Bihar Elections
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar Elections) ఈ సారి రసవత్తరంగా జరగబోతున్నాయి. ఎన్డీఏ, ఇండియా కూటమితో పాటు ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ పోటీలో ఉండడంతో రేసు ఆసక్తికరంగా మారింది. అయితే ఈ రెండు కూటములను ధీటుగా ఎదుర్కొని పీకే పార్టీ చరిత్ర సృష్టిస్తుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్.. అంచనాలు వేయడంలో, రాజకీయ వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తన పార్టీ గెలుపోటములపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా ఆజ్ తక్ ఇంటర్యూలో పీకే సంచలన వ్యాఖ్యలు చేశాడు.
వచ్చే ఎన్నికల్లో(Bihar Elections) ఎన్డీఏ ఓటమి ఖాయమని చెబుతూనే తన జన్ సురాజ్ పార్టీ 150 సీట్లు గెలుస్తుందని జోస్యం చెప్పారు. అదే సమయంలో 150కి ఒక్కటి తగ్గినా తాను ఓడిపోయినట్టేనంటూ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే బిహార్ లోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని పీకే ప్రకటించాడు. ఇప్పటివరకు 116 మంది అభ్యర్థులను ప్రకటించగా…మిగతా స్థానాలకు కూడా త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేయనున్నాడు. అయితే ప్రశాంత్ కిషోర్ మాత్రం ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. చాలా మందిని అతని నిర్ణయం ఆశ్చర్యపరిచినా పీకే క్లారిటీ ఇచ్చాడు. తాను పార్టీ బలోపేతంపై మాత్రమే దృష్టి పెట్టానని చెప్పుకొచ్చాడు.
అయితే పీకే నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన పార్టీ పరిస్థితి, రాబోయే ఫలితాలు అంచనా వేసుకుని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీకి బలం లేనప్పుడు ఎందుకు పోటీ చేస్తున్నారనే విషయాన్ని మాత్రం చెప్పడం లేదు. మిగతా పార్టీల విషయంలో చాలా సూక్తులు వల్లించే పీకే తన పార్టీకి వచ్చేసరికి నీతులు చెప్పడంపై పలువురు సెటైర్లు వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్, బిజేపీ, నితీశ్ పార్టీలే ఎన్నికల్లో పోటాపోటీగా వ్యవహరించాయి.
అయితే తమ పార్టీ ఎంట్రీతో బిహార్(Bihar Elections) లో హంగ్ ఏర్పడుతుందని పీకే అంచనా వేస్తున్నాడు. కానీ పరిస్థితి చూస్తే ఆ అవకాశాలు కనిపించడం లేదు. పలు జాతీయ సంస్థల సర్వేల ప్రకారం ఎన్డీఏ కూటమే మళ్ళీ విజయం సాధిస్తుందని, అదే సమయంలో ఇండియా కూటమి పుంజుకుంటుందని చెబుతున్నారు. కాగా దేశ రాజకీయల్లో ప్రశాంత్ కిషోర్ కు మంచి గుర్తింపే ఉంది. గత కొన్నేళ్ళుగా పలు రాష్ట్రాల్లో పలు పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి కోట్లాది రూపాయలు ఆర్జించారు. విశేషమేమిటంటే పీకే పనిచేసిన పార్టీల్లో చాలా వరకూ ఏదో ఒకసమయంలో అధికారంలోకి వచ్చాయి. అలాంటి సక్సెస్ రేట్ ఉన్న ప్రశాంత్ కిషోర్ తన సొంత పార్టీ విషయంలో బోర్లా పడతాడన్నది పలువురి అంచనా.