Bihar: బీహార్‌ డిప్యూటీ సీఎం విజయ్ సిన్హాకు రెండు ఓటర్ కార్డులు? రాజకీయాల్లో కొత్త ట్విస్ట్!

Bihar: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి.

Bihar

బీహార్ రాజకీయాల్లో ఓటర్ ఐడీల వివాదం ఇప్పుడు పెద్ద రచ్చకు దారితీస్తోంది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణపై ఇప్పటికే రగడ కొనసాగుతుండగా, ఇప్పుడు ఆరోపణలు డిప్యూటీ ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హాపైకి వచ్చాయి. డిప్యూటీ సీఎంకు రెండు వేర్వేరు ఓటర్ ఐడీ కార్డులు (EPIC) ఉన్నాయని ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ ఆరోపించారు. అయితే, డిప్యూటీ సీఎం సిన్హా ఈ ఆరోపణలను ఖండించారు. తన పేరును ఒక జాబితా నుంచి తొలగించాలని ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నానని ఆయన స్పష్టం చేశారు.

మీడియా సమావేశంలో తేజస్వి యాదవ్(Tejashwi Yadav) మాట్లాడుతూ, డిప్యూటీ ముఖ్యమంత్రి విజయ్ సిన్హాకు రెండు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు ఓటర్ ఐడీ కార్డులు ఉన్నాయని ఆరోపించారు.

ఒక EPIC నంబర్ బంకిపూర్ నియోజకవర్గంలో ఉంది, దానిలో ఆయన వయసు 60గా ఉంది. మరొక EPIC నంబర్ లఖిసరాయ్ నియోజకవర్గంలో ఉంది, దానిలో ఆయన వయసు 57గా ఉంది. బంకిపూర్ అసెంబ్లీలో ఆయన EPIC నంబర్ IAF3939337 కాగా, లఖిసరాయ్ అసెంబ్లీలో EPIC నంబర్ AFS0853341గా ఉంది.

దీనిని బట్టి చూస్తే, ఈ రెండు ఐడీల కోసం ఆయన స్వయంగా డాక్యుమెంట్లను సమర్పించి ఉండాలి లేదా బీహార్‌(Bihar)లోని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ మొత్తం ఫ్రాడ్ అయి ఉండాలని తేజస్వి యాదవ్ అన్నారు.అంతేకాకుండా, డిప్యూటీ ముఖ్యమంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా తేజస్వి డిమాండ్ చేశారు.

తేజస్వి యాదవ్ ఆరోపణలు చేసిన వెంటనే డిప్యూటీ ముఖ్యమంత్రి విజయ్ సిన్హా(Vijay Sinha) మీడియా ముందుకు వచ్చారు. నా కుటుంబం గతంలో బంకిపూర్ అసెంబ్లీ ప్రాంతంలో ఉండేది. నేను లఖిసరాయ్ నియోజకవర్గంలో నా పేరును చేర్చుకున్న తర్వాత, బంకిపూర్ జాబితా నుంచి నా పేరును తొలగించాలని దరఖాస్తు చేసుకున్నాను. రెండు జాబితాల్లో నా పేరు కనిపించినప్పుడు నేను ఈ తొలగింపు ఫారాన్ని పూర్తి చేశానని ఆయన వివరణ ఇచ్చారు.

ఆర్జేడీపై విరుచుకుపడుతూ..జంగల్ రాజ్ యువరాజు ఫ్రాడ్ పనులు చేస్తుంటారు. మేము అలాంటి పనులు చేయము. దురదృష్టవశాత్తు, ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి సరైన అవగాహన లేకుండా రాజకీయాలను కించపరుస్తున్నారు,” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bihar

ఓటర్ల జాబితా వివాదంలో ఎన్నికల సంఘానికి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. బీహార్‌(Bihar)లో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. ఓటర్లను పెద్ద సంఖ్యలో తొలగించే ప్రయత్నం జరుగుతోందని అవి ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. అయితే, ఇదే వివాదం మధ్య, తేజస్వి యాదవ్‌కు “నకిలీ” ఓటర్ ఐడీ కార్డు ఉందనే ఆరోపణలపై ఎన్నికల సంఘం ఆయన నుంచి వివరణ కోరింది.

దీనిపై తేజస్వి యాదవ్ స్పందిస్తూ..ఎన్నికల సంఘం మాపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తే, డిప్యూటీ ముఖ్యమంత్రిపైనా చర్యలు తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, పాట్నా ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి తేజస్వి యాదవ్‌కు ఒక లేఖ పంపారు. డిప్యూటీ సీఎంపై చేసిన ఆరోపణలకు సంబంధించిన EPIC కార్డుల వివరాలను అందించాల్సిందిగా ఆ లేఖలో కోరారు. అయితే, ఇప్పటివరకు తేజస్వి యాదవ్ ఆ పత్రాలను సమర్పించలేదని పేర్కొన్నారు.

ఈ మొత్తం వ్యవహారంలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది స్పష్టంగా తెలియకపోయినా, ఈ వివాదం బీహార్(Bihar) రాజకీయాల్లో మరింత హీట్ పెంచుతోంది.

 

Exit mobile version