T20
టీ20 ఫార్మాట్ లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ మరో సిరీస్ ను ఖాతాలో వేసుకున్న భారత్ ఇప్పుడు కివీస్ పై నాలుగో మ్యాచ్ కు సిద్ధమైంది. బుధవారం విశాఖపట్నం వేదికగా జరిగే మ్యాచ్ లోనూ గెలిచి ఆధిక్యాన్ని 4-0కు పెంచుకోవాలని భావిస్తోంది.
ఇప్పటికే సిరీస్ గెలవడంతో మిగిలిన రెండు టీ ట్వంటీల్లో(T20) రిజర్వ్ బెంచ్ ప్లేయర్స్ కు అవకాశం ఇవ్వనున్నారు. దీంతో తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. మరో 10 రోజుల్లో ప్రపంచకప్ మొదలుకానున్న నేపథ్యంలో వర్క్ లోడ్ మేనేజ్ మెంట్ ను దృష్టిలో ఉంచుకుని కీలక ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడం ఖాయమైంది. ఈ జాబితాలో జస్ప్రీత్ బుమ్రా, హార్థిక్ పాండ్యా , హర్షిత్ రాణా ఉన్నట్టు తెలుస్తోంది. బుమ్రాకు ఈ సిరీస్ లో ఇప్పటికే ఒక మ్యాచ్ నుంచి రెస్ట్ ఇచ్చారు. ఇప్పుడు సిరీస్ ఫలితం తేలిపోవడంతో మరో మ్యాచ్ కు కూడా విశ్రాంతినిచ్చే అవకాశాలున్నాయి.
ఒకవేళ బుమ్రాను కొనసాగించాలని అనుకుంటే హర్షిత్ రాణాకు రెస్ట్ ఇవ్వొచ్చు. అప్పుడు అతని స్థానంలో అర్షదీప్ సింగ్ జట్టులోకి వస్తాడు. రెండో టీ ట్వంటీలో అర్షదీప్ భారీగా పరుగులిచ్చేశాడు. దీంతో తన లైన్ అండ్ లెంగ్త్ అందుకునేందుకు అతనికి ఈ మ్యాచ్ మంచి అవకాశంగా చెప్పొచ్చు. అలాగే ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాకు కూడా రెస్ట్ ఇస్తారని భావిస్తున్నారు. పాండ్యా స్థానంలో శ్రేయాస్ అయ్యర్ జట్టులోకి వచ్చే ఛాన్సుంది. తిలక్ వర్మ ఇంకా ఫిట్ నెస్ సాధించకపోవడంతో శ్రేయాస్ ను చివరి 2 టీ ట్వంటీ(T20) లకు కూడా బీసీసీఐ కొనసాగిస్తోంది.
అటు మూడో టీ20(T20)కి తప్పించిన వరుణ్ చక్రవర్తీ జట్టులోకి వస్తే రవి బిష్ణోయ్ నే తప్పించాల్సి ఉంటుంది. కానీ మూడో టీ ట్వంటీలో బిష్ణోయ్ 2 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో మెగా టోర్నీ దృష్ట్యా వరుణ్ ను రెస్ట్ మోడ్ లోనే ఉంచే అవకాశముంది. ఈ రెండు మార్పులు తప్పిస్తే మిగిలిన జట్టంతా యధావిధిగానే ఉండనుంది. ఈ క్రమంలో ఓపెనర్ సంజూ శాంసన్ కు మరో అవకాశం ఇవ్వనున్నారు. నిజానికి ఈ సిరీస్ లో ఇప్పటి వరకూ జరిగిన మూడు మ్యాచ్ లలోనూ సంజూ నిరాశపరిచాడు. బ్యాటింగ్ పిచ్ లపై కూడా అతను విఫలమవుతుండడంతో టీమ్ మేనేట్ మెంట్ కు ఆందోళన కలిగిస్తోంది. మెగాటోర్నీకి సంజూపై చాలా అంచనాలున్నాయి. దీంతో ఈ సిరీస్ చివరి రెండు మ్యాచ్ ల్లోనైనా సంజూ శాంసన్ ఫామ్ అందుకోవాలని మేనేజ్ మెంట్ కోరుకుంటోంది.
ఒకవేళ ఈ సిరీస్ లో అతను వైఫల్యాల బాట వీడకుంటే మాత్రం ప్రపంచకప్ తుది జట్టులో ఇషాన్ కిషన్ కే ప్రాధాన్యత దక్కొచ్చు. ఎందుకంటే ఇషాన్ తనకిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. ఇక అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లో ఉండడం కలిసొచ్చే అంశం.
మరోవైపు వరుసగా హ్యాట్రిక్ ఓటములతో సిరీస్ చేజార్చుకున్నా మిగిలిన రెండు మ్యాచ్ లలో గెలిచి పరువు దక్కించుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది. దీని కోసం జట్టులో మార్పులు కూడా చేసింది. ప్రస్తుతం పేసర్ క్రిస్టియన్ క్లార్క్, బ్యాటర్ టీమ్ రాబిన్సన్‌లను జట్టు నుంచి విడుదల చేసింది. ఈ ఇద్దరి స్థానాల్లో జిమ్మీ నిషమ్, ల్యూకీ ఫెర్గూసన్‌లను జట్టులోకి తీసుకుంది. త్రివేండ్రం వేదికగా జరిగే ఆఖరికి టీ20కి ఫిన్ అలెన్ కూడా అందుబాటులోకి రానున్నాడు. ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న విశాఖపట్నం పిచ్ కూడా బ్యాటర్లకే అనుకూలం. దీంతో మరో హైస్కోరింగ్ ఎన్ కౌంటర్ అభిమానులను అలరించబోతోంది.
Women Voters:మున్సిపల్ కురుక్షేత్రంలో మహిళా ఓటర్లదే ఫైనల్ కాల్.. ఈ పోరులో గెలుపెవరిది?
