Vijay
తమిళ చిత్ర పరిశ్రమలో దళపతిగా కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న విజయ్(Vijay)..తాజాగా తన సినీ ప్రయాణానికి ముగింపు పలుకుతూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మలేషియాలో జరిగిన జన నాయగన్ ఆడియో లాంచ్ వేదిక సాక్షిగా ఆయన చేసిన ప్రకటన..విజయ్ ఫ్యాన్స్ గుండెల్లో ఒక రకమైన శూన్యాన్ని నింపింది.
మరో 30 ఏళ్లు మీ కోసం నిలబడతాను, కానీ అది సినిమాల్లో కాదు.. ప్రజా సేవలో అని విజయ్(Vijay) చెప్పిన మాటలు ఆయన రాజకీయ లక్ష్యాన్ని క్లారిటీగా చెప్పాయి. 1992లో ఒక సాధారణ నటుడిగా మొదలై, నేడు వెయ్యి కోట్ల వసూళ్లను రాబట్టే స్థాయికి ఎదిగిన ఒక స్టార్, తన కెరీర్ అత్యున్నత శిఖరాల్లో ఉన్నప్పుడే వీడ్కోలు పలకడం అనేది సినిమా చరిత్రలోనే ఒక అరుదైన సంఘటన.
1992లో తన తండ్రి దర్శకత్వంలో చిన్న పాత్రలతో కెరీర్ స్టార్ట్ చేసిన విజయ్(Vijay), ఆరంభంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. కానీ 1994లో ‘నాలయా’, 1996లో ‘సెల్వ’ వంటి సినిమాలతో మాస్ హీరోగా తన ముద్ర వేశారు. మొత్తం 30 ఏళ్ల ప్రయాణంలో 68 సినిమాలు చేయగా, అందులో 60కి పైగా చిత్రాల్లో సోలో హీరోగా నటించి మెప్పించినవే.
2004లో వచ్చిన ‘ఘిల్లీ’, 2007లో ‘పోక్కిరి’ వంటి విజయాలు విజయ్‌ను తమిళనాట ప్రతి ఇంట్లో తమ కుటుంబ సభ్యుడిగా మార్చేశాయి. ఇక 2012లో వచ్చిన ‘తుప్పాక్కి’ ఆయన ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ‘లియో’ (2023), ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT)’ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా రూ. 2000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి, బాక్సాఫీస్ వద్ద విజయ్ పవర్ ఏంటో నిరూపించాయి. విజయ్ కెరీర్‌లో 3 జాతీయ అవార్డులు, 5 తమిళనాడు రాష్ట్ర అవార్డులు అందుకోవడం తన నటనకు నిదర్శనంగా నిలుస్తాయి..
ఇప్పుడు విజయ్ నిర్ణయంతో.. ఆయన నటిస్తున్న ‘జన నాయగన్’ (తెలుగులో జన నాయకుడు) విజయ్ కెరీర్‌లో ఆఖరి సినిమాగా నిలవబోతోంది. ఈ సినిమా తర్వాత ఆయన పూర్తిగా తన రాజకీయ పార్టీ అయిన తమిళగ వెట్రి కళగం (TVK) కార్యకలాపాలకే పరిమితం కానున్నారు.
దీంతో విజయ్ నిర్ణయం సరైనదేనా? రాజకీయాల్లో సక్సెస్ అవుతారా? అన్న ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. సినిమా స్టార్లు రాజకీయాల్లోకి రావడం తమిళనాడుకు కొత్త కాదు. ఎంజీఆర్, జయలలిత వంటి వారు ఓ స్థాయిలో సక్సెస్ అయి అక్కడ ముఖ్యమంత్రులుగా రాణించగా, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి వారు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు.
అయితే జాగ్రత్తగా గమనిస్తే విజయ్ రూట్ పవన్ కళ్యాణ్ మాడల్‌ను తలపిస్తోంది. ఇప్పుడు విజయ్ సినిమాలను వదిలి, క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉంటూ పార్టీని నిర్మించాలని భావిస్తున్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా ఆయన వేస్తున్న అడుగులు డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి బలమైన పార్టీలకు సవాలు విసిరేలా ఉన్నాయి. పీక్ స్టేజ్‌లో మూవీలను వదిలేయడం వల్ల ప్రజల్లో విజయ్ తన వ్యక్తిగత స్వార్థం కంటే సేవకే ప్రాధాన్యత ఇస్తున్నారనే పాజిటివ్ ఇమేజ్ వచ్చే అవకాశం ఉంది.
రాజకీయాల్లోకి వెళ్లిన నటులు ఎవరైనా, అక్కడ పరిస్థితులు అనుకూలించకపోతే మళ్లీ బ్యాక్ స్టెప్ తీసుకుని మేకప్ వేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్ వంటి వారు దీనికి ఉదాహరణలు. విజయ్ కూడా ఒకవేళ 2026 ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోతే, అభిమానుల ఒత్తిడితోనో ఇంకో రీజన్‌తోనో మళ్లీ సినిమాల్లోకి వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం. ప్రస్తుతానికి ఆయన ఫోకస్ అంతా ఓటు బ్యాంకును పటిష్టం చేసుకోవడంపైన పెట్టారు. సినిమాలకు వీడ్కోలు చెప్పడం ద్వారా తన సీరియస్‌నెస్‌ను చాటుకున్నారు.
తమిళనాడు రాజకీయ యవనికపై దళపతి(Vijay) వేయబోయే ముద్ర ఎలా ఉంటుందో చూడాలి.ఇప్పటివరకూ ఒక స్టార్‌గా సంపాదించిన ఇమేజ్‌ను ఇకపై ఓట్లుగా మార్చుకోవడం విజయ్‌కు ఉన్న అతిపెద్ద సవాలు. 2026 ఎన్నికల ఫలితాలే ఆయన రిటైర్మెంట్ నిర్ణయం సరైనదా కాదా అన్న విషయాన్ని తేలుస్తాయి. ఏది ఏమైనా, వెండితెరపై ఆయన డాన్సులు, ఫైట్లు, మెసేజ్‌లను ఇకపై అభిమానులు మిస్ అవుతారన్నది మాత్రం ఖాయం. కానీ ప్రజానాయకుడిగా ఆయన చేసే ప్రయాణం సక్సెస్ అవ్వాలని కోట్లాది మంది ఆకాంక్షిస్తున్నారు.
