Blind champions
క్రీడా చరిత్రలో భారత దివ్యాంగ(Blind champions) మహిళా క్రీడాకారులు అద్భుతమైన అధ్యాయాన్ని లిఖించారు. శ్రీలంక రాజధాని కొలంబోలోని చారిత్రక పి.సారా ఓవల్ మైదానంలో ఆదివారం (నవంబర్ 23) జరిగిన మొట్టమొదటి మహిళల టీ20 వరల్డ్ కప్ క్రికెట్ ఫర్ ది బ్లైండ్ 2025(Blind champions) ఫైనల్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. తుది పోరులో నేపాల్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి, తొలి ప్రపంచ కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయం వారి అసమాన ధైర్యానికి, అంకితభావానికి నిదర్శనం. టోర్నమెంట్ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత్, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఛాంపియన్‌గా నిలవడం విశేషం.
భారత కెప్టెన్ దీపిక టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకోవడం విజయానికి కీలక మైలురాయిగా నిలిచింది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన క్రమశిక్షణతో బౌలింగ్ చేయడంతో, నేపాల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవలం 114 పరుగులు మాత్రమే చేయగలిగింది.
115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాటర్లు ఏమాత్రం తొందరపడకుండా, లక్ష్యాన్ని కేవలం 12.1 ఓవర్లలోనే పూర్తి చేసి సంచలనం సృష్టించారు.
ఫూలా సరెన్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మెరిసింది. ఆమె 27 బంతుల్లో 44 నాటౌట్ పరుగులు చేసి, జట్టును విజయతీరాలకు చేర్చింది.
మరో బ్యాట్స్‌మెన్ కరుణ కే కూడా 27 బంతుల్లో 42 పరుగులు చేసి, ఫూలా సరెన్‌తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. వీరిద్దరి వీరోచిత ప్రదర్శనతో భారత్ అలవోకగా విజయాన్ని నమోదు చేసింది.
ప్రైజ్ మనీపై చర్చ.. అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రపంచ కప్ గెలిస్తే, విజేత జట్టుపై, క్రీడాకారులపై కోట్లాది రూపాయల నగదు బహుమతులు, ప్రోత్సాహకాలు కురుస్తుంటాయి. అయితే, ఈ చారిత్రక విజయాన్ని అందుకున్న భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు లభించిన ప్రైజ్ మనీ ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
సాధారణ మహిళల జట్టు కానీ ఇతర ఆటల్లో క్రీడాకారులెవరైనా సరే మన దేశం నుంచి ఆడి.. వన్డే ప్రపంచ కప్ గెలిచినప్పుడు వారిని ఆకాశానికి ఎత్తేసేవారు. కోట్లాది రూపాయల నగదు బహుమతులు పోటీలు పడి ప్రకటించేవారు కానీ ఇప్పుడు అలాంటి సీన్ చూద్దామన్నా కనిపించడం లేదు. తొలిసారి ప్రపంచ కప్ గెలిచిన దివ్యాంగ మహిళా క్రీడాకారిణుల(blind champions)ను కనీసం పట్టించుకోవడం లేదు. అంతెందుకు మీడియా కూడా వారిని పెద్దగా హైలెట్ చేయలేదు.
అంతకుముందు జరిగిన ప్రధాన మహిళా (Blind champions)క్రికెట్ టోర్నమెంట్‌లో గెలిచిన సాధారణ (మెయిన్‌స్ట్రీమ్) జట్టుకు కోట్లాది రూపాయల ప్రోత్సాహకాలు ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి.
కానీ దేశానికి తొలి అంధ మహిళల ప్రపంచకప్‌ను అందించిన ఈ ఛాంపియన్లకు మాత్రం అధికారికంగా ఇప్పటివరకు పెద్దగా ఆర్థిక ప్రోత్సాహకాలు ప్రకటించకపోవడం విచారకరం.కోట్లాది రూపాయల విజయం ముందు తాము ఇచ్చేది చాలా చిన్న మొత్తం అన్న సంగతి మరచిపోయింది.
ప్రస్తుతానికి, ఒక ప్రైవేట్ సంస్థ (చింటల్స్ గ్రూప్) మాత్రమే జట్టులోని ప్రతి క్రీడాకారిణికి కేవలం రూ.1,00,000 (లక్ష రూపాయలు) ప్రకటించింది.
చూడలేని స్థితిలో ఉండి కూడా, ఇంత గొప్ప సాహసాన్ని చేసి, దేశానికి బంగారు కప్పును సాధించిపెట్టిన క్రీడాకారిణులను అధికారికంగా సన్మానించడంలో, వారికి తగిన ఆర్థిక ప్రోత్సాహం అందించడంలో ప్రభుత్వం, క్రికెట్ సంఘాలు ఎందుకు వెనుకడుగు వేస్తున్నాయి? శారీరక సామర్థ్యం ఆధారంగా అథ్లెట్లకు ఇచ్చే ప్రోత్సాహకాల్లో ఈ వ్యత్యాసం చూపడం సరైందేనా? క్రీడాకారుల దృఢ సంకల్పాన్ని (Determination), నిబద్ధతను (Commitment) చూసి గౌరవించకుండా, కేవలం చూపు లేని కారణం చేత చిన్న చూపు చూడటం న్యాయమా? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఈ విజయం కేవలం ఆట కాదు, ఇది ఆత్మవిశ్వాసానికి, పోరాటస్ఫూర్తికి నిదర్శనం. ఈ స్ఫూర్తికి తగిన గౌరవం దక్కాలని క్రీడాభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
అయితే, ఈ ఛాంపియన్ జట్టు దేశానికి తిరిగి వచ్చిన తర్వాత, CABI , వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మెరుగైన ఆర్థిక సహాయం, ప్రోత్సాహం లభిస్తుందని క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ఇంత గొప్ప గౌరవం తెచ్చిన అంధ క్రీడాకారిణులకు మరింత ఎక్కువ ప్రోత్సాహం, మెరుగైన గుర్తింపు దక్కాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.
