Narada Muni
నారదుడు పేరు చెప్పగానే మనకు నారాయణ నారాయణ అంటూ అక్కడివి ఇక్కడ, ఇక్కడివి అక్కడ చెప్పే వార్తాహరుడగానే తెలుసు. అయితే కలహ భోజనుడు(Narada Muni) అని పిలువబడే దేవర్షి నారదుడు, నిజానికి లోకహితార్థం, లోకరక్షణ కొరకే ప్రతి కార్యాన్ని చేసే ఒక మహోన్నతమైన భగవద్భక్తుడు అన్న విషయం చాలామందికి తెలీదు. వీణాతంత్రులు మీటుతూ, నిరంతరం ‘నారాయణ‘ నామాన్ని ఉచ్చరిస్తూ త్రిలోక సంచారం చేసే నారదుడి గొప్పతనం చరిత్ర తెలిస్తేనే అర్థమవుతుంది.
పరమాత్మ గుణానుభవంలో తన్మయత్వం పొందిన నారదుడు, తన ఉపదేశాలతో ఎందరినో మహాభక్తులుగా, జ్ఞానులుగా తీర్చిదిద్దారు.
వాల్మీకి, వ్యాసుడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి మహామూర్తులు భగవద్భక్తి మార్గంలో స్థిరపడటానికి నారదుడే ప్రధాన కారకుడు.
ముఖ్యంగా, వ్యాసమహర్షికి శ్రీమద్భాగవతం రచించడానికి ప్రేరణ కలిగించినవాడు నారదుడే(Narada Muni). తన పూర్వ జన్మ కథను వ్యాసుడికి చెప్పి, భగవద్భక్తుల కథల సమాహారంగా భాగవతాన్ని రాయమని ఆయన ప్రోత్సహించారు. నారదుడు రచించిన ‘భక్తి సూత్రాలు’ భక్తి మార్గాన్ని లోకానికి చాటాయి.
నారదుడి(Narada Muni) ప్రస్తుత జన్మ బ్రహ్మదేవుడి కుమారుడిగా ఉన్నా కూడా.. ఆయన పూర్వ జన్మ వృత్తాంతం ఆయన గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణానికి అద్దం పడుతుంది.
నారదుడు పూర్వజన్మలో ఒక దాసీపుత్రుడు. ఆయన తల్లి ఒక ఐశ్వర్యవంతుడైన బ్రాహ్మణుడి ఇంట్లో సేవలు చేసేది. చిన్నప్పటి నుంచే ఆ బ్రాహ్మణుడి ఇంట వేదవేదాంగాల పఠనం వింటూ పెరిగాడు.
ఒకసారి చాతుర్మాస్య దీక్ష గడపడానికి ఆ ఇంటికి వచ్చిన కొంతమంది సన్యాసులకు నారదుడు శ్రద్ధగా సేవలు చేశాడు. ఆయన సేవలకు ముచ్చటపడిన సన్యాసులు, దీక్షాకాలం పూర్తయి వెళ్తూ… ప్రేమతో అతనికి ద్వాదశాక్షరీ మహామంత్రాన్ని , ప్రణవాన్ని ఉపదేశించారు. మాయ, సత్యం వంటి ఆధ్యాత్మిక విషయాల గురించి బోధించారు. ఆ బోధనలు ఆ బాలుడి మనసులో బలంగా నాటుకున్నాయి.
పాముకాటుతో తల్లి మరణించాక, నారదుడు ‘ఈశ్వరాన్వేషణ‘ చేస్తూ ఒంటరిగా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక రావిచెట్టు కింద కూర్చుని నిరంతరం ద్వాదశాక్షరీ మంత్రాన్ని జపిస్తుండగా, అతనికి శ్రీమన్నారాయణుడి లీలామాత్ర దర్శనం లభించింది.
ఆ సమయంలో ఒక అశరీరవాణి ద్వారా నారాయణుడు మాట్లాడుతూ… “ఈ జన్మలో సత్పురుషులతో తిరిగిన అదృష్టం వల్ల నీకు ఈ లీలామాత్ర దర్శనం లభించింది. నీవు చూసిన ఈ రూపాన్ని కోరుకుంటూ, నిరంతరం నా గురించి పాడుతూ, మాట్లాడుతూ ప్రకృతి ధర్మాన్ననుసరించి ఈ శరీరాన్ని వదిలేస్తావు. ఆ తరువాత నీవు బ్రహ్మదేవుడి కుమారుడిగా జన్మిస్తావు. ఆనాడు నీకు ‘మహతి‘ అనే వీణను బహూకరిస్తాను. దానిపై నారాయణ స్తోత్రం చేస్తూ లోకాల్లో విహరిస్తావు,” అని చెప్పాడు.
నారాయణుడి ఆజ్ఞ ప్రకారం, కల్పాంతం తరువాత బ్రహ్మదేవుడు నారదుణ్ని తన కుమారుడిగా సృష్టించాడు. ‘మహతి‘ వీణతో, ఆయన వైకుంఠం, సత్యలోకం, కైలాసం… ఇలా ఎక్కడికి వెళ్లినా లోక సంక్షేమం కోసం పాటుపడే దేవర్షిగా అవతరించారు. దేవతలు, రాక్షసులు అనే తేడా లేకుండా అందరికీ ఉపదేశాలు చేస్తూ, భగవంతుడి శక్తిని చాటుతూ, అన్ని యుగాల్లో జగత్కల్యాణం కోసం కృషి చేస్తూనే ఉన్నారు.
