Shubman Gill: హై హై నాయకా కెప్టెన్సీ ఒత్తిడి లేని గిల్

Shubman Gill: సాధారణంగా కెప్టెన్సీ వచ్చినప్పుడు ఉండే ఒత్తిడితో వ్యక్తిగత ఆట చాలా వరకూ ప్రభావితమవుతుంది. దీనిని తట్టుకోలేకే గతంలో చాలామంది సారథ్య బాధ్యతలు వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Shubman Gill

క్రికెట్ లో జట్టును నడిపించడం అంత ఈజీ కాదు.. పైగా భారీ అంచనాలుండే టీమిండియాను సారథ్య బాధ్యతలు ఎంతటి సవాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఖచ్చితంగా కెప్టెన్సీ ఒత్తిడి ఉంటుంది.. కానీ ఆ ఒత్తిడిని తట్టుకుని నిలబడడం, వ్యక్తిగతంగా రాణించడం, జట్టును సక్సెస్ ఫుల్ గా లీడ్ చేయడం చాలా కష్టం. గతంలో గొప్ప గొప్ప ఆటగాళ్ళు సైతం గ్రౌండ్ లో అదరగొట్టినా కెప్టెన్ గా మాత్రం చేతులెత్తేసినవారే. అయితే భారత క్రికెట్ జట్టులో ఇప్పుడు గిల్(Shubman Gill) శకం మొదలైంది.

రోహిత్ శర్మ నుంచి ముందు టెస్ట్ జట్టు పగ్గాలు అందుకున్న ఈ యువ ఆటగాడు రానున్న ఆసీస్ టూర్ తో వన్డే కెప్టెన్సీ కూడా చేయబోతున్నాడు. అయితే కెప్టెన్సీ ఒత్తిడి గిల్ పై ఏమీ కనిపించడం లేదు. ఇది ఇంగ్లాండ్ టూర్ తోనే రుజువైంది. ఐదు టెస్టుల సిరీస్ లో 700 ప్లస్ రన్స్ చేయడమంటే సాధారణ విషయం కాదు. కెప్టెన్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే వ్యక్తిగతంగానూ గిల్ ఇంగ్లీష్ గడ్డపై దుమ్మురేపాడు.

సాధారణంగా కెప్టెన్సీ వచ్చినప్పుడు ఉండే ఒత్తిడితో వ్యక్తిగత ఆట చాలా వరకూ ప్రభావితమవుతుంది. దీనిని తట్టుకోలేకే గతంలో చాలామంది సారథ్య బాధ్యతలు వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కోహ్లీ ఈ ప్రెజర్ ను అధిగమించలేకనే కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడు. కానీ నాయకుడిగా నడిపించేటప్పుడు వ్యక్తిగతంగానూ రాణించే విషయంలో ధోనీ బాటలోనే గిల్(Shubman Gill) వెళుతున్నట్టు కనిపిస్తోంది.

Shubman Gill

ఎందుకంటే ఇంగ్లాండ్ గడ్డపై నిరూపించుకున్న గిల్ ఇప్పుడు స్వదేశంలోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. విండీస్ తో రెండో టెస్టులో గిల్ ఆడిన ఆటే దీనికి ఉదాహరణ. రెడ్ బాల్ క్రికెట్ లో ఎంత ఓపిగ్గా ఆడాలో యువ ఆటగాళ్ళకు చూపిస్తూ స్కోరును ముందుకు తీసుకెళ్ళిన తీరు ఆకట్టుకుంది. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే విషయంలోనూ, సొంత రికార్డులను చూసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నాడు

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏ ఆటగాడి సత్తా అయినా, కెప్టెన్ టాలెంట్ అయినా టెస్ట్ క్రికెట్ ను ప్రామాణికంగా తీసుకుంటుంటారు. గిల్(Shubman Gill) కూడా దీనికి మినహాయింపు కాదు. ఫార్మాట్ కు తగ్గట్టుగా తన కెప్టెన్సీనే కాదు తన ఆటను కూడా మార్చుకుంటూ సెలక్టర్లు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు.

కోచ్ గంభీర్ సిఫార్సు కారణంగానే గిల్ కు కెప్టెన్సీ దక్కిందనేది కాదనలేని వాస్తవం. అయితే గంభీర్ సిఫార్సులు కొంతకాలమే కాపాడుతుంది. సారథిగా తన ప్రయాణం సుధీర్ఘంగా సాగాలంటే మాత్రం ఖచ్చితంగా తనదైన మార్క్ ఉండాల్సిందే. ఈ విషయంలో గిల్ మార్క్ మొదలైనట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడే పూర్తి 100 శాతం అంచనాకు రాలేకున్నా ఏడాది చివరికల్లా ఆస్ట్రేలియా , సౌతాఫ్రికా వంటి పెద్ద జట్లతో సిరీస్ తర్వాత గిల్ కెప్టెన్సీ విషయంలో పూర్తి క్లారిటీ రావడం ఖాయమని అంచనా వేస్తున్నారు.

Exit mobile version