Bypoll
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల(Bypoll) నామినేషన్ల ఘట్టం ముగియడంతో, ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రచార యుద్ధానికి శ్రీకారం చుట్టాయి. ఈ(Bypoll) ఎన్నికలను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ… మూడు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ (GHMC), లోకల్ బాడీ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా మారిన జూబ్లీహిల్స్ బైపోల్(Bypoll) ఫలితాలు తెలంగాణ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో, అన్ని పార్టీలు తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలను ప్రకటించి, హేమాహేమీలను ప్రచార రణరంగానికి దించుతున్నాయి.
బీఆర్ఎస్ ప్రచారంలో కేసీఆర్ ఎంట్రీ..బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొననున్నారు. బీఆర్ఎస్ తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కేసీఆర్ పేరును చేర్చింది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక కేవలం ఎర్రవెళ్లిలోని ఫామ్‌హౌస్‌కే పరిమితమైన కేసీఆర్, చాలా నెలల తర్వాత ప్రజల మధ్యకు వస్తుండటంతో… ఈయన ఆరోగ్యంపై నెలకొన్న అనేక అనుమానాలు పటాపంచలయ్యాయి.
బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ విడుదల చేసిన 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేసీఆర్‌తో పాటు హరీశ్ రావు, పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా మరో 36 మంది నేతలు ఉన్నారు. తమ పెద్ద సార్ ప్రజల వద్దకు రాబోతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సవ వాతావరణంలో ఉన్నాయి. సారు రాకతో పార్టీ జూబ్లీహిల్స్‌లో దూసుకుపోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి దళం.. కాంగ్రెస్ పార్టీ కూడా 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల లిస్టును ఖరారు చేసింది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, ఎంపీ కేసీ వేణుగోపాల్ ఈ లిస్ట్‌ను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. ఈ జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రముఖంగా ఉంది.
ఆయనతో పాటు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, తుమ్మల, పొన్నం ప్రభాకర్ సహా కేబినెట్ మంత్రులంతా ప్రచారంలో పాల్గొననున్నారు. సినీ నటి విజయశాంతి, రేణుక చౌదరి, అజారుద్దీన్, జానారెడ్డి వంటి నేతలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే, పార్టీ ఫిరాయింపుల వివాదంలో ఉన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు కూడా ఈ లిస్ట్‌లో ఉండటం చర్చనీయాంశంగా మారింది.
బీజేపీ తరఫున జాతీయ నేతల ప్రచారం..కమలం పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి జాతీయస్థాయి నేతలను రంగంలోకి దించుతోంది. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్టార్ క్యాంపెయినర్లుగా ఉండగా, ఆంధ్రప్రదేశ్ నుంచి పురందేశ్వరి, సత్యకుమార్, సుజనా చౌదరి, ఎన్.వి మాధవ్, శ్రీనివాస్ వర్మ వంటి నేతలు ప్రచారానికి రానున్నారు.
వీరితోపాటు తమిళనాడు నుంచి అన్నమలై, కర్ణాటక నుంచి అభయ్ పాటిల్, తేజస్వి సూర్య, ఉత్తరాది రాష్ట్రాల నుంచి భజన్ లాల్ శర్మ, అరుణ్ లాల్ మెగ్వాల, సునీల్ బన్సల్ వంటి జాతీయ స్థాయి నాయకులు కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని సెమీ ఫైనల్‌ను మరింత హాట్ హాట్‌గా మార్చనున్నారు.