Tripura Sundari
ఈశాన్య భారతదేశంలోని త్రిపుర రాష్ట్రంలోని ఉదయపూర్‌లో ఉన్న మాతా త్రిపుర సుందరి(Tripura Sundari) ఆలయం అద్భుతమైన అందంతో, ఆధ్యాత్మిక వైభవంతో భక్తులను ఆకర్షిస్తుంది. ఈ ఆలయం ఒక తాబేలు ఆకారంలో ఉన్న కొండపై (కూర్మ పర్వతం) ఉండడంతో దీనిని “కూర్మ పీఠం” అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం, సతీదేవి శరీరంలోని కుడి పాదం (దక్షిణ చరణం) బొటనవేలు ఇక్కడ పడినట్లు చెబుతారు.
15వ శతాబ్దంలో త్రిపుర రాజు ధన్య మాణిక్యకు కలలో దేవి దర్శనమిచ్చి, ఉదయపూర్ సమీపంలోని కొండపై తనను పూజించమని ఆదేశించింది. దేవి ఆదేశం మేరకు రాజు 1501లో ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం బెంగాలీ ఏక్-రత్న శైలిలో నిర్మించబడింది.
గర్భగుడిలో త్రిపుర సుందరి(Tripura Sundari) (5 అడుగుల ఎత్తు)తో పాటు ఛోటిమా (2 అడుగుల ఎత్తు) అనే రెండు విగ్రహాలు ఉన్నాయి. ఈ రెండు విగ్రహాలు ఒకే విధంగా కనిపిస్తాయి. దేవిని కాళీ దేవి రూపంలో పూజిస్తారు. ఆలయానికి తూర్పున కళ్యాణ సాగర్ అనే పవిత్ర చెరువు ఉంది. అందులో పెద్ద చేపలు, తాబేళ్లు శాంతిగా నివసిస్తాయి.
త్రిపుర సుందరిని పూజించే వారికి అందం, బుద్ధి, ధనం , కీర్తి లభిస్తాయని విశ్వాసం. ముఖ్యంగా వివాహం కాని యువతులకు మంచి వరుడు దొరుకుతాడని, దంపతులకు సంతాన భాగ్యం లభిస్తుందని నమ్మకం. నవరాత్రి, దుర్గా పూజ, కాళీ పూజలలో ప్రత్యేక వేడుకలు జరుగుతాయి.
అగర్తలా నుంచి ఉదయపూర్‌కు 55 కిలోమీటర్ల దూరం. అగర్తలా విమానాశ్రయం మరియు రైల్వే స్టేషన్ నుంచి ట్యాక్సీ, బస్సు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.