Mystery Beach
మన దేశంలో ఎన్నో అందమైన బీచ్‌లు ఉన్నాయి. పగలు పర్యాటకులతో కళకళలాడుతూ, రాత్రి పూట చల్లని గాలులతో ఆహ్లాదకరంగా ఉంటాయి. కానీ, మన దేశంలోనే ఒక బీచ్ ఉంది. పగటి పూట సాధారణంగా కనిపించినా, సాయంత్రం అయితే అటువైపు అడుగుపెట్టాలంటేనే భయంతో వణికిపోతారు. అదే గుజరాత్‌లోని ‘డుమాస్ బీచ్’. మరి ఈ బీచ్(Mystery Beach) గురించి స్థానికులను భయపెట్టే కథలేంటో తెలుసుకుందాం.
ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, అంతుచిక్కని మిస్టరీలు ఉన్నాయి. అలాంటి ఒక మిస్టరీ ప్రదేశమే భారతదేశంలోని ‘డుమాస్ బీచ్’. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బీచ్ గురించి ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ బీచ్ ఇసుక నల్లగా ఉంటుంది. అందుకే ఇది చూసేందుకు కాస్త భయంకరంగా అనిపిస్తుంది.
పగటి పూట ఈ బీచ్‌ను చూసేందుకు ఎంతో మంది వస్తారు. కానీ సాయంత్రం అయితే మాత్రం అటువైపు ఎవరూ అడుగు పెట్టరు. రాత్రి పూట డుమాస్ బీచ్‌లో తిరగడం సురక్షితం కాదని స్థానికులు చెబుతారు. ఉదయం ప్రశాంతంగా ఉండే ఈ బీచ్(Mystery Beach) సాయంత్రం అయితే దెయ్యాల దిబ్బలా కనిపిస్తుందట. బీచ్‌లో నడుస్తున్నప్పుడు గాలి శబ్దంతో పాటు ఎవరో మాట్లాడుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తాయి. చుట్టుపక్కల చూస్తే మాత్రం ఎవరూ కనిపించరు. రాత్రి వేళల్లో దెయ్యాలు తిరుగుతున్నాయనే ప్రచారం ఈ బీచ్‌కు మరింత భయాన్ని తీసుకొచ్చింది.
డుమాస్ బీచ్ ఒకప్పుడు హిందూ శ్మశానవాటిక అని స్థానికులు చెబుతున్నారు. బీచ్ కింద ఎన్నో అస్థిపంజరాల గుట్టలు ఉన్నాయని ఒక కథనం ప్రచారంలో ఉంది. శ్మశానం కాబట్టే ఇక్కడి ఇసుక నల్లగా ఉందని కూడా ఒక వాదన ఉంది. దెయ్యాల ఆత్మలు గుసగుసలాడుతూ భయపెడతాయని, అందుకే ప్రజలు ఈ బీచ్(Mystery Beach) దగ్గరికి పోవడానికి భయపడుతారని అంటారు.