Kanchi
తమిళనాడులోని 108 దివ్యక్షేత్రాలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన కాంచీపురం (Kanchi)వరదరాజ పెరుమాళ్ ఆలయం మరో వివాదంలో చిక్కుకుంది. భక్తుల రద్దీ పరంగా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో, స్వామి దర్శనం తర్వాత అత్యంత ముఖ్యమైనవిగా భావించే బంగారు, వెండి బల్లుల దర్శనానికి సంబంధించిన లోహాలు మాయం అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
40 ఏళ్లకోసారి దర్శనం ఇచ్చే అత్తి వరదరాజ స్వామి క్షేత్రం…కంచి (Kanchi)వరదరాజ పెరుమాళ్ ఆలయం యొక్క ప్రాముఖ్యత అపారం. ఇక్కడి మూలవిరాట్‌లలో ఒకరైన అత్తి వరదరాజ పెరుమాళ్ స్వామి 40 ఏళ్లకోసారి మాత్రమే భక్తులకు దర్శనమిస్తారు. చివరగా 2019లో 40 రోజులపాటు ఈ అద్భుత దర్శనం లభించింది. మళ్లీ 2059లో మాత్రమే స్వామి తలుపులు తెరుచుకోనున్నాయి. ఇంతటి చారిత్రక, ఆధ్యాత్మిక కలిగిన ఆలయంలోని విలువైన లోహాలు మాయం కావడం భక్తులను కలచివేస్తోంది.
వరదరాజ పెరుమాళ్ (Kanchi)ఆలయంలో భక్తులు తప్పనిసరిగా దర్శించుకునే వాటిలో బంగారు, వెండి బల్లుల దర్శనం ఒకటి. ఈ లోహపు తాపడాలను విగ్రహాలకు కవచంగా చేసి దశాబ్దాలుగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. వీటిని దర్శించుకోవడం వలన సకల దోషాలు నివారించబడతాయని, ముఖ్యంగా గౌళీ పతన దోషం (బల్లి శరీరంపై పడటం వలన వచ్చే దోషం) తొలగిపోతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వందల సంవత్సరాలుగా భక్తులు తాకడం వలన అరిగిపోయిన ఈ బంగారం, వెండి తాపడాలకు ఆధ్యాత్మిక విలువతో పాటు మార్కెట్లోనూ ఎంతో డిమాండ్ ఉంది.
ఆలయ అధికారులు ఆరు నెలల క్రితం ఈ బంగారు, వెండి బల్లులు మరియు విగ్రహాల కవచాలకు మరమ్మతు పనులు చేపట్టినట్లు తెలిపారు. అయితే, మరమ్మతుల తర్వాత వాటి స్థానంలో పూత పూసిన నాసిరకం నకిలీ తాపడాలను ఉంచారన్న అనుమానం బలపడింది.
పురాతనమైన ఈ లోహాలు వందేళ్లకు పైగా నాణ్యత కలిగినవిగా భావించడం,వాటికి మార్కెట్లో సాధారణ బంగారం కంటే పదింతలు ఎక్కువ ధర పలికే కొనుగోలుదారులు ఉండటం వలన, ఈ బంగారం తరలించబడి, నకిలీ వాటిని అమర్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దీంతో..తమిళనాడులో ఆలయ సంపద, విగ్రహాల చోరీలను అరికట్టడానికి ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విభాగానికి చెందిన డీసీపీ సంపత్ నేతృత్వంలో ఈ కేసు విచారణ కొనసాగుతోంది.
డీసీపీ సంపత్ ఆలయ అదనపు ఈవో జయలక్ష్మితో పాటు, ఈ మరమ్మతు పనులకు సంబంధం ఉన్న అర్చకులు మరియు ముఖ్య అధికారులందరినీ విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడు దేవాదాయ శాఖ ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా పరిగణించి, విచారణ అధికారిని రెండు వారాల్లోపు పూర్తి నివేదికను సమర్పించాలని ఆదేశించింది.
ఇటీవల కాలంలో కేరళలోని శబరిమల అయ్యప్ప సన్నిధిలో కూడా ద్వారపాలకుల విగ్రహాలకు ఉన్న బంగారు తాపడం మాయమైన ఘటనపై విచారణ జరుగుతుండగానే..కంచిలో జరిగిన ఈ ఘటన ఉభయ రాష్ట్రాల హిందూ ఆలయ ట్రస్టుల నిర్వహణపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది.
తమిళనాడులో పలు దేవాలయాల్లో నిత్యం ఇలా సంపదకు సంబంధించిన వివాదాలు జరుగుతుండడం, ఆలయ ట్రస్టుల నిర్వహణపై ప్రజల్లో అపనమ్మకం పెరగడానికి కారణమవుతోంది. ఈ వరుస ఘటనలు రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు అధికార పక్షాన్ని విమర్శించడానికి కీలకమైన అస్త్రంగా మారాయి. ఆలయాల్లో అక్రమాలపై ప్రభుత్వం తీసుకునే చర్యలు, దైవ సంపద పరిరక్షణపై విచారణాధికారుల నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
