Pulevindula
తెలుగు రాజకీయాల్లో స్థానిక ఎన్నికలు అంటే ఇప్పుడు కేవలం ఓట్ల పోరు కాదు అన్న రేంజ్‌లోకి వెళ్లిపోతున్నాయి. అది రెండు పార్టీల ప్రతిష్ఠకు, ఆధిపత్యానికి సంబంధించిన హోరాహోరీ యుద్ధం. “నీ ఇలాకాలో నా జెండా” అనే నినాదం ఇప్పుడు ఒక సంచలనంగా మారుతోంది. ఈ రాజకీయ వ్యూహం ఎంత పవర్ ఫుల్ అనేది కుప్పం మున్సిపాలిటీ నుంచి పులివెందుల (Pulevindula) జడ్పీటీసీ ఉప ఎన్నికల వరకు జరిగిన పరిణామాలను చూస్తే అర్థమవుతుంది. కుప్పం ఎన్నికల నుంచి పులివెందుల ఎన్నికల వరకు సాగుతోన్న రాజకీయపరువు ప్రతిష్ఠ పోరులో నెగ్గేదెవరు? తగ్గేదెవరు అన్నది సెకండరీ అయినా.. ఎన్నికలు జరిగే తీరు మాత్రం సర్వత్రా చర్చనీయాంశం అయింది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి కంచుకోట అయిన పులివెందుల (Pulevindula)నియోజకవర్గంలో మంగళవారం (ఆగస్టు 12, 2025) జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికలు రాజకీయ ఉద్రిక్తతకు దారితీశాయి. ఇది కేవలం ఒక స్థానిక ఎన్నిక మాత్రమే కాదు, వైసీపీ, టీడీపీ మధ్య జరిగిన ప్రతిష్ఠాత్మక పోరాటం.
ఈ ఎన్నికల్లో వైసీపీ తరఫున దివంగత తుమ్మల మహేశ్వర రెడ్డి కుమారుడు తుమ్మల హేమంత్ రెడ్డి పోటీ చేశారు. టీడీపీ నుంచి ఆ పార్టీ నాయకుడు బీటెక్ రవి భార్య లతా రెడ్డి (Latha Reddy)బరిలోకి దిగారు. ఎన్నికల ప్రచారంలో రెండు పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదాలు, విమర్శలు చోటుచేసుకున్నాయి. పోలింగ్ రోజు కూడా ఉద్రిక్తతలు కొనసాగాయి.
పోలింగ్ శాతం సుమారు 74.5% గా నమోదైంది. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి(Tummala Hemanth Reddy) తమ కుటుంబ వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రయత్నించగా, టీడీపీ అభ్యర్థి లతా రెడ్డి ఓటర్లను ఆకట్టుకోవడానికి విస్తృత ప్రచారం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల ఆగస్టు 14న వెలువడనున్నాయి.
కాగా 2021లో దాదాపు మూడు దశాబ్దాల పాటు టీడీపీ(TDP) కంచుకోటగా ఉన్న కుప్పంలో.. వైఎస్సార్ కాంగ్రెస్( YSRCP) పార్టీ విజయం సాధించడం ఒక పెద్ద షాక్. 25 వార్డులకు గాను 13 వార్డులను గెలుచుకుని వైసీపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్వంత నియోజకవర్గంలో ఈ విజయం వైసీపీకి ఒక గొప్ప ప్రచార ఆయుధంగా మారింది. నీ ఇలాకాలో నా జెండా అనే రాజకీయ అభిప్రాయం స్థానిక ఎన్నికలలో ఎంత ప్రభావవంతంగా ఉందో ఈ ఫలితాలు నిరూపించాయి. కుప్పం విజయం వైసీపీ ఆత్మవిశ్వాసాన్ని పెంచగా, టీడీపీకి ఒక పెద్ద సవాల్‌గా మారింది.
కుప్పం తర్వాత, ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల పోరు కూడా అంతే ఉత్కంఠగా సాగింది. ఈ ఎన్నికను ఇరు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ కూడా విమర్శలు, ప్రతివిమర్శలు చాలా తీవ్రంగా ఉన్నాయి. పోలింగ్ బూత్‌లను పక్క గ్రామాలకు మార్చడం, ఓటర్లను భయపెట్టడం వంటి ఆరోపణలు తెరపైకి వచ్చాయి. అయితే, ఈ అవకాశాన్ని టీడీపీ సద్వినియోగం చేసుకుని, ఈ ఎన్నికల్లో తమ పోటీని బలోపేతం చేసుకుంటోంది. ఈ పోరు కేవలం ఒక స్థానిక ఎన్నిక మాత్రమే కాదు, రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరాటానికి ఒక ఉదాహరణగా నిలుస్తోంది.
ఈ తరహా ప్రతిష్ఠా పోరు కేవలం పార్టీల వ్యూహాలకు, కూటమిలకు మాత్రమే పరిమితం కాదు. ఇది ప్రజల భావోద్వేగాలను కూడా బాగా ప్రభావితం చేస్తుంది. కుప్పం, పులివెందుల వంటి ప్రాంతాల్లో గెలుపు, ఓటమిలు కేవలం ఓట్ల లెక్కలు కాదు, ఆ ప్రాంత ప్రజల మధ్య రాజకీయ ప్రభావం, గౌరవానికి సంబంధించినవి. ఈ గెలుపులు తాత్కాలికమేనని ప్రజలకు తెలిసినా, పార్టీల మద్దతుదారులకు మాత్రం ఇది ఒక పెద్ద విజయంగా కనిపిస్తుంది.దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ పోరు స్థానిక రాజకీయాల్లో ఒక ప్రధాన అంశంగా మారింది.