Mohan Bhagwat
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat)చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కోల్‌కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతదేశం ఒక హిందూ దేశం అని అది పచ్చి నిజమని పేర్కొన్నారు.
సూర్యుడు తూర్పున ఉదయించడానికి రాజ్యాంగ అనుమతి ఎలా అవసరం లేదో భారత్ హిందూ దేశం అనడానికి కూడా ఎవరి అనుమతి అక్కర్లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ దేశాన్ని మాతృభూమిగా భావించి భారత సంస్కృతిని గౌరవించే ప్రతి ఒక్కరూ హిందూ దేశ పౌరులేనని ఆయన (Mohan Bhagwat)అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి ఆ పదాన్ని చేర్చినా చేర్చకపోయినా భారత్ ఎప్పటికీ హిందూ దేశమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో అసలు భారత రాజ్యాంగంలో ఉన్న లౌకిక , సామ్యవాద పదాల గురించి మనం లోతుగా తెలుసుకోవాలి.
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ప్రవేశికలో లౌకిక అనే పదం లేదు. 1976వ సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదాన్ని చేర్చారు. అసలు లౌకికవాదం అంటే ఏమిటంటే ప్రభుత్వానికి లేదా రాజ్యానికి అంటూ ఒక ప్రత్యేకమైన మతం ఉండదు. ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూడాలి.
ఏ మతానికీ వ్యతిరేకంగా ఉండకూడదు అలాగే ఏ ఒక్క మతానికీ కొమ్ముకాయకూడదు. పౌరులు తమకు నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛను రాజ్యాంగం కల్పిస్తుంది. భారతదేశం వంటి భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశంలో అందరూ కలిసి మెలిసి ఉండటానికి ఈ లౌకిక తత్వం ఒక పునాదిలా పనిచేస్తుంది. ప్రభుత్వం మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా కేవలం పరిపాలనపై మాత్రమే దృష్టి పెట్టాలనేది దీని ప్రధాన ఉద్దేశం.
సామ్యవాదం అంటే ఏమిటి దీని ప్రాముఖ్యత ఏంటి అంటే.. లౌకిక పదంతో పాటే 42వ రాజ్యాంగ సవరణలో చేర్చబడిన మరో ముఖ్యమైన పదం సామ్యవాదం. దీనినే ఇంగ్లీష్ లో సోషలిజం అని పిలుస్తారు. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో ఆర్థిక సమానత్వం సాధించడం కోసం ఈ పదాన్ని చేర్చారు. దేశంలోని సహజ వనరులు , సంపద కేవలం కొంతమంది చేతుల్లోనే ఉండకూడదని అవి అందరికీ సమానంగా అందాలనేది దీని లక్ష్యం.
పేద ధనిక వ్యత్యాసాలను తగ్గించడం , సమాజంలోని అట్టడుగు వర్గాలకు కూడా సమాన అవకాశాలు కల్పించడం సామ్యవాదం యొక్క ముఖ్య ఉద్దేశం. భారతీయ సామ్యవాదం అనేది ప్రజాస్వామ్యంతో కూడుకున్నది. అంటే ప్రైవేట్ రంగం , ప్రభుత్వ రంగం రెండూ కలిసి పనిచేస్తూ దేశాభివృద్ధికి తోడ్పడాలి. ప్రజలందరికీ సామాజిక , ఆర్థిక న్యాయం అందించడమే ఈ పదం వెనుక ఉన్న అసలు రహస్యం.
మోహన్ భగవత్(Mohan Bhagwat) వాదన ప్రకారం భారతదేశం సంస్కృతి పరంగా మొదటి నుంచీ హిందూ దేశమే. ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరి పూర్వీకులు హిందువులేనని మరియు భారతీయ సంస్కృతే హిందుత్వమని ఆర్‌ఎస్‌ఎస్ భావిస్తోంది. అయితే రాజ్యాంగ పరంగా చూస్తే భారత్ ఒక లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశం. రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న విలువలు దేశం ఏ ఒక్క మతానికీ చెందదని స్పష్టం చేస్తున్నాయి.
కుల వ్యవస్థ హిందుత్వ లక్షణం కాదని మోహన్ భగవత్(Mohan Bhagwat) చెప్పడం ఇక్కడ గమనార్హం. ఆయన మాటల్లో చెప్పాలంటే హిందుత్వం అంటే అందరినీ కలుపుకుని పోయే ఒక జీవన విధానం. అందుకే రాజ్యాంగ సవరణలతో పనిలేకుండానే భారత్ హిందూ దేశంగా కొనసాగుతుందని ఆయన ఘంటాపథంగా చెబుతున్నారు.
రాజ్యాంగ ప్రవేశికలోని లౌకిక , సామ్యవాద పదాలను తొలగించాలని గతంలో కొన్ని వర్గాల నుంచి డిమాండ్లు వచ్చాయి. ఎమర్జెన్సీ సమయంలో ఈ పదాలను బలవంతంగా చేర్చారని కొందరు వాదిస్తుంటే భారత ఆత్మ గౌరవానికి ఆ పదాలు చిహ్నాలని మరికొందరు అంటున్నారు. మోహన్ భగవత్ వ్యాఖ్యలు ఇప్పుడు ఆ చర్చను మళ్లీ మొదటికి తీసుకువచ్చాయి.
దేశ సంస్కృతి, రాజ్యాంగ నిబంధనల మధ్య ఉన్న ఈ సమతుల్యతను అర్థం చేసుకోవడం ప్రతి పౌరుడికి అవసరం. మారుతున్న రాజకీయ సమీకరణాల వల్ల రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూనే సాంస్కృతిక మూలాలను గౌరవించడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
