగా జీవించేలా చూడటం మరింత సమర్థవంతమైన మార్గాలని వాదిస్తున్నారు. ఈ పద్ధతుల ద్వారా కుక్కల సంఖ్యను నియంత్రించవచ్చని, అదే సమయంలో పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని వారు పేర్కొన్నారు.
ఈ వివాదం ప్రజా భద్రత, జంతు హక్కుల మధ్య ఉన్న సంక్లిష్టతను తెలియజేస్తుంది. ఒకవైపు ఢిల్లీలో సంవత్సరానికి దాదాపు 30,000 మంది కుక్క కాటుకు గురవుతుండడం, రేబిస్ వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుండడం వంటివి ఆందోళన కలిగించే అంశాలు. మరోవైపు, జంతు హక్కుల కార్యకర్తలు, సినీ ప్రముఖులు ఈ నిర్ణయం మానవత్వ రహితమని వాదిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు ప్రభుత్వం, అధికారులు ఎలా స్పందిస్తారో, అలాగే ఈ సమస్యకు ఎలాంటి సమగ్ర పరిష్కారం లభిస్తుందో వేచి చూడాలి. ఏది ఏమయినా అందరికీ ఆమోదయోగ్యమైన, శాస్త్రీయమైన , మానవీయ విధానం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.