NDA
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ(NDA) కూటమి ఘనవిజయం సాధించి మరోసారి అధికారాన్ని దక్కించుకుంది. ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుపై ఫోకస్ పెట్టింది. మరో 3-4 రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ 89 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. జేడీయూ 85 సీట్లు గెలుచుకోగా.. ఎల్ జేపీ 19 సీట్లు ,ఇతరులు 9 సీట్లలో విజయం సాధించారు. ఎన్డీఏ(NDA) కూటమికి మొత్తం 202 సీట్లు వచ్చాయి. బీజేపీ ఎక్కువ సీట్లు గెలవడంతో సీఎం అభ్యర్థి మారతారేమో అనుకున్నారు.
కానీ సస్పెన్స్ కు తెరదించుతూ ఎన్డీఏ(NDA) కూటమి సీఎం పదవికి నితీశ్ కుమార్ పేరునే ఖరారు చేసింది. దీంతో పదోసారి బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ ఏర్పాటులోనూ, మంత్రి పదవుల పంపకాల్లోనూ బీజేపీకే అధిక ప్రాధాన్యత దక్కనుంది. దీనికి సంబంధించి కొత్త ఫార్ములాను కూడా సిద్ధం చేసుకుంది. కేంద్రమంత్రి అమిత్‌షాతో చర్చించిన కూటమి నేతలు దీనిపై ప్రణాళికను రెడీ చేశారు. ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పోస్టు లెక్కన పదవుల పంపకం జరగనుందని తెలుస్తోంది.
దీంతో మంత్రివర్గంలో బీజేపీకే మెజారి వాట దక్కుతుంది. బీజేపీ నుంచి 16, జేడీయూ నుంచి 14 మంది మంత్రులు ఉండనున్నట్టు సమాచారం. 19 సీట్లు గెలిచిన కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీకి మూడు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. అలాగే ఐదు స్థానాల్లో గెలిచిన హిందుస్తాన్ ఆవామీ మోర్చా, 4 స్థానాలు గెలిచిన రాష్ట్రీయ లోక్ మోర్చాలకు ఒక్కో మంత్రి పదవి దక్కనుంది. ఇదిలా ఉంటే నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు.
నవంబర్ 19 లేదా 20 తేదీల్లో పట్నా మైదానం వేదికగా ఈ కార్యక్రమం జరిగే అవకాశముంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు హాజరుకానున్నారు. ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారైతే దీనిపై పూర్తి క్లారిటీ వస్తుంది. కాగా సోమవారం నితీశ్ కుమార్ తన రాజీనామాను గవర్నర్ కు సమర్పిస్తారు. తర్వాత ఎన్టీఏ కూటమి శాసనసభా పక్ష సమావేశం జరుగుతుంది. కూటమి సీఎం అభ్యర్థిగా నితీశ్ ను ఎన్నుకున్న తర్వాత గవర్నర్ ను కలిసి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు విజ్ఞప్తి చేయనున్నారు.
