flight journey: జూన్ 12న అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా(Air India) విమానంలో 271 మంది చనిపోయారు. అయితే అక్కడితో ఆగలేదు. ఈ రెండు నెలల్లోనే వరుసగా ఎన్నో ఘటనలు జరిగాయి.విమానాలలో ఏర్పడిన సాంకేతిక లోపాలతో .. లక్కీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకపోయినా ప్రయాణికుల్లో టెన్షన్, ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తాయి. ఇలా ఒకటి కాదు రెండు ఎన్నో జరిగాయి…జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆదివారం జూలై 20న కూడా ఏపీలో రెండు విమానాలు సాంకేతిక లోపంతో తిరిగి వచ్చేసాయి. ఎయిర్ లైన్స్ సంస్థలకు డీజీసీఏ వార్నింగ్ ఇచ్చినా ఇంకా అడుగడుగునా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. దీంతో విమాన ప్రమాదాలు అంటేనే భయపడే పరిస్థితి తలెత్తింది.
flight journey..
ఈ మధ్య ఫ్లైట్ ఎక్కిన ప్రతిసారీ ప్రయాణికుల గుండెల్లో ప్రశ్న మాత్రం ఒక్కటే సేఫ్‌గా దిగుతామా అనే. ఎందుకంటే.. గమ్యం చేరతామనే ఆశ కంటే, ప్రయాణం మధ్యలో ఏదైనా జరుగుతుందేమోనన్న టెన్షనే ఎక్కువవుతోంది. టికెట్ చేతిలో పెట్టుకుని, గేట్‌లో లైన్‌లో నిలబడినప్పుడే మొదలయ్యే ఆ ఆలోచన… టేకాఫ్ తర్వాత గాల్లో తేలిన ప్రతీ ఒక్క ప్రయాణికుడి గుండె వేగం పెరుగుతుందంటే అది అతిశయోక్తి కాదు.
జూన్ 12న అహ్మదాబాద్ విమానాశ్రయంలో జరిగిన ఘోరం ఈ భయం మొదటి ఘటన కాకపోయినా ఇది అతిపెద్ద ప్రమాదంగా కచ్చితంగా చరిత్రలో నిలిచిపోయే ప్రమాదం అది . లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI-171 టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే రెండు ఇంజిన్లు ఫెయిల్ అవ్వడం… కంట్రోల్ కోల్పోవడం… కేవలం కొన్ని నిమిషాల్లోనే భయంకరమైన ప్రమాదం జరిగి..271 మంది ప్రాణాలు బలి కావడం దేశాన్ని షాక్‌లోకి నెట్టింది. అయితే దానితో ఇక మీదట జాగ్రత్తలు పెరుగుతాయనే ఆశ ప్రతి ఒక్కరిలో వచ్చింది.కానీ ఆ ఆశ గాలిలోనే కలిసిపోయింది. ఎందుంటే అహ్మదాబాద్ తర్వాత రెండు నెలల్లోనే వరుస సంఘటనలు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి.
జూలై 19… హైదరాబాద్ (Hyderabad)నుంచి ఫూకెట్ వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం IX-110 టేకాఫ్ అయిన 15 నిమిషాల్లోనే టెక్నికల్ లోపం బయటపడింది. గాల్లో ఏ దిక్కూ కనిపించక పోవడంతో పైలట్ వెంటనే విమానాన్ని తిరిగి మలుపు తిప్పాడు. సుమారు 6:57కి విమానం తిరిగి ల్యాండ్ (emergency landing)అయింది. ప్రయాణికులు అంతా రన్‌వే దిగిన తర్వాతే మళ్లీ ఊపిరి పీల్చుకున్నారు.
జూలై 21… తిరుపతి-హైదరాబాద్ రూట్లో రెండు ఇండిగో విమానాలు — మొదట ఉదయం 6:19కి బయలుదేరిన 6E 2696 విమానం, టేకాఫ్ తర్వాత ఏర్పడిన సాంకేతిక లోపంతో తిరిగి రన్‌వేకి వచ్చి ల్యాండ్ అయింది. ఆ రాత్రే మరో ఇండిగో విమానం 6E 6591 టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపంతో తిరిగి తిరుపతికే ల్యాండ్ అయింది. రెండు గంటల వ్యవధిలో రెండు విమానాలు గాల్లో టెక్నికల్ లోపాలతో తిరిగి రావడం, విమాన ప్రయాణ భద్రత ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా చూపించింది.
అలాగే జూలై 17న ఢిల్లీ నుంచి ఇంఫాల్ వెళ్తున్న ఇండిగో(IndiGo) విమానం టేకాఫ్ తర్వాత సాంకేతిక సమస్యలతో PAN PAN సిగ్నల్ ఇచ్చి ముంబైకి ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. జూన్ 18న రాయపూర్‌లో ఇండిగో విమానంలో డోర్ ఓపెన్ కాక ప్రయాణికులు 40 నిమిషాలపాటు విమానంలోనే చిక్కుకున్నారు.
ప్రతి వారం ఏదో ఒక ఘటనతో.. ప్రయాణికులకు ఫ్లైట్ ఎక్కిన ప్రతీసారి తాము గమ్యానికి చేరతామా అనే నమ్మకం తగ్గిపోతుంది. టెక్నికల్ ఇష్యూస్‌కి కారణాలు అడిగితే.. భద్రతే మా మొదటి ప్రాధాన్యత అనే సమాధానాలు వినిపిస్తున్నాయి కానీ ప్రయాణికులు గాల్లోంచి భద్రత కనిపించట్లేదు.
డీజీసీఏ (DGCA )కొన్ని సంస్థలకు వార్నింగ్ లేఖలు ఇచ్చింది. అయినా… రోజు వారం తప్పకుండా మరో మిడ్ ఎయిర్ ఇష్యూ వార్తల్లో దర్శనం ఇస్తోంది. భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విమాన రంగంగా పేరు తెచ్చుకుంటున్నా… ప్రయాణికుల భద్రత విషయంలో మాత్రం గ్యారెంటీ ఇవ్వడంలో ఫెయిల్ అవుతోంది.
ఇప్పటికైనా ఈ పరిస్థితికి చెక్ పడుతుందా? ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రయాణికుల జీవితాలకు విలువ ఇస్తాయా? డీజీసీఏ పర్యవేక్షణ కేవలం చెక్ లిస్టులకే కాకుండా నిజమైన మార్పు తీసుకురావడానికే మారుతుందా? గమ్యం చేరడంతో పాటు , సురక్షితంగా చేరుతామనే ధీమాను ఇవ్వడం కూడా అన్నవిషయాన్ని ఎయిర్‌లైన్ సంస్థలు గుర్తిస్తాయా? ప్రజల నమ్మకాన్ని తిరిగి ఇస్తాయా? చూడాలి మరి.