Bypoll 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Bypoll 2025) ప్రచారహోరు చివరి దశకు చేరింది. ప్రచార ముగింపుకు ఇంకా 24 గంటలే గడువుంది. ఇప్పటికే ఓట్ల కోసం రాజకీయ పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ప్రచార పర్వం చివరి అంకానికి చేరడంతో ఇక తాయిలాల పంపిణీ మొదలైపోయింది. పోటాపోటీగా డబ్బులు పంచేందుకు (ఇప్పటికే ఒక పార్టీ పంపిణీ మొదలుపెట్టినట్టు వార్తలు) ఓటుకు రెండు వేలు ఇస్తామని ఓ పార్టీ చెప్తుంటే.. వెయ్యి యాడ్ చేసి మూడు వేలు ఇస్తాం ఓటు మాత్రం మాకే పడాలి అని మరో పార్టీ ఆఫర్ ఇస్తోంది.
ఈ రెండు పార్టీల పోటాపోటీ పంపకాలతో జూబ్లీహిల్స్‌లో డబ్బు ఏరులై పారుతోంది.. సాధారణంగా ఎన్నికల్లో పోలింగ్‌కు ఒక రోజు ముందు డబ్బు పంపిణీ చేస్తారు. కానీ జూబ్లీహిల్స్‌లో మాత్రం ఓ పక్క ప్రచారం చేస్తూనే మరో పక్క డబ్బు పంపిణీ కూడా చేస్తున్నారు. ఓటుకు రెండు వేలు ఇస్తామని ఓ పార్టీ చెప్తుంటే.. ఇంకో వెయ్యి కలిపి మూడు వేలు ఇచ్చేందుకు మరో పార్టీ రెడీ అయ్యింది. ఎంత ఖర్చైనా పర్లేదు.. ఓటు మాత్రం మిస్ అవ్వొద్దు అన్నట్టు రెండు పార్టీలు ప్రచారం చేస్తున్నాయి.
కాలనీ అధ్యక్షులు, అపార్ట్‌మెంట్ ప్రెసిడెంట్లు, యూత్ అసోసియేషన్ లీడర్లు.. ఇలా ఎవరినీ వలకుండా అందరినీ ప్రసన్నం చేసుకుంటున్నారు. అటు ఇదే మంచి టైం కాబట్టి.. చాలా మంది స్థానికులు కూడా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ చకచకా చేయించేసుకుంటున్నారు. ఓ పార్టీ ఆల్రెడీ డబ్బు పంపిణీలో బిగా ఉంటే.. మరో పార్టీ మాత్రం పోలింగ్‌కు ఒక రోజు ముందు పంచుతామంటూ లిస్ట్ రెడీ చేసుకుంటున్నట్టు సమాచారం. పోలీసులకు ఫ్లయింగ్ స్వ్కాడ్‌కు తెలియకుండా డబ్బును దాచి.. గుట్టు చప్పుడు కాకుండా ఓటర్లకు చేర్చేందుకు రెండు పార్టీలు తమ కార్యకర్తలను గ్రౌండ్ స్థాయిలో తిప్పుతున్నాయి.
ఇక ఈ వ్యవహారం మొత్తం నడిపేందుకు రెండు ప్రధాన పార్టీలు పక్క జిల్లాల నుంచి తమ లీడర్లను బరిలోకి దించాయి. జూబ్లీహిల్స్‌లో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది కాబట్టి ఈ నేతలు పక్క ప్రాంతాల నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ప్రచారం మాత్రం జూబ్లీహిల్స్‌లో చేసి.. పంపిణీ వ్యవహారాలు, డబ్బు దాచడం, స్థానికులతో మీటింగ్‌లు పెట్టడం మాత్రం పక్క నియోజకవర్గాల్లో చేస్తున్నారు. హైదరాబాద్‌లో నియోజకవర్గాల మధ్య పెద్దగా డిస్టెన్స్ ఉండదు కాబట్టి ఇక్కడ పని చాలా సులభం అవుతోంది.
ఈ ప్రాంతంలో మాగంటి కుటుంబానికి మంచి పట్టుంది. దాదాపు దశాబ్ధానికి పైగా మాగంటి గోపీనాథ్ ఇక్కడ వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మరణంతో వచ్చిన ఈ బైపోల్(Bypoll 2025)లో ఇప్పుడు ఆయన భార్య పోటీ చేస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఆయన చేతిలో ఓడిపోయిన నవీన్ యాదవ్ మొదటిసారి అధికార పక్షం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఉప ఎన్నిక గురించి వచ్చిన ఎగ్జిట్‌పోల్స్ కూడా విజేత ఎవరు అనే విషయాన్ని క్లియర్‌గా తేల్చలేదు. ఇక తేల్చాల్సింది ఓటర్లే. దీని కోసం నవంబర్ 14వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే.
