Adi Annamalai: అరుణాచల క్షేత్రంలో ఆది అన్నామలై రహస్యం తెలుసా ?

Adi Annamalai: అరుణాచలేశ్వర అగ్ని ఆలయ నిర్మాణం జరగడానికి దాదాపు ఒక శతాబ్దం ముందే ఈ ఆలయం నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది.

Adi Annamalai

దక్షిణ భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన , పవిత్రమైన క్షేత్రాలలో తిరువణ్ణామలై ఒకటి. అరుణాచల పర్వతం చుట్టూ చేసే గిరిప్రదక్షిణ లేదా గిరివలం అనేది కోట్లాది మంది భక్తుల నమ్మకం. ఈ గిరివలం మార్గంలో ఏడో కిలోమీటరు వద్ద కొలువై ఉన్న అత్యంత పురాతనమైన, మహిమాన్వితమైన ఆలయమే శ్రీ ఆది అన్నామలై (Adi Annamalai)ఆలయం.

అరుణాచల కొండ చుట్టూ ఉన్న 3 ప్రధాన ఆలయాలలో ఇది మొదటిది. ప్రసిద్ధ అరుణాచలేశ్వర అగ్ని ఆలయ నిర్మాణం జరగడానికి దాదాపు ఒక శతాబ్దం ముందే ఈ ఆలయం నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది. అంటే ఈ ఆలయానికి సుమారు 2 వేల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని తెలుస్తోంది.

ఆది అంటే మొదటిది అని అర్థం. అందుకే అరుణాచల పర్వతంపై వెలసిన అసలైన, మొదటి లింగం ఇక్కడే ఉందని భక్తుల నమ్మకం. సుమారు అర ఎకరం విస్తీర్ణంలో ఉన్న ఈ చిన్న ఆలయం ఆధ్యాత్మికంగా ఎంతో శక్తివంతమయినది.

ఈ ఆలయ స్థాపన వెనుక ఉన్న స్థల పురాణం కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. శివుడు అపరిమితమైన కాంతి స్తంభంగా వ్యక్తమైనప్పుడు, బ్రహ్మ, విష్ణువు ఆ స్తంభం యొక్క మొదలు , చివరను కనుగొనడానికి బయలుదేరారట. విష్ణువు వరాహ రూపంలో కిందకు వెళ్లగా, బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్లారట. అయితే ఇద్దరికీ శివుని ఆది అంతాలు దొరకలేదు.

కానీ బ్రహ్మ దేవుడు మాత్రం తాను శివుని శిఖరాన్ని చూశానని అబద్ధం చెప్పాడట. దీంతో శివుడు ఆగ్రహించి బ్రహ్మకు లోకంలో పూజలు ఉండవని శపించాడట. ఆ శాప విమోచనం కోసం, తన తప్పునకు ప్రాయశ్చిత్తంగా బ్రహ్మ అరుణాచల కొండకు పశ్చిమ వైపున ఒక శివలింగాన్ని తయారు చేసి తపస్సు చేశాడట. ఆ లింగమే ఇప్పుడు మనం పూజిస్తున్న ఆది అన్నామలై లింగం (Adi Annamalai)అని స్థలపురాణాలు చెబుతాయి.

Adi Annamalai

మరో కథనం ప్రకారం అప్సరస తిలోత్తమపై మోజు పడి విజ్ఞత కోల్పోయిన బ్రహ్మ, తిరిగి తన స్పృహ పొందిన తర్వాత..ఈ(Adi Annamalai) ప్రాంతంలో ఇక్కడ శివుడిని ప్రార్థించి పవిత్రతను పొందాడని చెబుతారు. అందుకే ఈ ఆలయాన్ని దర్శించుకుంటే చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్మకం.

ప్రారంభంలో ఈ ఆలయం కేవలం చెక్కతో నిర్మించబడి ఉండేదట. ఆ తర్వాత కాలక్రమేణా గోపురాలను నిర్మించి, రాతి కట్టడంగా మార్చారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఆలయ రూపం సుమారు 1200 ఏళ్ల నుంచి ఇలాగే ఉందని స్థానికులు చెబుతారు. పాండ్య రాజు వజ్రంగదుడు ఈ లింగానికి ఒక అందమైన ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి.

తమిళ భక్తి సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన తేవరం పద్యాల్లో కూడా ఈ ఆలయ ప్రస్తావన ఉండటంతో ఇది ఆరో శతాబ్దం నాటికే ఎంతో ప్రసిద్ధి చెందిందని అర్థమవుతోంది. తొమ్మిదవ శతాబ్దంలో సుప్రసిద్ధ కవి మాణిక్య వాసాగర్ ఈ ఆలయ సమీపంలోనే తన ప్రసిద్ధ ‘తిరువెంపావై’ అనే గ్రంథాన్ని రచించడం మరో విశేషం. అయితే తర్వాత కొంత శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని 1918లో చెట్టియార్ల బృందం పదిహేనేళ్ల పాటు శ్రమించి పునరుద్ధరించారట.

గొప్ప ఆధ్యాత్మిక గురువుగా వెలుగొందిన రమణ మహర్షికి కూడా.. ఈ ఆలయంతో విడదీయరాని అనుబంధం ఉండేది. ఆయన గిరిప్రదక్షిణ చేసే సమయంలో తరచుగా ఇక్కడే రాత్రులు బస చేసేవారట. అలా ఒకసారి వర్షం కురుస్తున్న సమయంలో రమణ మహర్షి ఈ ఆలయ గర్భగృహంలో రాత్రంతా గడపగా..ఆ సమయంలో గర్భగుడిలో ఎవరూ లేకపోయినా, తెల్లవారుజామున దివ్యమైన సామవేద మంత్రోచ్ఛారణ ఆయనకు వినిపించిందట.

అది దివ్య పురుషులు కానీ దేవతలు కానీ చేస్తున్న జపంగా రమణ మహర్షి అర్ధం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ‘డే బై డే విత్ భగవాన్’ అనే పుస్తకంలో స్వయంగా వివరించారు. ఈ ప్రదేశంలో ఉన్న ప్రశాంతత, ఆధ్యాత్మిక శక్తి మాటలకు అందదని ఆయన చెప్పేవారు.

అరుణాచల యాత్ర చేసే వారు ఎవరైనా సరే ఈ ఆది అన్నామలై(Adi Annamalai)ని దర్శించుకోకుండా వెళితే అది వారి యాత్ర పూర్తి కానట్లేనని పెద్దలు చెబుతుంటారు. అందుకే ప్రతి పౌర్ణమి రోజు వేలాది మంది భక్తులు గిరిప్రదక్షిణలో భాగంగా ఈ ప్రాచీన ఆలయాన్ని కూడా సందర్శించి శివకృపకు పాత్రులవుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version