TVK Vijay
సినిమాలకు వీడ్కోలు పలికి రాజకీయాలపై ఫోకస్ పెట్టిన తమిళ స్టార్ హీరో , టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్(TVK Vijay) కు చిక్కులు మొదలయ్యాయి. కరూర్ తొక్కిసలాట ఘటనలో ఒక్కసారిగా దర్యాప్తు వేగవంతమైంది. ఈ ఘటనకు సంబంధించి విచారణకు రావాలని విజయ్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. దర్యాప్తులో భాగంగా విచారణకు పిలవడం సాధారణమే అయినప్పటకీ ఇటీవలే చివరి సినిమాను ముగించుకుని పాలిటిక్స్ పైనే పూర్తి దృష్టి పెట్టబోతున్న సమయంలో నోటీసులు రావడం చర్చనీయాంశమైంది. కాగా జనవరి 12న ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసుల్లో సీబీఐ పేర్కొంది. గత ఏడాది సెప్టెంబర్ లో కరూర్ లో విజయ్ పార్టీ భారీ ర్యాలీ, సభ నిర్వహించింది.
అయితే విజయ్ సమయానికి రాకపోవడంతో అభిమానుల తాకిడి భారీగా పెరిగిపోవడం తొక్కిసలాటకు కారణమైంది. విజయ్ ( TVK Vijay ) ను దగ్గర నుంచి చూడాలనే ఉత్సాహంతో అభిమానులు తోసుకురావడంతో 41 మంది మృతి చెందారు. ప్రభుత్వం సరైన భద్రత ఇవ్వలేదని టీవీకే పార్టీ, ఇరుకు రోడ్డుల్లో సభ నిర్వహించారంటూ అధికార డీఎంకే పార్టీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు విజయ్ పార్టీ నేతలపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే పలువురు నేతలను సీబీఐ ప్రశ్నించింది. ఇదిలా ఉంటే ఈ ఘటన తర్వాత విజయ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. తర్వాత కాస్త ఆలస్యంగా బాధిత కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున అందజేశాడు.
కాగా ఇప్పుడు సీబీఐ విచారణ జరుపుతుండడంతో పొలిటికల్ గా హాట్ టాపిక్ అయిపోయింది. సహజంగానే సీబీఐ కేంద్రం జేబు సంస్థగా వ్యవహరిస్తుందన్న విమర్శలు వినిపిస్తుంటాయి. రాజకీయ పరంగా విజయ్ ను ఇబ్బంది పెట్టేందుకు సీబీఐ ఇప్పుడు నోటీసులు జారీచేసిందన్న అభిప్రాయాన్ని ఆయన అభిమానులు వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు విజయ్ (TVK Vijay)సీబీఐ విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవిధంగా కరూర్ తొక్కిసలాట ఘటన రాజకీయపరంగా విజయ్ కు నష్టాన్ని చేకూర్చిందన్నది పలువురు విశ్లేషకుల అభిప్రాయం. ఇకపై విజయ్ చేసే పర్యటనల్లో ఎక్కడ అపశృతి, తొక్కిసలాటలు వంటివి జరిగినా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే తన రాజకీయ సభలకు సైతం ఏర్పాట్ల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే. ఓవరాల్ గా తాను పార్ట్ టైమ్ పొలిటీషయన్ ను కాదంటూ గతంలోనే చెప్పిన విజయ్.. చివరి సినిమాను పూర్తి చేసి ఆ మాటకు తగ్గటే అడుగులు వేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో అధికార డీఏంకే, మరో పార్టీ ఏఐడీఏంకలను ఢీకొట్టి గెలవాలనుకుంటున్న విజయ్ కు కరూర్ దుర్ఘటనపై దర్యాప్తు ఎంతో కొంత ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు.
Camphor:దేవుడికిచ్చే హారతి కర్పూరం వెనుకున్న అసలు సైన్స్ ఇదే..ఇది ఆరోగ్యానికి మంచిదేనా?
