Bangladesh:బంగ్లాదేశ్‌కు ఐసీసీ గట్టి షాక్.. 240 కోట్ల భారీ నష్టంతో పాటు బంగ్లాకు ఏం జరగనుంది?

Bangladesh: ఐసీసీ నుంచి ప్రతి ఏటా వచ్చే ఆదాయంలో సుమారు 240 కోట్ల రూపాయల వాటాను బంగ్లా కోల్పోయే ప్రమాదముంది.

Bangladesh

అంతర్జాతీయ క్రికెట్‌లో తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. 2026లో భారత్ , శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ (Bangladesh) తేల్చి చెప్పేసింది. భారతదేశంలో భద్రతా కారణాలను సాకుగా చూపించిన ఆ దేశ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ .. తమ జట్టును పంపేది లేదని ప్రకటించారు.

అయితే తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని బంగ్లా చేసిన విజ్ఞప్తిని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తిరస్కరించడమే కాకుండా, భారత్‌లో ఎలాంటి భద్రతా ముప్పు లేదని కాస్త క్లియర్‌గానే చెప్పింది. దీంతో తమ మొండివైఖరి చూపించిన బంగ్లాదేశ్ టోర్నమెంట్ నుంచే తప్పుకోవాల్సి వచ్చింది.

కాగా ఈ నిర్ణయం వల్ల బంగ్లాదేశ్ (Bangladesh) క్రికెట్ బోర్డుకు కోలుకోలేని ఆర్థిక దెబ్బ తగలబోతోంది. ఐసీసీ నుంచి ప్రతి ఏటా వచ్చే ఆదాయంలో సుమారు 240 కోట్ల రూపాయల వాటాను బంగ్లా కోల్పోయే ప్రమాదముంది.

అంతేకాకుండా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రసార హక్కులు , స్పాన్సర్‌షిప్‌ల ద్వారా వచ్చే ఆదాయంలో దాదాపు 60 శాతం నష్టం వాటిల్లుతుందని అంచనా. ఆటగాళ్లకు అందే మ్యాచ్ ఫీజులు, బోనస్‌లు కూడా నిలిచిపోనున్నాయి.

గతంలో పాకిస్తాన్ కూడా భారత్‌లో ఆడేందుకు ఇలాగే కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా, చివరికి దిగివచ్చింది. కానీ బంగ్లాదేశ్ (Bangladesh)మాత్రం వెనక్కి తగ్గకపోవడం ఆ దేశ క్రికెట్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నట్లే అవుతుంది. .

Bangladesh

ఈ వివాదం కేవలం వరల్డ్ కప్‌తోనే ఆగకుండా ద్వైపాక్షిక సిరీస్‌లపైన కూడా ప్రభావం చూపబోతోంది. 2025లో జరగాల్సిన భారత్ – బంగ్లాదేశ్ సిరీస్ ఇప్పటికే వాయిదా పడగా, తాజా పరిణామాల వల్ల టీమిండియా ఆ పర్యటనను పూర్తిగా రద్దు చేసుకునే అవకాశం ఉంది.

బీసీసీఐ వంటి శక్తివంతమైన బోర్డుతో విభేదించడం వల్ల.. బంగ్లాదేశ్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని ఇబ్బందులు ఎదురవ్వడం ఖాయం. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక ఆసియా జట్టు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక.. రాజకీయ కారణాలు ఉన్నాయనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏది ఏమయినా రాజకీయాలు వేరు, క్రీడలు వేరన్న విషయాన్ని ఆ దేశం గుర్తించకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. దీనిపై ముందు ముందు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూడాలి మరి.

Reels:రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా? మీకు తెలీకుండానే మీ మెదడులో జరుగుతుంది ఇదే..

Exit mobile version