Nidhivan Temple
బృందావనంలో ఉన్న నిధివన్ ఆలయం(Nidhivan Temple) భారతదేశంలోని మిగతా దేవాలయాల కంటే భిన్నంగా, ఓ అంతుచిక్కని ఆధ్యాత్మిక రహస్యాల పుట్టగా నిలిచిపోయింది. కృష్ణుడు తన జీవితంలో ఎక్కువ భాగం ఈ ప్రాంతంలోనే గడిపాడని, వందలాది గోపికలతో కలిసి రాసలీలలు చేసేవాడని పురాణాలు చెబుతాయి. ఆ పవిత్ర స్థలంలోనే, సూర్యాస్తమయం తర్వాత ఏ ఒక్క ప్రాణికీ ప్రవేశం లేదనే నిబంధన స్థానికులను, పర్యాటకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
రాత్రి సమయంలో శ్రీకృష్ణుడు తన ప్రియసఖి రాధా మరియు గోపికలతో కలిసి నృత్యం చేయడానికి, ఆనందంగా గడపడానికి వస్తాడని ఇక్కడి భక్తులు బలంగా నమ్ముతారు. ఈ నమ్మకం వెనుక తరతరాలుగా వస్తున్న కథనాలు ఉన్నాయి.
ఎవరైనా ఆ రహస్యాన్ని ఛేదించాలని ప్రయత్నిస్తే, అంటే రాత్రిపూట అక్కడకు వెళ్లడం, అక్కడ దొంగచాటుగా నక్కి రాత్రి ఏం జరుగుతుందో చూద్దామని ప్రయత్నించిన వారు పిచ్చివారిగా మారడం లేదా చూపు, మాట కోల్పోవడం వంటి విచిత్ర సంఘటనలు చాలానే జరిగాయని స్థానికులు అంటారు. అందుకే, నిధివన్(Nidhivan Temple)కు సమీపంలో నివసించే వారు రాత్రిపూట తమ కిటికీలు, తలుపులు మూసివేస్తారు. వారి విశ్వాసం ప్రకారం, వారు బయటకు చూసినా లేదా విన్నా కూడా వారికి హాని కలుగుతుందని నమ్ముతారు.
నిధివన్(Nidhivan Temple)లోని చెట్లు చాలా విచిత్రంగా, వంకరగా పెరుగుతాయి. వాటి కొమ్మలు పైకి కాకుండా, కిందకు వంగి ఉంటాయి. ఈ చెట్లే రాత్రిపూట గోపికలుగా మారతాయని, కృష్ణుడు తెల్లవారుజామున వెళ్లిగానే మళ్లు చెట్లుగా మారిపోతాయని నమ్ముతారు. అందుకే ఈ చెట్లను తులసి చెట్లుగా పూజిస్తారు.
ఇక్కడ ఉన్న మరొక అద్భుతం ‘రంగ్ మహల్’ ఆలయం. ఈ ఆలయంలో ప్రతి రాత్రి కృష్ణుడు తన ప్రియురాలు రాధను అలంకరిస్తాడని చెబుతారు. ఆ ఆలయంలోని ఒక మంచం, ఒక పక్కా పెట్టె, ఆభరణాలు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తాయి.
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే, ఈ ప్రాంతంలో ఏ చెట్టుపైనా పక్షులు గూళ్లు కట్టవు, ఏ జంతువులూ నివసించవు. ఇది నిధివన్ యొక్క పవిత్రతకు , ఆధ్యాత్మిక శక్తికి మరో నిదర్శనంగా భావిస్తారు. వినడానికి ఓ కథలా అనిపించినా, నిధివన్ లోని మిస్టరీ ఇప్పటికీ మానవ జ్ఞానానికి అందనిదిగానే మిగిలిపోయింది.