Kondagattu
ఆ పేరు చెబితేనే ఒక శక్తి.. ఒక నమ్మకం. లక్షలాది మంది భక్తులకు కొంగు బంగారం.. ఎన్నో అద్భుతాలు జరిగిన పుణ్యక్షేత్రం. మానసిక ఒత్తిడి నుంచి ఆరోగ్య సమస్యల వరకు అన్నిటికీ ఒకే పరిష్కారం.. అదే తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో కొలువైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం. భయాలను, సమస్యలను దూరం చేసే ఈ పుణ్యక్షేత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఆలయం(Kondagattu) యొక్క ప్రత్యేకత, చరిత్ర..కొండగట్టు జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట గ్రామంలో అందమైన కొండల మధ్య నెలకొని ఉంది. ఇది తెలంగాణలో అత్యంత ప్రసిద్ధమైన హనుమంతుడి ఆలయాలలో ఒకటి. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం స్వయంభూ లేదా స్వయంగా ఏర్పడినదిగా భక్తులు నమ్ముతారు. దాదాపు 500 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది.
స్థానిక కథల ప్రకారం, కోడిమ్యాల గ్రామానికి చెందిన సింగం సంజీవుడు అనే గొర్రెల కాపరి ఒకసారి తన గొర్రెను వెతుకుతూ ఈ కొండల్లో అలసిపోయి నిద్రపోయాడు. ఆ సమయంలో ఆంజనేయ స్వామి ఆయన కలలో కనిపించి, తన గొర్రె ఉన్న స్థానాన్ని తెలియజేశారు. మేల్కొని చూస్తే, అక్కడ ఒక వెలిగిపోతున్న ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. ఆనందంతో సంజీవుడు అక్కడ ఒక చిన్న ఆలయాన్ని నిర్మించాడు.
కొండగట్టు(Kondagattu) ఆలయానికి భక్తులు కేవలం పూజల కోసమే కాదు, తమ సమస్యలకు పరిష్కారం కోసం కూడా వస్తారు. మానసిక సమస్యలు, భయాలు, చట్టపరమైన ఇబ్బందులు ఉన్నవారు ఇక్కడకు వస్తే ఉపశమనం లభిస్తుందని భక్తులు బలంగా విశ్వసిస్తారు.
ఈ ఆలయంలో హనుమాన్ చాలీసా పఠనం చేయడం వల్ల వేగంగా ఫలితాలు వస్తాయని నమ్ముతారు. చాలామంది భక్తులు 11, 21 లేదా 41 రోజుల పాటు దీక్షలు చేసి స్వామి ఆశీర్వాదాలు పొందుతారు. ఈ ఆలయంలో ప్రసాదంగా ఇచ్చే చందనం తీసుకుంటే ఆరోగ్య లాభాలు కలుగుతాయని, శరీరంలో శక్తి పెరుగుతుందని భక్తులు నమ్ముతారు.
కొండగట్టు(Kondagattu) దేవాలయం జగిత్యాల నుంచి 15 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు.
అక్టోబర్ నుంచి మార్చి మధ్య ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం . ఈ సమయంలో వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ముఖ్యంగా, హనుమాన్ జయంతి సమయంలో లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ సమయంలో ప్రత్యేక పూజలు, శోభాయాత్రలతో ఆలయం కిటకిటలాడుతూ ఉంటుంది.