Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)విశాఖపట్నంలో జరిగిన పార్టీ సమావేశాల్లో చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఒకవైపు రాష్ట్రాన్ని పాలనలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన, మరోవైపు తన భవిష్యత్ ప్రణాళికలను జాతీయ స్థాయికి విస్తరిస్తున్నట్లు పవన్ చేసిన వ్యాఖ్యలు ..ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రధాన చర్చాంశంగా మారాయి. తన పార్టీని జాతీయ స్థాయికి తీసుకువెళ్లడానికి ఇది కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదని, ఆయన వ్యూహాత్మక చర్యలకు ఇది ఒక సంకేతమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
2013లో జనసేన పార్టీని స్థాపించి 12 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పార్టీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. కేవలం నమ్మకం, సిద్ధాంతాల మీదనే పార్టీని ముందుకు నడిపించామని తెలిపారు. 2019 ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం ఎందరో కార్యకర్తలను, నాయకులను నిరుత్సాహపరచినా కూడా.. పార్టీ తన లక్ష్యం నుంచి ఏమాత్రం పక్కకు తొలగలేదని ఆయన స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీలతో కలిసి సాధించిన ఘన విజయం, పార్టీ పట్టుదలకు, ప్రజల విశ్వాసానికి నిదర్శనమని.. ఇది ఒక విజయగాథకు నాంది పలికిందని, ఇకపై కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు..
సామాన్య ప్రజల గొంతుగా జనసేన అనే నమ్మకాన్ని నిలుపుకొంటున్న పవన్.. దీనిలో భాగంగానే మా పార్టీ కులం, ప్రాంతం, కుటుంబం కోసం కాదని బలంగా చెప్పారు. రాజకీయాలకు ప్రేరణ ఒక సగటు మనిషి పడే కష్టాలే అని, సచివాలయానికి వెళ్లే సామాన్యుడి బాధ, కిడ్నీ బాధితుల దుర్భర పరిస్థితి తనను కదిలించాయని తెలిపారు. రాజకీయాల్లో అంతగా ప్రాతినిధ్యం లేని మధ్యతరగతి వర్గానికి జనసేన ఒక బలమైన గొంతుగా నిలబడాలని కోరారు. అంతేకాకుండా, రౌడీయిజం, అవినీతి వంటి అరాచకాలకు వ్యతిరేకంగా జనసేన పోరాడుతుందని..తప్పు చేస్తే సరిదిద్దుకుంటామని, అన్యాయం చేస్తే మాత్రం పోరాడతామని పవన్ హెచ్చరించారు.
అసలు పవన్ (Pawan Kalyan)ఇప్పుడు జాతీయ విస్తరణకు సన్నాహాలు ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతుంది. ప్రస్తుతానికి రాష్ట్రంలో పార్టీ బలంగా ఉంటేనే జాతీయ స్థాయిలో గౌరవం ఉంటుందని పవన్ నమ్మడం వల్లే.. తక్షణ దృష్టి పార్టీని స్థానిక స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంపై పెట్టారని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ కార్యకలాపాలను తానే స్వయంగా పర్యవేక్షించడానికి పవన్ రెడీ అవుతున్నట్లు వివరిస్తున్నారు.
అలాగే రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతూనే, యువత, బీసీ, మైనారిటీ వర్గాల మద్దతు పొందేందుకు ప్రత్యేక వ్యూహాలను రూపొందించాలని పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం దీనిలో భాగమేనని విశ్లేషకులు చెబుతున్నారు. భవిష్యత్తులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ జనసేన తనదైన ముద్ర వేస్తుందని పవన్ బలంగా నమ్ముతున్నారన్న విషయాన్ని గుర్తు చేశారు.
మొత్తంగా పవన్ కళ్యాణ్ మాటలు పార్టీలో ఐక్యతను, ఉత్సాహాన్ని నింపాయి. దశాబ్ద కాలంగా ఎదుర్కొన్న సవాళ్లకు ముగింపు పలికి, జాతీయ విస్తరణకు సిద్ధమవుతున్న జనసేన ప్రయాణం.. భారత రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన మలుపును సూచిస్తోందని విశ్లేషకులు కూడా నమ్ముతున్నారు.