Sabarimala
కేరళలోని ప్రముఖ శబరిమల(Sabarimala) ఆలయంలో మాయమైన బంగారం కేసు దర్యాప్తు అనూహ్యంగా కీలక మలుపు తిరిగింది. ఆలయానికి చెందిన ఈ బంగారం కర్ణాటకలోని బళ్లారిలో పట్టుబడడం తీవ్ర కలకలం రేపింది. కేరళ సిట్ (Special Investigation Team) బృందం మొత్తం 476 గ్రాముల పసిడిని స్వాధీనం చేసుకుంది.
బళ్లారిలో పట్టుబడిన ఈ బంగారానికి సంబంధించి, సిట్ అధికారులు బళ్లారికి చెందిన రొద్దం జ్యువెలర్స్‌ను సీజ్ చేశారు. ఈ జువెలర్స్ యజమాని అయిన గోవర్థన్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం గోవర్థన్‌ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
శబరిమల(Sabarimala) బంగారం మాయం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్ పొట్టి అనే వ్యక్తి, 2019 సంవత్సరంలో ఈ బంగారాన్ని గోవర్థన్‌కు విక్రయించినట్టు సిట్ గుర్తించింది. ఉన్నికృష్ణన్, గోవర్థన్‌కు మధ్య జరిగిన ఈ లావాదేవీలపై సిట్ ప్రత్యేకంగా దృష్టి సారించింది.
ఈ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్‌ను సిట్ బృందం అక్టోబర్ 30వ తేదీ వరకు కస్టడీలోకి తీసుకుంది. ఉన్నికృష్ణన్ అందించిన సమాచారం మేరకే సిట్ అధికారులు బళ్లారితో పాటు బెంగళూరులోనూ సోదాలు నిర్వహించారు. మరిన్ని విషయాలు వెలుగులోకి రావడంతోపాటు, బంగారం యొక్క గుట్టు మొత్తం బయటపడుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఉన్నికృష్ణన్‌ను త్వరలో సిట్ అధికారులు చెన్నైకి కూడా తీసుకెళ్లనున్నారు.
శబరిమలలోని బంగారు తాపడాలకు మరమ్మత్తుల పనులను స్పాన్సర్ చేసేందుకు ఉన్నికృష్ణన్ 2019లో ముందుకు వచ్చాడు. పనుల కోసం బంగారు పూతతో ఉన్న ఆ రాగి తాపడాలను తొలగించే సమయంలో వాటి బరువు 42.8 కిలోలుగా ఉంది. అయితే, తాపడాల మరమ్మత్తుల పనులు పూర్తయిన తర్వాత వాటిని తిరిగి తూచి చూడగా బరువు 38.28 కేజీలుగా తేలింది. సుమారు 4.5 కేజీలకు పైగా బంగారం మాయం కావడంతో ఈ వివాదం పెద్ద ఎత్తున రాజుకుంది.
ఈ శబరిమల(Sabarimala) బంగారం మాయం కేసు కేరళలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ స్కామ్‌పై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆందోళనలు కొనసాగిస్తోంది. కేరళ బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖరన్, తిరువనంతపురంలో ఉన్న సెక్రటేరియట్ ముందు ఏకంగా 24 గంటల పాటు దీక్షను కొనసాగిస్తున్నారు.
