Ind vs Aus
ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా టీ ట్వంటీ సిరీస్ లో అదరగొడుతోంది. రెండో టీ ట్వంటీలో ఓడిపోయి వెనుకబడినప్పటకీ.. తర్వాత వరుసగా రెండు విజయాలతో ఆధిక్యంలో నిలిచింది. తాజాగా గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన నాలుగో టీ ట్వంటీ(Ind vs Aus)లో కంగారూలను 48 పరుగుల తేడాతో చిత్తు చేసింది. బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ సమిష్టిగా రాణించి ఆతిథ్య జట్టును దెబ్బకొట్టింది.
ముఖ్యంగా అక్షర్ పటేల్ ఆల్ రౌండ్ షోతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు హాఫ్ సెంచరీ పార్టనర్ షిప్ నమోదు చేశారు. కానీ అభిషేక్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. 25 పరుగులకు ఔటవగా.. గిల్ ఆచితూచి ఆడుతూ సింగిల్స్ కే పరిమితమయ్యాడు. ఫామ్ అందుకునేందుకు అతను నిదానంగా ఆడడంతో అనుకున్నంత వేగంగా పరుగులు రాలేదు.
అయితే వన్ డౌన్ లో శివమ్ దూబేను పంపించన ప్రయోగం ఓ మాదిరిగా ఫలితాన్నిచ్చింది. దూబే 22 పరుగులకు ఔటవగా… గిల్ 46 రన్స్ చేశాడు. సూర్యకుమార్ వచ్చీరావడంతోనే రెండు భారీ సిక్సర్లు బాదినా 20 పరుగులకే ఔటయ్యాడు. తర్వాత తిలక్ వర్మ, జితేశ్ శర్మ , వాషింగ్టన్ నుంవర్ వెంటవెంటనే ఔటయ్యారు. చివర్లో వరుస వికెట్లు కోల్పోయినప్పటకీ.. అక్షర్ పటేల్ మెరుపులు మెరిపించాడు. దీంతో భారత్(Ind vs Aus) 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 3. ఆడమ్ జంపా 3 వికెట్లు పడగొట్టారు.
168 పరుగుల లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా ఓపెనర్లు మిఛెల్ మార్ష్, పార్ట్ తొలి వికెట్ కు 37 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. పవర్ ప్లేలోనే స్పిన్నర్ల ఎంట్రీతో ఆసీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. అంచనాలు పెట్టుకున్న ఏ ఒక్కరూ రాణించలేదు. పేస్ ఆల్ రౌండర్ దూబే ఒకవైపు, స్పిన్నర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ నుండర్ మరోవైపు చెలరేగడంతో ఆసీస్ కు కష్టాలు తప్పలేదు. ఇంగ్లీస్ , టిమ్ డేవిడ్ , ఫిలిప్ నిరాశపరిచారు. దాదాపు 2 నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన మాక్స్ వెల్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు.
వరుణ్ చక్రవర్తి అతన్ని క్లీన్ బౌల్డ్ చేయగా.. చివర్లో వాషింగ్టన్ సుందర్ ఆసీస్ టెయిలెండర్ల పని పట్టాడు. దీంతో ఆస్ట్రేలియా కేవలం 119 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో సుందర్ 3, అక్షర్ పటేల్ 2, దూబే 2 వికెట్లు తీసారు. అర్షదీప్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ తీశారు. 21 రన్స్ పాటు 2 వికెట్లు తీసిన అక్షర్ పటేల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. చివరి టీ ట్వంటీ శనివారం బ్రిస్బేన్లో జరుగుతుంది.
