Cricket
వన్డే ప్రపంచకప్(Cricket) గెలిచిన భారత మహిళల జట్టుపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఆదివారం సౌతాఫ్రికాపై ఫైనల్లో గెలిచిన ఇండియా వుమెన్స్ టీమ్ ను ఇవాళ మోదీ ప్రత్యేకంగా కలుసుకున్నారు. తన నివాసానికి పిలిపించుకుని సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో ముచ్చటించారు. మెగా టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్ లు ఓడిపోయిన తర్వాత పుంజుకున్న తీరు అద్భుతమంటూ కితాబిచ్చారు.
వరల్డ్ కప్ లాంటి టోర్నీ(Cricket)ల్లో ఉండే ఒత్తిడి తట్టుకోవడం అంత సులభం కాదన్న మోదీ వరుస ఓటముల తర్వాత ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆడడం ఎంత పొగిడినా తక్కువే అంటూ మహిళా క్రికెటర్లను ఆకాశానికెత్తేశారు. వరుస పరాజయాల తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలకు వరల్డ్ కప్ గెలిచి సమాధానమిచ్చిన తీరు నిజంగా అద్భుతమంటూ మోదీ భారత జట్టును పొగిడారు.
ఈ సమావేశంలో మహిళా క్రికెటర్ల(Cricket)తో మోదీ ఆద్యంతం ఉల్లాసంగా పలకరిస్తూ మాట్లాడారు. ప్రతీ ఒక్కరినీ పరిచయం చేసుకుని వరల్డ్ కప్ లో వారి అనుభవాలను తెలుసుకున్నారు. ప్రపంచకప్ విజయం వెనుక జట్టు సమిష్టి కృషి ఉందని, క్రికెట్ లాంటి గేమ్ లో టీమ్ వర్క్ అత్యంత ముఖ్యమన్నారు.
ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యాన్ని మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. వరుస ఓటముల తర్వాత జట్టులో ఎలా ఉత్సాహాన్ని నింపావంటూ ఆమెను అడిగి తెలుసుకున్నారు. అలాగే కోచ్ అమోల్ మజుందార్ ను సైతం మోదీ ప్రత్యేకంగా అభినందించారు. మైదానంలో ఆడేది ప్లేయర్సే అయినప్పటకీ వారిలో స్ఫూర్తిని నింపడం, వ్యూహాలు సిద్ధం చేయడం అంత సులభం కాదన్నారు.
జట్టు విజయం వెనుక కోచ్ కృషి ఎవ్వరూ మరిచిపోకూడదంటూ మోదీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా 2017లో తాము మోదీతో కలిసిన క్షణాలను కెప్టెన్ హర్మన్ ప్రీత్ గుర్తు చేసుకుంది. అప్పుడు మెగా టోర్నీలో రన్నరప్ గానే నిలిచినప్పటకీ మోదీ తమను ప్రత్యేకంగా పిలిపించి అభినందించారని చెప్పుకొచ్చింది. అప్పటి మోదీ స్ఫూర్తినిచ్చిన మాటలు మరిచిపోలేదంటూ వ్యాఖ్యానించింది.
ఇదే విషయాన్ని మోదీకి గుర్తు చేయగా ప్రధాని నవ్వేశారు. అలాగే 2017 జట్టులో ప్లేయర్ గా ఉన్న దీప్తి శర్మ సైతం అప్పటి మీటింగ్ ను గుర్తు చేస్తూ మాట్లాడింది. ఈ సందర్భంగా మోదీతో కలిసి ప్రపంచకప్ తో భారత మహిళల జట్టు ఫోటోలకు ఫోజులిచ్చింది. అలాగే భారత మహిళా క్రికెటర్లు సంతకాలు చేసిన జెర్సీని మోదీకి కానుకగా అందజేసింది. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని మోదీ ఆకాంక్షిస్తూ వారికి అభినందనలు తెలిపారు.
