Shani Trayodashi
శని త్రయోదశి అనేది హిందూ ధర్మంలో అత్యంత శక్తివంతమైన రోజులలో ఒకటిగా చెబుతారు. శనివారంతో పాటు త్రయోదశి తిథి కలిసిన రోజును శని త్రయోదశిగా జరుపుకొంటాము. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడు కర్మ ప్రదాత. మనం చేసే పనులకు తగ్గట్టుగా ఫలితాలను ఇచ్చే దేవుడు. చాలా మంది శని దేవుడు అంటే భయపడతారు కానీ ఆయన కేవలం క్రమశిక్షణను , మన కర్మ ఫలాలను మాత్రమే మనకు అందిస్తాడు.
శని దేవుడు పరమ శివుడికి గొప్ప భక్తుడు. అందుకే శని త్రయోదశి రోజు శివారాధన చేయడం వల్ల శని దోషాల నుంచి ఉపశమనం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఏలినాటి శని, అర్థాష్టమ శని లేదా శని మహాదశ నడుస్తున్న వారు ఈ రోజు అస్సలు వదులుకోకూడదని అంటాయి. ఈ రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి, శని దేవుడి ఆలయానికి వెళ్లి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయాలి. నల్లని వస్త్రాలు, నల్ల నువ్వులుని బెల్లం వంటివి దానం చేయడం వల్ల శని దేవుడు ప్రసన్నుడవుతాడు.
అలాగే ఈ రోజు హనుమాన్ చాలీసా పఠించడం కూడా విశేష ఫలితాలను ఇస్తుందని పండితులు చెబుతారు. ఎందుకంటే హనుమంతుడి భక్తులను శని దేవుడు ఎప్పుడూ ఇబ్బంది పెట్టనని మాట ఇచ్చాడని రామాయణ గాథలు చెబుతున్నాయని అంటారు. ఈ రోజున నియమ నిష్టలతో పూజలు చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోయి, మానసిక ప్రశాంతత , ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. ఎవరైతే ఈ రోజు పేదలకు అన్నదానం చేస్తారో వారికి శని దేవుని అనుగ్రహం మెండుగా ఉంటుంది.
