Operation Akhal
పహల్గామ్ ఉగ్రవాదుల దాడి తర్వాత భారత సైన్యం ఉగ్రవాదులపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ దాడిలో 26 మంది అమాయకులు చనిపోయారు. దీనికి ప్రతీకారంగా, మన సైన్యం జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులను ఏరివేసే పనిలో నిమగ్నమై ఉంది. ఇటీవల ఆపరేషన్ మహాదేవ్‌లో పహల్గామ్ దాడికి ముఖ్య కారకుడు సులేమాన్ సహా మరో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం, ఇప్పుడు మరో పెద్ద ఆపరేషన్‌ను మొదలుపెట్టింది.
శనివారం నాడు జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఆపరేషన్ అఖల్ (Operation Akhal)పేరుతో సైన్యం జరిపిన గాలింపు చర్యల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ దళాలు కలిసి ఈ (Operation Akhal) ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నాయి. అఖల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారని సైన్యానికి పక్కా సమాచారం అందింది. దీంతో దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.
గాలింపు చర్యలు జరుగుతున్న సమయంలో, దాక్కున్న ఉగ్రవాదులు సైన్యంపై కాల్పులు జరిపారు. భద్రతా దళాలు వెంటనే ఎదురుకాల్పులు జరిపి, ఒక ఉగ్రవాదిని హతమార్చాయి. చనిపోయిన ఉగ్రవాది వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఆ ప్రాంతంలో ఇంకా కొంతమంది ఉగ్రవాదులు దాగి ఉన్నారని సైన్యం అనుమానిస్తోంది. వారిని కూడా పట్టుకునేందుకు దళాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి.
పహల్గామ్ తర్వాత ప్రతీకారం: మూడు ఆపరేషన్లు
పహల్గామ్ దాడి తర్వాత భారత సైన్యం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్న తీరును ఈ మూడు ఆపరేషన్లు స్పష్టం చేస్తున్నాయి.
ఆపరేషన్ సిందూర్(operation Sindoor): ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడికి ప్రతీకారంగా మే 7న భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పై ‘ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)’ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో సుమారు 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు. అంతేకాకుండా, పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలను కూడా ధ్వంసం చేశారు.
అలాగే జూలై 28న శ్రీనగర్‌లో జరిగిన మహాదేవ్ ఆపరేషన్‌లో పహల్గామ్ దాడికి సూత్రధారి అయిన సులేమాన్, మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.
తాజాగా ఆపరేషన్ అఖల్ (Operation Akhal): భాగంగా శనివారం కుల్గాంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఇంకా గాలింపు చర్యలు కొనసాతున్నాయి.
ఈ వరుస దాడులతో భారత సైన్యం ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడానికి కట్టుబడి ఉందని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. ఉగ్రవాదులకు సహకరించే వారికి కూడా ఇది ఒక హెచ్చరిక అని చెబుతోంది.
Also Read: Rahul : మోదీ డిఫెన్స్.. రాహుల్ ఆఫెన్స్.. ఏం జరిగింది మోదీజీ ?