Death
మృత్యువు(Death)కు భయపడని వారు ఉండరు. కానీ జనన మరణాలు సృష్టి నియమాలు. ఈ విశ్వం సమతుల్యంగా ఉండటానికి ఈ చక్రం చాలా అవసరం. మరణం లేకపోతే ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అసలు మరణం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఈ కథ చదివితే మీకు అర్థమవుతుంది.
ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. అతను మృత్యువు (Death)అంటే చాలా భయపడేవాడు. ఒకరోజు తన రాజ్యానికి బయట ఒక చెట్టు కింద ధ్యానంలో కూర్చున్న సన్యాసి దగ్గరకు వెళ్లి.. ఓ స్వామీ! నేను అమరత్వం పొందే ఏదైనా మూలిక ఉంటే దయచేసి నాకు ఇవ్వండి” అని అడిగాడు.అప్పుడు ఆ సన్యాసి, ఓ రాజా! నువ్వు ఎదురుగా ఉన్న రెండు పర్వతాలను దాటి వెళ్లు. అక్కడ నీకు ఒక సరస్సు కనిపిస్తుంది. దాని నీరు తాగితే నీకు అమరత్వం లభిస్తుందని చెప్పాడు.
సన్యాసి చెప్పినట్లుగా రాజు రెండు పర్వతాలను దాటి వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక అందమైన సరస్సు కనిపించింది. ఆ నీరు తాగడానికి రాజు వెళ్తుండగా, ఒక బాధాకరమైన మూలుగు వినిపించింది. రాజు ఆ గొంతును అనుసరించగా, ఒక బలహీనమైన వృద్ధుడు నొప్పితో బాధపడుతూ కనిపించాడు.
రాజు ఆ వృద్ధుడిని, “నీ బాధకు కారణం ఏమిటి?” అని అడిగాడు.అప్పుడు ఆ వృద్ధుడు, “నేను ఈ సరస్సులోని నీరు తాగి అమరుడినయ్యాను. నాకు నూరేళ్లు నిండిన తర్వాత నా కొడుకు నన్ను ఇంటి నుంచి గెంటేశాడు. గత యాభై ఏళ్లుగా నన్ను చూసుకునేవారు లేరు. నా కొడుకు చనిపోయాడు, నా మనుమలు కూడా ఇప్పుడు వృద్ధులయ్యారు. నేను తినడం, నీళ్లు తాగడం కూడా మానేశాను. అయినా నేను ఇంకా చావకుండా బ్రతికే ఉన్నాను” అని చెప్పాడు.
ఆ మాటలు విని రాజు ఆలోచించాడు, “అమరత్వంతో వృద్ధాప్యం వస్తే ఏం లాభం? నేను అమరత్వంతో పాటు యవ్వనం కూడా పొందితే బాగుంటుంది కదా!” అని ఆలోచించి, మళ్లీ సన్యాసి దగ్గరకు వెళ్లి, “స్వామీ! నాకు అమరత్వంతో పాటు యవ్వనం కూడా లభించే మార్గం చెప్పండి” అని అడిగాడు.సన్యాసి నవ్వి, “సరే రాజా! సరస్సు దాటిన తర్వాత నీకు మరో పర్వతం కనిపిస్తుంది. దాన్ని కూడా దాటండి. అక్కడ పసుపు పండ్లతో నిండిన ఒక చెట్టు ఉంటుంది, ఆ పండ్లు తింటే నీకు అమరత్వంతో పాటు యవ్వనం కూడా లభిస్తుంది” అని చెప్పాడు.
రాజు బయలుదేరి ఆ పర్వతాన్ని కూడా దాటాడు. అక్కడ అతనికి పసుపు పండ్లతో నిండిన చెట్టు కనిపించింది. రాజు ఆ పండ్లను తెంపి తినబోతుంటే, కొంతమంది యువకులు గట్టిగా అరుస్తూ పోట్లాడుకోవడం వినిపించింది. ఇంత మారుమూల ప్రదేశంలో ఎవరు పోట్లాడుకుంటున్నారని రాజు ఆశ్చర్యపోయాడు.
అక్కడ నలుగురు యువకులు తీవ్రంగా వాదించుకుంటున్నారు. రాజు వారిని దగ్గరకు వెళ్లి, “మీరు ఎందుకు పోట్లాడుకుంటున్నారు?” అని అడిగాడు.
వారిలో ఒకరు, “నాకు 250 ఏళ్లు, నా పక్కన ఉన్న ఈయనకు 300 ఏళ్లు. ఆయన నాకు ఆస్తి ఇవ్వడం లేదు” అని చెప్పాడు. ఆ వ్యక్తి సమాధానం కోసం రాజు పక్కన ఉన్న వ్యక్తి వైపు చూశాడు.మా నాన్నకు 350 ఏళ్లు. ఆయన తన ఆస్తిని నాకు ఇవ్వనప్పుడు, నేను నా కొడుక్కి ఎలా ఇస్తాను?” అని అతను సమాధానం ఇచ్చాడు. ఆ నలుగురూ తరతరాలుగా ఆస్తి కోసం కొట్లాడుకుంటూ, చివరికి ఆ ఊరి ప్రజలు వారిని గ్రామం నుంచి వెళ్లగొట్టారని చెప్పారు.
రాజుకు ఆశ్చర్యం కలిగింది. అతను వెంటనే సన్యాసి దగ్గరకు తిరిగి వచ్చి, “మరణం(Death) యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు” అని అన్నాడు.అప్పుడు ఆ సన్యాసి నవ్వుతూ ఇలా అన్నారు…
మరణం ఉంది కాబట్టే ప్రపంచంలో ప్రేమ ఉంది. జీవితానికి ఒక కాల పరిమితి ఉంది కాబట్టే ప్రతి క్షణం విలువైంది. మరణాన్ని నివారించే బదులు, మీరు ప్రతిరోజూ, ప్రతిక్షణం సంతోషంగా జీవించండి. మిమ్మల్ని మీరు మార్చుకోండి, అపుడు ప్రపంచం మారుతుంది. ఇది విని రాజు సంతోషంగా తిరిగి వెళతాడు.
ఈ కథ మనకు జీవితం యొక్క నిజమైన అర్థాన్ని, మరణం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది.
ఈ కథ ద్వారా మరణం యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. జీవితానికి ఒక ముగింపు ఉంది కాబట్టే, ప్రతి క్షణం విలువైనదిగా భావించి జీవిస్తాము. మరణం లేకపోతే సమాజంలో మార్పు ఆగిపోతుంది. తరాలు మారడం వల్ల కొత్త ఆలోచనలు, కొత్త విధానాలు వస్తాయి. జీవితం శాశ్వతం కాదని తెలుసు కాబట్టే మనం మన చుట్టూ ఉన్నవారిని ప్రేమించగలుగుతాము. జీవితం చిన్నదని తెలుసు కాబట్టే మనం ఇతరులను క్షమించి, కష్టాలను మరిచి ముందుకు సాగుతాము.అందుకే మరణాన్ని చూసి భయపడటం కాదు, జీవించే ప్రతి క్షణాన్ని సంతోషంగా గడపడమే జీవితం యొక్క అసలు లక్ష్యం.