IND vs AUS
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియాకు టీ ట్వంటీ సిరీస్(IND vs AUS) లోనూ శుభారంభం దక్కలేదు. తొలి టీ ట్వంటీ వర్షంతో రద్దవగా.. మెల్ బోర్న్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆసీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఊహించినట్టుగానే తుది జట్టులో భారత్ ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే పిచ్ ను అర్థం చేసుకోకుండా దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన భారత బ్యాటర్లు మూల్యం చెల్లించుకున్నారు. కేవలం 49 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది.
ఓపెనర్ అభిషేక్ శర్మ తప్పిస్తే.. మిగిలిన బ్యాటర్లంతా ఇలా వచ్చి అలా వెళ్ళారు. గిల్ 5 , సంజూ శాంసన్ 2, సూర్యకుమార్ యాదవ్ 1, అక్షర్ పటేల్ 7, తిలక్ వర్మ డకౌటయ్యారు. దీంతో భారత్ కనీసం వంద పరుగులైనా స్కోర్ చేస్తుందా అనిపించింది. ఈ దశలో అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. ఆశ్చర్యకరమైన విషయమేమింటే బౌలర్ హర్షత్ రాణా కూడా మెరుపులు మెరిపించాడు.
అభిషేక్ తో కలిసి ఆరో వికెట్ కు 56 పరుగులు జోడించారు. రెండో వన్డేలో బ్యాటర్ గా మెరుపులు మెరిపించిన హర్షిత్ ఇప్పుడు టీ ట్వంటీలోనూ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ తో కలిసి స్కోర్ 100 దాటించగలిగాడు. 33 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ తో 35 రన్స్ చేశాడు. అటు అభిషేక్ శర్మ 37 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. దీంతో భారత్ 18.4 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూలింది. భారత్ ఇన్నింగ్స్ లో 8 మంది సింగిల్ డిజిట్ కే ఔటయ్యారు. కేవలం అభిషేక్, హర్షిత్ రాణా మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఆసీస్ బౌలర్లలో హ్యాజిల్ వుడ్ 3, ఎల్లిస్ 2, బార్ట్ లెట్ 2 వికెట్లు తీశారు.
ఛేజింగ్ (IND vs AUS)లో ఆస్ట్రేలియా దూకుడుగా ఆడింది. భారత బ్యాటర్లు చేతులెత్తేసిన పిచ్ పైనే ఆసీస్ ఓపెనర్లు అదరగొట్టారు. తొలి వికెట్ కు 4.3 ఓవర్లలోనే 51 పరుగులు జోడించారు. హెడ్ 15 బంతుల్లో 28, మార్ష్ 28 బంతుల్లో 46 పరుగులు చేశారు. జోస్ ఇంగ్లీస్ 20 పరుగులకు ఔటవగా.. చివర్లో ఆసీస్ వరుస వికెట్లు కోల్పోయింది. అప్పటికే విజయానికి చేరువవడంతో మరో 4 వికెట్లు కోల్పోయినా ఫలితంలో తేడా రాలేదు.
చివరికి ఆసీస్ 13.2 ఓవర్లలో టార్గెట్ అందుకుంది. 13 పరుగులకు 3 వికెట్లు తీసిన హ్యాజిల్ వుడ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. ఈ విజయంతో ఐదు టీ ట్వంటీల సిరీస్ లో ఆసీస్ కు 1-0 ఆధిక్యం దక్కింది. మూడో టీ ట్వంటీ హోబార్ట్ లో ఆదివారం జరుగుతుంది.
