Seven Sages
భారతీయ సనాతన ధర్మంలో సప్త ఋషులకు అత్యంత ఉన్నతమైన స్థానం ఉందని మనకందరికీ తెలుసు. అయితే ఆధునిక కాలంలో కూడా సప్త ఋషులు (Seven Sages) మనకు కనిపిస్తారా అంటే, కచ్చితంగా కనిపిస్తారని మన పెద్దలు చెబుతారు. ప్రతిరోజూ సాయంత్రం వేళ ఆకాశంలో ఉత్తరం దిశగా మనం చూస్తే ఏడు నక్షత్రాల (Seven Stars) సమూహం కనిపిస్తుంది, దానినే సప్తర్షి మండలం అంటారు. ఇది చాలామందికి తెలుసు.
అందుకే ప్రతిరోజూ దంపతులు సాయంత్రం పూట ఈ సప్త ఋషులకు (Seven Sages), అరుంధతీ వశిష్ఠులకు నమస్కరించుకోవడం మన సంప్రదాయంలో ఒక భాగం. మన వివాహ వేడుకల్లో పురోహితులు అరుంధతీ దర్శనం చేయించడం వెనుకున్న ఉద్దేశ్యం కూడా ఇదే. మన భారతీయ సంతతి అంతా ఏదో ఒక ఋషి (Sage) వంశానుక్రమం నుంచే ఉద్భవించింది. అందుకే మనకు గోత్రాలు ఉన్నాయని పెద్దలు చెబుతారు.
మన మూల పురుషులైన ఆ మహర్షులను స్మరించుకోవడం మనందరి బాధ్యత. సప్త ఋషులుగా (Seven Sages) మనం ఏడుగురు మహర్షులను పూజిస్తుంటాము. వారు కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని ,వసిష్ఠుడు. ఈ ఏడుగురు మహర్షులు లోక కల్యాణం కోసం, వేద జ్ఞానాన్ని రక్షించడం కోసం నిరంతరం తపస్సు చేశారు.
కశ్యప మహర్షిని ప్రజాపతిగా పిలుస్తారు. కశ్యప మహర్షిద్వారానే ఈ సృష్టిలోని అనేక జీవరాశులు ఉద్భవించాయి. అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుడు,మహా పతివ్రత అనసూయ భర్త. భరద్వాజ మహర్షి గొప్ప జ్ఞాని , ద్రోణాచార్యుని తండ్రి. ఇక విశ్వామిత్రుడు ఒక రాజర్షిగా ఉండి తన తపోబలంతో బ్రహ్మర్షిగా ఎదిగిన గొప్ప వ్యక్తి అతను. గౌతమ మహర్షి అహల్య భర్త అలాగే గోదావరి నదిని భూమికి తీసుకువచ్చిన పుణ్యమూర్తి. వసిష్ఠ మహర్షి సూర్యవంశానికి గురువు అలాగే అరుంధతి భర్త. జమదగ్ని మహర్షి పరశురాముని తండ్రి అలాగే గొప్ప తపస్వి కూడా.
ఈ ఏడుగురు మహర్షులు తమ తపోశక్తితో విశ్వంలోని తేజస్సును గ్రహించి మానవాళికి జ్ఞానాన్ని పంచారు. ఆకాశంలో ఈ ఏడు నక్షత్రాల మండలాన్ని దర్శించుకోవడం వల్ల మనకున్న సకల దోషాలు తొలగిపోతాయని, మనస్సు నిర్మలంగా మారుతుందని పెద్దల నమ్మకం. ముఖ్యంగా వివాహమైన కొత్త దంపతులు అరుంధతీ వశిష్ఠులను దర్శించుకుంటే వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా, ఆదర్శవంతంగా ఉంటుందని చెబుతారు.
అంతేకాదు మరణం ఆసన్నమైన వారికి లేదా కంటి చూపు సమస్యలు తీవ్రంగా ఉన్నవారికి ఈ సప్తర్షి మండల దర్శనం, అరుంధతీ దర్శనం అవ్వదని పురాణాలు చెబుతున్నాయి. అంటే ఈ నక్షత్రాలను స్పష్టంగా చూడగలగడం అనేది మన ఆరోగ్యానికి , పుణ్యబలానికి ఒక సంకేతంగా చెబుతారు. ప్రకృతిలో భాగమైన ఈ నక్షత్ర మండలాలను నిత్యం స్మరించుకుంటూ, మన మూలాలను గౌరవించడం వల్ల మన జీవితంలో శాంతి, సౌభాగ్యాలు చేకూరుతాయి. అందుకే వీలైన ప్రతి సాయంత్రం ఉత్తర దిశగా ఆకాశంలో.. ఆ మహర్షులను దర్శించుకుని వారి ఆశీస్సులు పొందడం ఎంతో మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు.
Tata Harrier EV :టాటా హారియర్ EV- అదిరిపోయే ఫీచర్లు.. ఈ కారును కొనడం తెలివైన నిర్ణయమేనా?
