Kanchi:కంచి బంగారు,వెండి బల్లుల రహస్యమేంటి? ఒక్క స్పర్శతో అన్ని దోషాలు పోతాయా?

Kanchi: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మనిషి మీద బల్లి పడితే దానిని బల్లి దోషంగా పరిగణిస్తారు.

Kanchi

దక్షిణ భారత దేశంలో ఆధ్యాత్మిక వైభవానికి నిలయం కంచి(Kanchi) అని పురాణాలు చెబుతాయి. అయితే కంచి అనగానే చాలా మంది కామాక్షి అమ్మవారిని మాత్రమే తలుచుకుంటారు.

అయితే కొద్ది మందికి మాత్రమే మోక్షపురిగా పేరుగాంచిన కంచిలో శ్రీ వరదరాజస్వామి దేవాలయం అత్యంత మహిమాన్వితమైనదని తెలుసు. ఈ ఆలయంలో భక్తులను విశేషంగా ఆకర్షించేవి గర్భాలయం వెనుకుండే ‘బంగారు బల్లి’ , ‘వెండి బల్లి’. అసలు ఈ బల్లులని తాకితే దోషాలు పోతాయనే నమ్మకం వెనుక ఉన్న కారణాల గురించి ఓ సారి చూద్దాం.

పురాణాలలోని కథ ప్రకారం.. గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులుండేవారట. ఒకరోజు ఆ శిష్యులు మహర్షి పూజ కోసం జలాశయం నుంచి నీటిని తీసుకువచ్చారు. అయితే ఆ పాత్రలోని నీటిలో ఒక బల్లి పడి ఉండటాన్ని వారిద్దరూ గమనించలేదు.

ఆ నీటిని గురువుగారికి ఇవ్వగా.. అందులో బల్లిని చూసిన గౌతమ మహర్షి ఆగ్రహించి వెంటనే ఆ ఇద్దరు శిష్యులను బల్లులుగా మారిపోమని శపించారట. వారు తమ తప్పును మన్నించమని వేడుకోగా.. కంచిలోని వరదరాజస్వామిని సేవించి, అక్కడ విగ్రహ రూపంలో ఉండాలని అన్నారట. అక్కడ భక్తులు మిమ్మల్ని తాకినప్పుడు శాపవిమోచనం కలుగుతుందని చెప్పారట.

అలాగే మరో కథ ప్రకారం.. సరస్వతీ దేవి శాపం వల్ల ఇంద్రుడు బల్లిగా మారి, ఇక్కడి కోనేటిలో స్నానం చేసి స్వామిని దర్శించుకుని తిరిగి తన రూపం పొందాడని చెబుతారు. అందుకే ఆ జ్ఞాపకార్థం ఇక్కడ బంగారు, వెండి బల్లుల విగ్రహాలు ఏర్పాటు చేశారని కథనాలు ఉన్నాయి..

Kanchi

ఇంతకీ బంగారు బల్లిని తాకితే ఏమవుతుందన్న ప్రశ్న చాలామందిలో ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మనిషి మీద బల్లి పడితే దానిని బల్లి దోషంగా పరిగణిస్తారు. ఏ అవయవం మీద బల్లి పడితే ఎలాంటి ఫలితం ఉంటుందో ‘పల్లి శాస్త్రం’ వివరిస్తుంది. ఈ దోషాల వల్ల కలిగే ఎలాంటి అనర్థాల నుంచి అయినా బయటపడటానికి కంచిలోని ఈ విగ్రహాలను తాకడం ఒక పరిష్కారంగా భక్తులు నమ్ముతారు.

బంగారు బల్లి – సూర్యుడికి సంకేతం (ఆత్మకారకుడు) అలాగే వెండి బల్లి – చంద్రుడికి సంకేతం (మనస్కారకుడు)గా చెబుతారు.

సూర్యచంద్రుల సాక్షిగా చేసిన పాపాలు తొలగిపోతాయని, అలాగే మరీ ముఖ్యంగా నరదోషం పటాపంచలు అవుతుందని నమ్మకం. ఈ బల్లులను తాకినప్పుడు మనలోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి, మానసిక ప్రశాంతత లభిస్తుందట.అందుకే ఎప్పుడైనా కంచి(Kanchi) వెళ్లినప్పుడు ఈ అద్భుత శిల్పకళను దర్శించుకుని, ఆ ఆధ్యాత్మిక అనుభూతిని పొందడానికి ప్రయత్నించండి.

Supreme Leader:ఏ క్షణమైనా దాడి..బంకర్‌లోకి ఇరాన్ సుప్రీం లీడర్

Exit mobile version