Ind Vs Aus
వన్డే సిరీస్ చేజార్చుకున్న టీమిండియా (Ind Vs Aus)ఆస్ట్రేలియా టూర్ లో ఇప్పుడు పొట్టి క్రికెట్ సమరానికి రెడీ అయింది. ఐదు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ బుధవారం కాన్ బెర్రా వేదికగా జరగనుంది. వన్డే సిరీస్ లో పరాజయం పాలైనప్పటకీ చివరి మ్యాచ్(Ind Vs Aus) లో గెలిచి వైట్ వాష్ పరాభవం తప్పించుకున్న భారత్ కాన్ఫిడెన్స్ కూడా పెంచుకుంది.
టీ ట్వంటీ సిరీస్ కోసం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న భారత్ కు యువ ఆటగాళ్ళే ప్రధాన బలం. ఐపీఎల్ ప్రదర్శనలతో టీ ట్వంటీ ఫార్మాట్ లో వీరంతా దుమ్మురేపుతున్నారు. బ్యాటర్లు, బౌలర్లు అదరగొట్టేస్తున్నారు. నిజానికి గత ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్ గెలిచిన తర్వాత నుంచీ షార్ట్ ఫార్మాట్ లో భారత్ కు ఎదురే లేకుండా పోయింది. వరుస సిరీస్ విజయాలతో టీమిండియా డామినేషన్ కొనసాగుతూనే ఉంది. అదే సమయంలో టీ20ల్లో ఆస్ట్రేలియా రికార్డు పేలవంగా ఉంది.
వన్డే సిరీస్ ఓటమికి రివేంజ్ తీర్చుకోవాలనుకుంటున్న టీమిండియాకు టీ ట్వంటీ సిరీస్ మంచి అవకాశం. ఎందుకంటే ఇటీవల ఆసియాకప్ లో మన యువ ఆటగాళ్ళందరూ అద్భుతంగా ఆడి టైటిల్ గెలిచారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఎలాంటి ఇన్నింగ్స్ లు ఆడారో అందరూ చూశారు. అలాగే బౌలింగ్ లో బుమ్రా, దూబే, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ లతో సత్తా చాటారు.
ఇప్పుడు ఆసీస్ గడ్డపైనా అదే జోరు కొనసాగించాలని ఎదురుచూస్తున్నారు. తుది జట్టు ఎంపిక మాత్రం కాస్ట క్లిష్టంగా మారింది. బ్యాటింగ్ పరంగా ఎటువంటి ఇబ్బందీ లేకున్నా.. బౌలింగ్ కూర్పులో మాత్రం ఎవరికి చోటు దక్కుతుందనేది చూడాలి. ఎందుకంటే స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్ కు చోటు ఖాయం.. మిగిలిన మరో ప్లేస్ కోసం కుల్దీప్, వరుణ్ చక్రవర్తి పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో ఒకరికే చోటు దక్కుతుంది. పలు సందర్భాల్లో కుల్దీప్ నే బెంచ్ పరిమితం చేస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో కోచ్ గంభీర్ తొలి టీ ట్వంటీకి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనే ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మరోవైపు పేస్ విభాగంలో బుమ్రాకు చోటు ఖాయం… అదే సమయంలో హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్ లలో ఒకరికే ప్లేస్ ఉంటుంది. టీ20ల్లో అద్భుతమైన బౌలర్ గా పేరున్న అర్షదీప్ ను తప్పించడం అసాధ్యంగానే కనిపిస్తున్నా… సిడ్నీ వన్డేతో తన సత్తా నిరూపించుకున్న హర్షిత్ రాణాను తీసుకునే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. మరోవైపు(Ind Vs Aus)ఆస్ట్రేలియాను కూడా తక్కువ అంచనా వేసేందుకు వీలులేదు.
గత రికార్డులు ఎలా ఉన్న ఆ జట్టులో కూడా టీ20 స్పెషలిస్టులు ఎక్కువగానే ఉన్నారు. షార్ట్ , హెడ్, మార్ష్ , స్టోయినిస్. టిమ్ డేవిడ్ లాంటి హిట్టర్స్ ఒంటి చేత్తో మ్యాచ్ ను మలుపు తిప్పేయగల సత్తా ఉన్నవాళ్ళే. అటు బౌలింగ్ లోనూ హ్యాజిల్ వుడ్, నాథన్ ఎల్లిస్ , తన్వీర్ సంఘా లాంటి ప్లేయర్స్ కీలకం కాబోతున్నారు. ఇక మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న కాన్ బెర్రా పిచ్ స్లో బౌలర్లకు అనుకూలించినా మ్యాచ్ సాగే కొద్దీ బ్యాటర్లకు సహకరిస్తుంది. దీంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.
