Dharmasthala: దశాబ్దాల చీకటిని చీల్చి బయటకొచ్చిన నిజాలు..అయినా ధర్మస్థలలో ఎన్నో ప్రశ్నలు

Dharmasthala: ఈ కేసులో మరో సంచలన విషయం ఏమిటంటే,ఈ కేసు నడుస్తూ ఉండగానే.. 2000 నుంచి 2015 మధ్య బెళ్తంగడి పోలీస్ స్టేషన్‌లో నమోదైన అన్ని అసాధారణ మరణాల రికార్డులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

Dharmasthala

కర్ణాటకలోని ప్రసిద్ధ ధర్మస్థల పుణ్యక్షేత్రం… భక్తులకు ఇది ఒక పవిత్రమైన ప్రదేశం. కానీ, ఈ దేవాలయం గుండెల్లో దాగి ఉన్న ఒక భయంకరమైన చీకటి చరిత్ర 2025లో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ చీకటిని వెలికితీసింది, దశాబ్దాల పాటు భయంతో మౌనంగా బ్రతికిన ఒక దళిత పారిశుద్ధ్య కార్మికుడు. 1995లో ధర్మస్థల ఆలయ పరిసరాల్లో పని మొదలుపెట్టిన అతని జీవితం, 2014లో తన ఊరిని వదిలి పారిపోవడంతో ముగిసిపోయినట్టే అని అనుకున్నాడు.

కానీ అతని మనసులో ఉన్న ఒక బాధ, ఒక పాపం అతన్ని వెంటాడింది. 2025 మే నెలలో, ఆ పశ్చాత్తాపం మోయలేని స్థితికి చేరడంతో..అతను మీడియా, పోలీసులు, ప్రభుత్వ ముందు నిలబడి చెప్పిన మాటలు ఒక్కసారిగా దేశాన్ని షాక్‌కి గురి చేశాయి. వందలాది మృతదేహాలను నేను స్వయంగా పూడ్చిపెట్టాను… వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే అని అతను చెప్పినప్పుడు, దశాబ్దాలుగా ధర్మస్థల(Dharmasthala)పై ఉన్న అనుమానాలు సుడిగాలిలా బయటపడ్డాయి.

తన మాటలకి సాక్ష్యంగా, ఆ ఫిర్యాదుదారుడు స్వయంగా ఒక ప్రదేశాన్ని తవ్వి, మానవ అవశేషాల ఫోటోలు తీసి పోలీసులకు అందించాడు. ఈ ఫోటోలు, వాంగ్మూలం రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. దీనితో ప్రభుత్వం వెంటనే ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసింది. జూలై 28, 2025న నేత్రావతి నది తీరంలో తవ్వకాలు ప్రారంభమయ్యాయి.

అయితే మొదటి ఐదు ప్రదేశాలలో ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో చాలామంది ఇదంతా ఒక కట్టుకథే అనుకున్నారు. కానీ జూలై 31న పరిస్థితి మారింది. ఆరవ ప్రదేశంలో ఒక మానవ అస్థిపంజరం బయటపడింది. అదే రోజున పదకొండవ ప్రదేశంలో కనిపించిన దృశ్యం అందరినీ చలించిపోయేలా చేసింది. నేల కింద 100కి పైగా మానవ ఎముకలు, ఒక పుర్రె, వెన్నెముక, ఒక ముడివేసిన ఎర్ర చీర, పురుషుల చెప్పులు దొరికాయి. చీరను ముడివేసిన విధానం చూసి అది హత్యలో ఉపయోగించి ఉండవచ్చని పోలీసులు అనుమానించారు.

ఈ అనుమానాలు కేవలం 2025కి మాత్రమే పరిమితం కాదు. 1980ల నుంచి కూడా ధర్మస్థల (Dharmasthala)చుట్టూ అసహజ మరణాలు, అణచివేతలపై స్థానికులు నిరసనలు తెలియజేస్తూ వచ్చారు. 2003లో వైద్య విద్యార్థిని అనన్య భట్ అదృశ్యమవడం, 2012లో 17 ఏళ్ల సౌజన్యపై లైంగిక దాడి చేసి హత్య చేయడం వంటి సంఘటనలు ఈ చీకటి చరిత్రకు నిదర్శనం. సౌజన్య కేసులో నిందితుడు 2023లో నిర్దోషిగా విడుదలవ్వడం, దర్యాప్తు తప్పుడు మార్గంలో నడిపించారని కుటుంబం ఆరోపించడం ఈ కేసులోని లోపాలను స్పష్టంగా చూపించాయి.

కేసులో మరో సంచలన విషయం ఏమిటంటే,ఈ కేసు నడుస్తూ ఉండగానే.. 2000 నుంచి 2015 మధ్య బెళ్తంగడి పోలీస్ స్టేషన్‌లో నమోదైన అన్ని అసాధారణ మరణాల రికార్డులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఇది ఫిర్యాదుదారుడు చెప్పిన కాలానికి సరిగ్గా సరిపోవడం తీవ్ర అనుమానాలకు దారితీసింది. ఈ రికార్డుల ధ్వంసం దర్యాప్తునకు పెద్ద అడ్డంకిగా మారింది. SIT ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ అయిన గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (GPR)ను ఉపయోగించి భూగర్భంలో దాగిన నిజాలను బయటపెట్టాలని నిర్ణయించింది. బాహుబలి కొండలతో సహా మొత్తం 17 అనుమానాస్పద ప్రదేశాల్లో తవ్వకాలు జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Dharmasthala

సామాజిక విశ్లేషకుల ప్రకారం, ఇది కేవలం ఒక నేరం కాదు, మన సమాజంలో పాతుకుపోయిన కుల ఆధిపత్యం, లింగ హింసలకు ప్రతిబింబం. దశాబ్దాలుగా ఉన్న భయం, మౌనం నిందితులకు రక్షణ కవచంగా నిలిచింది. ఇప్పుడు అందరి చూపు ఫోరెన్సిక్ డీఎన్‌ఏ రిపోర్టులపై ఉంది. ఈ రిపోర్టులు ఎవరు బాధితులు అనే విషయం మాత్రమే కాకుండా, ఎన్ని దశాబ్దాల నిజాలు పాతిపెట్టబడ్డాయో కూడా బయటపెట్టగలవు.

ఈ కేసు చివరికి శక్తివంతులపై చర్యలకు దారితీస్తుందా లేదా మరుగున పడిపోతుందా అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. ధర్మస్థల(Dharmasthala) కేసు ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదని, అది సమాజంలో దాగి ఉన్న కులం, లింగం, అధికారం, భయాల కలయికకు ఒక అద్దమని నిరూపించింది. పాతిపెట్టిన శవాలు ఇప్పుడు మాటాడుతున్నాయి..నిజం గెలిచే వరకు ఆ మాటలు ఆగవు.

 

Exit mobile version