Abhishek Sharma : డకౌట్..డకౌట్..డకౌట్…అభిషేక్ శర్మకు ఏమైంది ?

Abhishek Sharma : అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఇప్పటి వరకూ ఆడిన మూడు మ్యాచ్ లలోనూ అసలు ఖాతానే తెరవలేదు.

Abhishek Sharma

టీ20 ప్రపంచకప్ ను మరోసారి నిలబెట్టుకోవాలనుకుంటున్న భారత జట్టు ఆ దిశగా అడుగులు వేస్తోంది. గ్రూప్ స్జేజ్ ను ఒక్క ఓటమి లేకుండా ఆడిన అన్ని మ్యాచ్ లు గెలిచి అజేయంగా ముగించింది. ప్రతీ మ్యాచ్ కూ ఒకరిద్దరు ప్లేయర్స్ రాణిస్తూ జట్టు విజయాల్లో తమవంతు కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఒక్క ప్లేయర్ మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్నాడు.

యువరాజ్ స్టైల్ విధ్వంసాన్ని గత కొంతకాలంగా ప్రత్యర్థి జట్లకు రుచి చూపిస్తున్న అభిషేక్ శర్మ(Abhishek Sharma) టీ20 ప్రపంచకప్ లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఇప్పటి వరకూ ఆడిన మూడు మ్యాచ్ లలోనూ అసలు ఖాతానే తెరవలేదు.

హ్యట్రిక్ డకౌట్లతో అటు టీమిండియాకు, ఇటు అభిమానులకు షాకిచ్చాడు. అభిషేక్ నుంచి ఇలాంటి ఆట ఎప్పుడూ ఎవ్వరూ ఊహించనిది. ఎందుకంటే ప్రపంచకప్ కు ముందు అభిషేక్ శర్మ(Abhishek Sharma) ఆట మామూలుగా లేదు. ఆసియాకప్ నుంచీ అభిషేక్ పరుగుల ప్రవాహానికి హద్దే లేకుండా పోయింది. ఆసియాకప్ విజయంలోనూ సత్తా చాటిన ఈ యువ క్రికెటర్ ఇప్పుడు మెగాటోర్నీలో మాత్రం తడబడుతున్నాడు.

అమెరికాపై గోల్డెన్ డక్ ఔట్ అయిన అభిషేక్ శర్మ.. తర్వాత అనారోగ్యంతో నమీబియాతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో రీఎంట్రీలో చెలరేగిపోతాడనుకున్న ఈ డాషింగ్ ఓపెనర్ ఖాతానే తెరవకుండా పెవిలియన్ బాట పట్టాడు.

ఇప్పుడు సూపర్-8 దశకు ముందు నెదర్లాండ్స్‌తోనైనా టచ్ లోకి వస్తాడనుకున్న అభిషేక్ శర్మ అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తూ డకౌటయ్యాడు. తద్వారా వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ డకౌటైన బ్యాటర్ గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.

Abhishek Sharma

ఓవరాల్ గా అభిషేక్ తాను ఆడిన గత 7 ఇన్నింగ్స్ లలో ఐదుసార్లు ఖాతానే తెరవలేదు. ఆ 7 ఇన్నింగ్స్ లలో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉంది. సూపర్ 8కు స్టేజ్ కు ముందు అభిషేక్ శర్మ పేలవ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే తర్వాత సూపర్ 8లో ఆడబోయే మ్యాచ్ లన్నీ పెద్ద జట్లతోనే ఉన్నాయి. పైగా తప్పక గెలవాల్సిన మ్యాచ్ లలో ఇలాగే ఓపెనర్లు సరైన ఆరంభానివ్వలేకపోతే మాత్రం భారీస్కోరు చేయడం కష్టమే.

అలాగే ఛేజింగ్ లో టార్గెట్ ను అందుకోవడమూ కష్టమే. అందుకే నెదర్లాండ్స్ పై అభిషేక్ ఫామ్ లోకి వచ్చి ఉంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఫామ్ లోకి వచ్చి ఒక్క మెరుపు హాఫ్ సెంచరీ చేస్తే అతని కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version