Bumrah
సొంతగడ్డపై భారత బౌలర్లు అదరగొట్టారు. కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టులో స్టార్ పేసర్ బుమ్రా(Bumrah)దెబ్బకు సౌతాఫ్రికా విలవిలలాడింది. బుమ్రా (Bumrah)పదునైన బౌలింగ్ కు సఫారీ బ్యాటర్లు క్రీజులో నిలబడలేక చేతులెత్తేశారు. 5 వికెట్లతో సౌతాఫ్రికాను దారుణంగా దెబ్బకొట్టిన బుమ్రా పలు రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. తక్కువ ఎకానమీతో 200 పైగా వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఓవరాల్ గా తొలి రోజు ఆటలో బుమ్రా షో హైలెట్ గా నిలిచింది.
ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 159 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవూమా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓ దశలో 57/0తో పటిష్ట స్థితిలో నిలిచిన ప్రొటీస్ టీమ్.. ఆ తర్వాత అనూహ్యంగా కుప్పకూలింది. 55 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. భారత స్పీడ్ స్టర్ జస్‌ప్రీత్ బుమ్రా .. ఐదు వికెట్లతో సత్తాచాటాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ప్రొటీస్ కెప్టెన్ టెంబా బవూమా.. తమ బ్యాటర్లపై నమ్మకంతో ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ.. దక్షిణాప్రికా ఓపెనర్లు ధాటిగా బ్యాటింగ్ చేశారు. వన్డే తరహాలో పరుగులు రాబట్టారు. దీంతో 10 ఓవర్లలోనే ఆ జట్టు స్కోరు వికెట్ నష్టపోకుండా 50 పరుగుల మార్కును ధాటింది. ఈ సమయంలో బుమ్రా(Bumrah).. షాక్ ఇచ్చాడు.
వరుస ఓవర్లలో ఓపెనర్లు ర్యాన్ రికల్టన్, మార్‌క్రమ్‌ని పెవిలియన్ పంపించాడు. దీంతో తొలి సెషన్ ముగిసే సరికి దక్షిణాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది.ఇక రెండో సెషన్‌లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. భారత బౌలర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ సెషన్‌లో 25 ఓవర్లలో దక్షిణాఫ్రికా 49 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది.
టీ బ్రేక్ తర్వాత జస్‌ప్రీత్ బుమ్రా.. ఒకే ఓవర్‌లో మిగతా రెండు వికెట్లు తీసి..దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌కు తెరదించాడు. దీంతో ప్రొటీస్ టీమ్ 55 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది.భారత బౌలర్లలో అత్యధికంగా జస్‌ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీశాడు. మహమ్మద్ సిరాజ్ 2, కుల్‌దీప్ యాదవ్ 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు.
తర్వాత భారత్ తొలి ఇన్నింగ్స్ లో త్వరగానే జైశ్వాల్ వికెట్ కోల్పోయింది. అంచనాలు పెట్టుకున్న జైస్వాల్ కేవలం 12 పరుగులకే ఔటయ్యాడు. తర్వాత కేఎల్ రాహుల్, అనూహ్యంగా బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ దక్కించుకున్న వాషింగ్టన్ సుందర్ మరో వికెట్ పడకుండా తొలిరోజు ఆటను ముగించారు. తొలిరోజు ఆటముగిసే సమయానికి భారత్ 1 వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 13, సుందర్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా 122 పరుగులు వెనుకబడి ఉండగా.. రెండోరోజు భారీస్కోరు సాధిస్తే పట్టుబిగించేఅవకాశముంటుంది.
