Lord Venkateswara
కొత్త ఏడాదిలో కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి(Lord Venkateswara) దర్శనం చేసుకోవాలని చాలామంది భక్తులు కోరుకుంటారు. అయితే 2026 జనవరి 1న తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు టీటీడీ అధికారులు కొన్ని కఠినమైన నిబంధనలను విధించారు.
ఈసారి 2026 జనవరి 1వ తేదీ, తిరుమల(Lord Venkateswara)లో అత్యంత పవిత్రమైన ‘వైకుంఠ ద్వార దర్శన’ సమయంలో (డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు) రావడంతో భక్తుల రద్దీ ఊహించని స్థాయిలో ఉండబోతోంది. నిజానికి పంచాంగం ప్రకారం వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30, 2025నే ఉన్నా కూడా, తిరుమల ఆలయంలో ఆ తర్వాతి పది రోజుల వరకు వైకుంఠ ద్వారం తెరిచే ఉంటుంది. అందుకే జనవరి 1న వెళ్లే భక్తులకు కూడా ఉత్తర ద్వార దర్శనం లభిస్తుండటంతో ..ఆరోజు భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి ఎంత కష్టపడి అయినా తిరుమల వెళ్లాలని అనుకుంటారు
రద్దీని క్రమబద్ధీకరించడానికి టీటీడీ అధికారులు ఈసారి డిసెంబర్ 30, 31 , జనవరి 1 తేదీలకు సంబంధించి ప్రత్యేక నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ మూడు రోజులు సామాన్య భక్తులకు దర్శనం కేవలం ఆన్‌లైన్ ‘ఎలక్ట్రానిక్ డిప్’ (Lucky Dip) పద్ధతిలో కేటాయించిన టికెట్ల ద్వారా మాత్రమే లభిస్తుంది.అందుకే మీరు ముందే ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకుని, లక్కీ డిప్‌లో ఎన్నికై ఉంటేనే ఈ మూడు రోజులు దర్శనానికి అనుమతి ఉంటుంది. ఒకవేళ టికెట్ లేకపోతే నేరుగా తిరుమలకు వెళ్లినా కూడా దర్శనం దొరకడం అసాధ్యం.
అయితే భక్తులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ మూడు రోజులు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (SED) , శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్‌లైన్ టికెట్లు పూర్తిగా రద్దు చేయబడ్డాయి. అలాగే ఎటువంటి సిఫార్సు లేఖలను (Recommendation Letters) టీటీడీ స్వీకరించదు. కేవలం ప్రొటోకాల్ ఉన్న వీఐపీలు నేరుగా వస్తేనే బ్రేక్ దర్శనం ఇస్తారు.
అలాగే వృద్ధులు, దివ్యాంగులు , చంటిపిల్లల తల్లిదండ్రులకు ఇచ్చే ప్రత్యేక క్యూ లైన్లను కూడా జనవరి 8వ తేదీ వరకు నిలిపివేశారు. భక్తులు దర్శనానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఒరిజినల్ ఆధార్ కార్డు వెంట ఉంచుకోవాలి. వసతి గదుల కొరత ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ముందే గదులు బుక్ చేసుకున్న వారు లేదా తిరుపతిలో వసతి చూసుకున్న వారు మాత్రమే ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని టీటీడీ పాలకమండలి చెబుతుంది. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ పది రోజులు వీఐపీల తాకిడిని తగ్గిస్తూ టీటీడీ అధికారలు ఈ నిర్ణయం తీసుకుంది.
