Diwali
దీపావళి(Diwali) పండుగ అనగానే వెంటనే హిందువులకు సంబంధించిన నరకాసుర వధనో, రాముడి పట్టాభిషేకమో గుర్తొస్తుంది. అయితే, ఈ వెలుగుల పండుగను హిందువులతో పాటు బౌద్ధులు, జైనులు, సిక్కులు కూడా అదే రోజున ఆనందోత్సాహాలతో జరుపుకొంటారన్న విషయం చాలామందికి తెలియదు. సందర్భాలు వేరైనా, అన్ని మతాలలో దీపాలు వెలిగించడం అనే ఒకే ఒక చిహ్నం ఉండటం ఈ పండుగ గొప్ప ఆధ్యాత్మిక ఐక్యతకు నిదర్శనంగా చెబుతారు.
నేపాల్, శ్రీలంక, మయన్మార్, సింగపూర్, మలేషియా, ఫిజీ వంటి అనేక దేశాలలో దీపావళి అధికారిక సెలవు దినంగా ఉండటమే కాక, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే పండుగగా మారింది.
హిందువుల ప్రధాన పండుగలలో ఒకటైన దీపావళి(Diwali)ని అనేక చారిత్రక, ఆధ్యాత్మిక కారణాల కోసం జరుపుకొంటారు.
నరకాసుర సంహారం.. శ్రీకృష్ణుడు అహంకార పూరితమైన నరకాసురుడిని సంహరించిన తర్వాత, ఆ విజయాన్ని ఆనందోత్సాహాలతో ప్రజలు దీపాలు వెలిగించి స్వాగతించారు.
శ్రీరామ పట్టాభిషేకం.. రావణవధ అనంతరం రాముడు అయోధ్యకు చేరుకొని పట్టాభిషిక్తుడైన రోజుకు గుర్తుగా ఈ వేడుకలు జరుపుకొంటారు.
ప్రాంతాన్ని బట్టి, బెంగాల్‌లో కాళికాదేవి పూజ, మహారాష్ట్రలో గణేశ పూజ, మరికొన్ని ప్రాంతాల్లో లక్ష్మీ-విష్ణు వివాహోత్సవంగానూ జరుపుతారు. గుజరాత్, మార్వాడీ వర్గాల వారు దీపావళినే తమ నూతన సంవత్సర ఆరంభంగా పరిగణిస్తారు.
బౌద్ధుల దీపావళి(Diwali)- అశోక విజయ దశమి..బౌద్ధులు దీపావళి రోజును ప్రత్యేకంగా భావిస్తారు. ఈ రోజునే అశోక చక్రవర్తి కళింగ యుద్ధంలో జరిగిన రక్తపాతాన్ని చూసి, హింసను విడిచిపెట్టి అహింసా-ధర్మాన్ని స్వీకరించారు. బౌద్ధ మతాన్ని అంగీకరించిన ఈ రోజును బౌద్ధులు “అశోక విజయ దశమి”గా భావిస్తారు. ఈ రోజున వారు బుద్ధుని బోధనలను స్మరించుకుని, ప్రార్థనలు చేసి దీపాలు వెలిగిస్తారు.
జైన మతంలో దీపావళి- నిర్వాణానికి చిహ్నం..జైన మతస్థులకు కూడా దీపావళి చాలా ముఖ్యమైన దినం. జైన మత వ్యవస్థాపకులలో ఒకరైన మహావీరుడు ఈ రోజే మోక్షాన్ని (నిర్వాణం) పొందినట్లుగా వారు నమ్ముతారు. మహావీరుని నిర్వాణం తర్వాత ఆ రాత్రి ఏర్పడిన చీకటిని తొలగించేందుకు ప్రజలు దీపాలు వెలిగించారు. ఈ సంప్రదాయం కొనసాగింపుగా, మహావీరుని నిర్వాణం చీకటి నుండి వెలుగులోకి ప్రస్థానం అని భావించి, ప్రతి సంవత్సరం ఈ అమావాస్యనాడు జైనులు దీపాలు వెలిగిస్తారు.
సిక్కు మతంలో దీపావళి- బందీ ఛోర్ దివస్..సిక్కులు దీపావళి రోజునే తమ పండుగ అయిన “బందీ ఛోర్ దివస్” (Day of Liberation)ను జరుపుకుంటారు. దీని వెనుక బలమైన చారిత్రక కారణం ఉంది.
1619లో ఆరవ గురువు గురు హర్ గోవింద్ జీ, మొఘల్ చక్రవర్తి జహంగీర్ చెర నుంచి విడుదలైన రోజు ఇది. ఆయన తనతోపాటు అన్యాయంగా బంధించబడిన 52 మంది రాజులను కూడా విముక్తి చేశారు. అందుకే ఆయనను “బందీ ఛోర్” (విముక్తి కల్పించినవాడు) అని పిలుస్తారు.
ఆ విముక్తి వార్త తెలుసుకున్న అమృత్‌సర్ ప్రజలు ఆనందోత్సాహాలతో స్వర్ణదేవాలయాన్ని (Golden Temple) దీపాలతో అలంకరించారు. ఆ ఆచారం ఈ రోజుకీ కొనసాగుతుంది. అంతేకాకుండా, 1737లో సిక్కు పండితుడు భాయి మాన్ సింగ్ జీ మొఘల్ అణచివేతకు వ్యతిరేకంగా అమరుడైన రోజు కూడా ఇదే. అందువల్ల దీపావళి సిక్కులకు విముక్తి-ధర్మం మరియు త్యాగానికి చిహ్నంగా నిలుస్తుంది.
దీపావళి మత భేదాలను దాటి, చెడుపై మంచి సాధించిన విజయంగా చెబుతారు. చీకటిపై వెలుగు సాధించిన ప్రకాశాన్ని గుర్తుచేసే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఐక్యత పండుగే దీపావళి.