Yana:ది బెస్ట్ టూరిస్ట్ స్పాట్..యాణ

Yana: భైరవేశ్వర శిఖరం కింద ఒక సహజసిద్ధమైన ఆలయ గుహలో స్వయంభూగా వెలిసిన శివలింగం ఉంది

Yana

కర్ణాటకలోని బెస్ట్ టూరిస్ట్ ప్రదేశాలలో యాణ(Yana) ఒకటి. దట్టమైన అడవులలో, జలపాతాలు, వన్యప్రాణుల మధ్య అడుగుపెడితే చాలు ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. ఉత్తర కన్నడ జిల్లాలోని సిర్సి , కుమ్తా అడవుల మధ్య ఉన్న ఈ యాణ గ్రామం కేవలం ప్రకృతి అందాలకే కాదు, పరిశుభ్రతలో కూడా దేశంలోనే ఒక ఆదర్శం.

దేశవ్యాప్తంగా పరిశుభ్రతలో రెండో స్థానంలో ఉన్న ఈ గ్రామం, ప్రపంచంలోనే అత్యధిక తేమ కలిగిన ప్రాంతాల్లో ఒకటిగా కూడా పేరుగాంచింది. ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు, సాహస యాత్రికులకు, ఆధ్యాత్మిక చింతన ఉన్న భక్తులకు ఒక గొప్ప గమ్యస్థానం.

ఈ ప్రాంతానికి ప్రధాన ఆకర్షణగా నిలిచేవి రెండు భారీ రాతి గుట్టలు: భైరవేశ్వర శిఖరం (390 అడుగుల ఎత్తు), మోహిని శిఖరం (300 అడుగుల ఎత్తు). ఈ గుట్టలు సున్నపురాయి, జిప్సం, డోలమైట్‌ల కలయికతో ఏర్పడి, ఏ శిల్పో చెక్కిన టవర్స్‌లా ఆకాశాన్ని తాకుతున్నట్టు కనిపిస్తాయి.

yana

భైరవేశ్వర శిఖరం కింద ఒక సహజసిద్ధమైన ఆలయ గుహలో స్వయంభూగా వెలిసిన శివలింగం ఉంది. ఈ లింగంపై కొండపైనుంచి నిరంతరం నీరు పడుతుండటం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ట్రెక్కర్స్ కొండల మధ్య ట్రెక్కింగ్ చేస్తూ, పచ్చని అడవుల మధ్య పారుతున్న జలపాతాల అందాలను చూసి మైమరిచిపోతారు.

పురాణాలు చెబుతున్న దాని ప్రకారం, ఈ ప్రాంతానికి భస్మాసురుడికి సంబంధం ఉంది. భస్మాసురుడు శివుడి నుంచి, ఎవరి తలపై చేయి పెడితే వారు బూడిదైపోవాలనే వరం పొందుతాడు. ఆ వరాన్ని పరీక్షించడానికి శివుడిని వెంటాడినప్పుడు, శివుడు విష్ణువు సహాయం కోరతాడు. విష్ణువు మోహిని అవతారం ధరించి, భస్మాసురుడిని నృత్య పోటీకి ఆహ్వానిస్తాడు. నృత్యం చేసే సమయంలో మోహిని తన చేతిని తలపై పెట్టుకునే భంగిమను వేయగా, భస్మాసురుడు వరం విషయం మర్చిపోయి తన తలపై చేయి పెట్టుకుని భస్మమైపోతాడు. ఆ సమయంలో వెలువడిన మంటల వల్ల యాణ(Yana)లోని శిలలు, సున్నపురాయి నల్లగా మారిపోయాయని భక్తులు నమ్ముతారు.

ఇక్కడున్న నల్లని మట్టి మరియు బూడిదను ఈ పురాణానికి రుజువుగా భావిస్తారు. ఇక్కడ భైరవేశ్వర శిఖరాన్ని ‘శివుడి కొండ’ అని, మోహిని శిఖరాన్ని ‘మోహినీ కొండ’ అని పిలుస్తారు. ఇక్కడ పార్వతీదేవి, వినాయకుడి ఆలయాలు కూడా ఉన్నాయి.

యాణ(Yana)కు రైలు, రోడ్డు, విమాన మార్గాల ద్వారా చేరుకోవచ్చు. రోడ్డు మార్గంలో వెళ్లాలంటే సిర్సి నుంచి 50 కిలోమీటర్లు, కుమ్తా నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణించాలి. బెంగళూరు నుంచి స్థానిక బస్సుల్లో కూడా వెళ్లవచ్చు. రైలులో అయితే హుబ్లీ రైల్వే స్టేషన్ నుంచి కుమ్తా వెళ్లి, అక్కడి నుంచి టాక్సీలో లేదా బస్సులో యాణ చేరుకోవచ్చు. విమాన ప్రయాణానికి మంగళూరు విమానాశ్రయం (262 కి.మీ), బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (463 కి.మీ) అనుకూలంగా ఉంటాయి.

Allu Arjun :సైమా వేదికపై మెరిసిన అల్లు అర్జున్..వరుసగా మూడోసారి

Exit mobile version