Cricket
ప్రపంచ క్రికెట్ (Cricket)లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కు ఉండే క్రేజే వేరు.. ఇరు జట్లు మైదానంలో తలపడుతున్నాయంటే యుద్ధవాతావరణమే కనిపిస్తుంటుంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్ లో చర్చల మీద చర్చలు చేస్తుంటారు. పాక్ ఫ్యాన్స్ ను ట్రోల్ చేస్తూ మన ఆధిపత్యాన్ని గుర్తు చేస్తూ వారిని ఆడుకుంటుంటారు. గత ఏడాది దాయాదుల మధ్య క్రికెట్ సమరాలు అభిమానులను బాగానే అలరించాయి. ఎందుకంటే గతంతో పోలిస్తే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఈ మ్యాచ్ లకు క్రేజ్ పెరిగింది.
పహల్గామ్ ఉగ్రదాడికి కౌంటర్ గా ఆపరేషన్ సిందూర్ తో మన సైన్యం పాక్ కు దిమ్మతిరిగేలా చేసింది. ఈ ఘటనల తర్వాత భారత్-పాక్ మ్యాచ్(Cricket) లు వివాదాలకు కేరాఫ్ గా మారాయి. పాక్ ఆటగాళ్ళకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా భారత్ క్రికెటర్లు ఇష్టపడలేదు. తద్వారా వారికి గ్రౌండ్ లో కూడా బుద్ది చెప్పారు. దీనిపై పాక్ క్రికెట్ బోర్డు హడావుడి చేసినా మనోళ్లు అస్సలు పట్టించుకోలేదు.
ఇప్పుడు కొత్త ఏడాదిలోనూ భారత్, పాకిస్థాన్ మ్యాచ్ లు అభిమానులను అలరించబోతున్నాయి. ద్వైపాక్షిక సిరీస్ లు రద్దయిపోవడంతో చిరకాల ప్రత్యర్థులు కేవలం ఐసీసీ టోర్నీలు ఆసియాకప్ లో మాత్రమే ఢీకొంటున్నాయి. కొత్త ఏడాదిలో భారత్, పాక్ జట్ల మధ్య అండర్ 19 ప్రపంచకప్‌తో పాటు పురుషుల టీ20 ప్రపంచకప్ , మహిళల టీ20 ప్రపంచకప్‌లలో తలపడేందుకు రెడీ అయ్యాయి.
ముందు జనవరి 15 నుంచి స్టార్ట్ అయ్యే అండర్ 19 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ తలపడే ఛాన్సుంది. కానీ లీగ్ స్టేజ్ లో మాత్రం కాదు. ఎందుకంటే తొలిసారి భారత్, పాకిస్థాన్ వేర్వేరు గ్రూపుల్లో ఉన్నాయి. దీంతో లీగ్ స్టేజితో పాటు సూపర్-6లో కూడా ఎదురుపడే ఛాన్స్ లేదు. ఒకవేళ ఇరు జట్లు మెరుగైన ప్రదర్శన కనబర్చితే సెమీఫైనల్ లేదా ఫైనల్లో ఢీకొనే అవకాశముంది.
తర్వాత ఐసీసీ (Cricket)పురుషుల టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాక్ మధ్య మ్యాచ్ ఖరారైంది. ఈ మెగా టోర్నీకి భారత్, శ్రీలంక కలిసి ఆతిథ్యమిస్తున్నాయి. అయితే ముందస్తు ఒప్పందంలో భాగంగా తటస్థ వేదికపైనే ఢీకొంటాయి. దీంతో కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఫిబ్రవరి 15 దాయాది జట్లు తలపడతాయి. ఇరు జట్లు మెరుగైన ప్రదర్శన చేస్తే.. సెమీఫైనల్, ఫైనల్లో మరోసారి తలపడనున్నాయి.
మహిళల టీ20(Cricket) ప్రపంచకప్ 2026లో మాత్రం ఇరు జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఇంగ్లండ్ వేదికగా జరిగే ఈ టోర్నీలో భారత్ టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగబోతోంది. పాకిస్థాన్ తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జూన్ 14న తలపడుతుంది. ఇరు జట్లు మెరుగ్గా రాణంచి ముందంజ వేస్తే సెమీఫైనల్ లేదా ఫైనల్లో మరోసారి తలపడే అవకాశముంటుంది. ఇదిలా ఉంటే గతేడాది భారత్, పాకిస్థాన్ జట్లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఒకసారి ..ఆసియాకప్‌లో మూడు సార్లు, మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఒకసారి ఆడగా.. అండర్ 19 ఆసియాకప్‌లో రెండు సార్లు తలపడ్డాయి. వీటిలో అండర్ 19 ఆసియా కప్ ఫైనల్ మినహా ప్రతీ మ్యాచ్‌లోనూ భారత్ జట్టే పై చేయి సాధించింది.
