Cricket
చాలా రోజులకు భారత క్రికెట్ (Cricket)జట్టుకు విరామం దొరికింది. ఎప్పుడూ బిజీ షెడ్యూల్, వరుస సిరీస్ లతో తీరిక లేకుండా గడిపే భారత ఆటగాళ్లకు మూడు వారాలు హాలిడేస్ దొరికాయి. కొందరు క్రికెటర్లు విజయ్ హజారే ట్రోఫీ ఆడుతుండగా.. మరికొందరు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఓవరాల్‌గా చూస్తే భారత ఆటగాళ్ళకు 20 రోజుల రెస్ట్ అంటే పెద్ద విషయమే.
ఎందుకంటే ఏడాది పొడవునా (Cricket)సిరీస్ వెనుక సిరీస్ లు, ఐపీఎల్ .. అలా బిజీబిజీగానే గడుపుతుంటారు. అయితే ఫార్మాట్ కో టీమ్ తరహాలో కాస్త వెసులుబాటు దొరికినా ఏదో ఒక సిరీస్ తో మన క్రికెటర్లు మాత్రం తీరిక లేకుండా ఉంటుంటారు. ఇప్పుడు 2025కు సంబంధించి టీమిండియా షెడ్యూల్ కు తెరపడింది. సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ ట్వంటీలు ఆడిన భారత్ కు మళ్లీ కొత్త ఏడాది జనవరి రెండో వారంలోనే సిరీస్ ఉంటుంది.
జనవరి 11 నుంచి న్యూజిలాండ్ తో సిరీస్ మొదలవుతుంది. టీ 20 ప్రపంచకప్ కు ముందు భారత జట్టు ఆడే చివరి అంతర్జాతీయ సిరీస్ ఇదే. న్యూజిలాండ్ తో సొంతగడ్డపై మూడు వన్డేలు, ఐదు టీ ట్వంటీలు ఆడుతుంది. వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతుండడంతో అభిమానుల్లో మంచి క్రేజ్ నెలకొంది. 2027 ప్రపంచకప్ ఆడడమే లక్ష్యంగా రోకో జోడీ ప్రిపేర్ అవుతోంది. ఇటీవల ఆసీస్ టూర్ లోనూ, తర్వాత సౌతాఫ్రికాపై రోహిత్ , కోహ్లీ దుమ్మురేపారు.
వీరిద్దరి ఎంట్రీతోనే కివీస్ తో సిరీస్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతకంటే ముందు విజయ్ హజారే ట్రోఫీలోనూ కొంతమంది స్టార్ ప్లేయర్స్ సందడి చేయనున్నారు. బీసీసీఐ ఆదేశాలతో సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ దేశవాళీ క్రికెట్ (Cricket)ఆాడాలన్న రూల్ ను కోహ్లీ, పంత్ , రాహుల్ , గిల్, అర్షదీప్ వంటి క్రికెటర్లు ఫాలో అవుతున్నారు. ఇదిలా ఉంటే కివీస్ తో ఐదు టీ ట్వంటీల సిరీస్ కూడా ప్రపంచకప్ కు ముందు టీమిండియాకు సన్నాహకంగా ఉపయోగపడనుంది.
ఈ సిరీస్ తర్వాత నుంచి మళ్లీ ఎడతెరపి లేని క్రికెట్ (Cricket)భారత ఆటగాళ్ల కోసం ఎదురుచూస్తోంది. కివీస్ తో సిరీస్ ముగిసిన వారానికే టీ20 ప్రపంచకప్ ప్రారంభం కాబోతోంది. అది ముగిసిన వెంటనే ఐదు రోజుల వ్యవధిలో ఐపీఎల్ షురూ అవుతుంది. ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత మళ్లీ వరుస అంతర్జాతీయ సిరీస్ లు టీమిండియా కోసం ఎదురుచూస్తున్నాయి.
