Gautam Gambhir
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir)కు బీసీసీఐ షాకివ్వబోతోందా… టెస్ట్ ఫార్మాట్ లో టీమిండియా వరుస పరాజయాలు అతని పదవికే ఎసరు పెడుతున్నాయా.. అంటే అవుననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు….రెడ్ బాల్ క్రికెట్ లో గంభీర్(Gautam Gambhir) ఫ్లాప్ షో కొనసాగుతున్న వేళ అతన్ని వైట్ బాల్ ఫార్మాట్లకే పరిమితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2024 టీ ట్వంటీ ప్రపంచకప్ తర్వాత రాహుల్ ద్రావిడ్ స్థానంలో గంభీర్ భారత జట్టు కోచ్ గా బాధ్యతలు అందుకున్నాడు. బాధ్యతలు చేపట్టడానికి ముందే బీసీసీఐకి పలు విషయాల్లో కండీషన్లు పెట్టాడు. అతనిపై నమ్మకముంచిన బోర్డు కూడా గంభీర్ (Gautam Gambhir)పెట్టిన చాలా కండీషన్లను ఒప్పుకుంది. ఇదే క్రమంలో జట్టులోనూ పలు మార్పులకు శ్రీకారం చుట్టాడు. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్ళను రిటైర్మెంట్ ప్రకటించి సాగనంపడంలో గంభీర్ దే ప్రధాన పాత్ర అన్నది చాలా మంది భావన.
అదే సమయంలో పలువురు యువ ఆటగాళ్లను, తనకంటూ ఒక టీమ్ ను తయారు చేసుకున్నాడన్న విమర్శలు ఉన్నాయి. గిల్ ను సారథిగా ప్రమోట్ చేయడం, హర్షిత్ రాణాకు పదే పదే అవకాశాలివ్వడం వంటివి జరిగాయి. మరోవైపు జట్టును కోచ్ గా నడిపించడంలో ఫలితాలు మాత్రం మిశ్రమంగానే వచ్చాయి. వన్డే, టీ ట్వంటీ ఫార్మాట్ లో మంచి ఫలితాలే వచ్చినా టెస్ట్ ఫార్మాట్ లో మాత్రం ఘోరమైన పరాజయాలు ఎదురయ్యాయి.
ముఖ్యంగా సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో సిరీస్ ఓటమి అది కూడా వైట్ వాష్ పరాభవం మాయని మచ్చగా మిగిలిపోయింది. పిచ్ ల విషయంలోనూ, తుది జట్టు కూర్పులోనూ గంభీర్ (Gautam Gambhir)వ్యూహాలు బెడిసికొట్టి భారత క్రికెట్ టీమ్ కు ఘోరమైన ఫలితాలను అందించాయి. కివీస్ చేతిలో చిత్తుగా ఓడిన తర్వాత ఆస్ట్రేలియా టూర్ లో సైతం టెస్టుల్లో పరాజయం ఎదురైంది. ఎన్నో అంచనాలు పెట్టుకుని వెళ్లిన టీమిండియా కంగారూల చేతిలో మట్టికరిచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది.
ఇటీవల సౌతాఫ్రికా సిరీస్ లోనూ భారత్ 0-2తో అవమానకరమైన ఓటమిని ఎదుర్కొంది. అప్పటి నుంచి టెస్టుల్లో హెడ్ కోచ్ గా గంభీర్ తీసేయాలన్న డిమాండ్ మొదలైంది. మొదట్లో బీసీసీఐ దీనిపై పెద్ద స్పందించకున్నా ఇప్పుడు మాత్రం ఆలోచనలో పడిందే. పనిలో పనిగా వీవీఎస్ లక్ష్మణ్ తో చర్చలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే లక్ష్మణ్ మాత్రం ప్రస్తుతం తాను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో హెడ్ ఆఫ్ క్రికెట్ పదవిలోనే కొనసాగుతానని చెప్పినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో బీసీసీఐ ఏం చేస్తుందనేది చూడాలి. ద్రావిడ్ కోచ్ గా ఉన్నప్పడు ప్రతీ ప్లేయర్ , అతని రోల్ , అవకాశాలు వంటి వాటిపై స్పష్టత ఉండేది. గంభీర్ వచ్చిన తర్వాత మితిమీరిన ప్రయోగాలతో నాశనం చేస్తున్నాడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రానున్న టీ ట్వంటీ ప్రపంచకప్ లో ఫలితం తర్వాత గంభీర్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. ఒకవేళ లక్ష్మణ్ కాకున్నా టెస్టుల్లో భారత్ కు మరో కోచ్ ను నియమించే అంశంపై బోర్డు కొత్త ఏడాదిలో నిర్ణయం తీసుకునే ఛాన్సుంది.
